Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతా ఒక భ్రమ
గెలుపుకర్థం యుద్ధమేనా తండ్రీ !
యుద్ధమంటే ప్రసంగమా, మనదికాని కాయంలోకి సెగలురేపి, సలసల మరిగే జ్వరమవడమా?
చల్లారుతున్న జోష్‌లోకి పుల్లలెగదోసి
దేశభక్తి ప్రమాణాల కొలతలు నిర్ధారించుకోవడమా?
నినాదాల హౌరుతో సరిహద్దుల మధ్య తెగి
నెత్తుటి కాసారమవడమేనా?
ఊళ్ళ మీద, నగరాల మీద శవాల ఊపిరిని ఎగదోయడమా?
రాల్చే కన్నీటి సహానుభూతులతో
మనిషికి మనిషికి మధ్య మతాల అడ్డుగోడల నిర్మాణమా - గెలుపుకర్థం!
అయితే ఇక ఆశలకు, ఆశయాలకు
యుద్ధమే సర్వకాల అనివార్యమైందంటావ్!?
వెనుకటి శోకాల గొంతునులిమి
ఈనాటి వెక్కిళ్ళ కన్నీటి చారికల మీద
నీ మాటల కవాతు
ఇదేనా తండ్రి - నువ్వు కోరుకునే గెలుపుకర్థం!
2
చప్పట్లు మోగించి, దీపాలు వెలిగించి
ఏ దారిద్య్రాన్ని పారదోలాం, ఏ చీకట్లను చెరిపివేసాం
ఇంకా ఎంతకాలం తండ్రీ, ఈ భ్రమల సాగదీత
నా బాల్యం నుండీ మోసిన బేతాళుని భుజానికి,
నిట్టాడిలా నిలబడలేక నిట్టనిలువునా విరుగుతున్న వెన్నముకకు కూసింత విరామం ఎప్పుడు?
విరామం లేదు
యుద్ధం రెండు పాయలుగా పారే నెత్తుటి ఏరు.
ఒకటి ఎదురుగా పారుతున్నది చూడ్డం
మరొకటి యుద్ధంగురించి వింటూనో, మాట్లాడుతూనో
ఇంకో పాయగా పారుతున్నట్టు
నాకు నేనో, నీకు నువ్వో భ్రమకు లోనవడం
3
నీ ఉచ్చుల అల్లికల కైవారంలోనే
అంధత్వాన్నీ మాలగా కట్టుకుంటున్న దేశం
ఇప్పుడు మారణకాండల కళారూపాల జాతర.
యుద్ధపు అనుభూతి
నెత్తుటి ఆలోచనల్లో, కల్పిస్తున్న భ్రమల్లో
గిరికీలు కొడుతూ బతకడం
- ఇబ్రహీం నిర్గుణ్, 9063696968