Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానికి
లోలకాల్ని అంటుకట్టి
గుండ్రంగ తిప్పినట్టు..
పంట కేంద్రకంగ
పచ్చని పొలం చుట్టు
చలనపాదపు కంచై
కావలి కాసే అనేకావతాల
వత్తం హాలికుడు !
మబ్బుల సుక్క మొలవంగనే
మెలకువ తలుపు రెక్కతెరిచి
వ్యవసాయంల పడి
సూరీడు పడమట వాలినా
వాడని చెమట పుష్పం కర్షకుడు !
విత్తనపు పురిటినొప్పుల్ని
భుజాలపై కాడెద్దుగ మోసి
పెయ్యంత పుండై
ధాన్యపు కుప్పలే కలల పాన్పుగ
పవళించే శ్రమజీవి !
శ్రమొకడిది
సౌఖ్యమొక్కడిదన్నట్లు
కండ్లముందే దళారీ మిడతలు
దండుగ దోచుకుంటున్నప్పుడు
నోరుమెదపని మౌనతపస్వి !
పుడమికి
పట్టెడన్నం పెట్టడానికి
కంటిపై కునుకు లేక
పచ్చి ఒడ్డుపై
పచ్చడి మెతుకులు తినే
సతత పత్రహరితం!
పొద్దు తార సుట్టు
తిర్గుడు పువ్వులా తిర్గుతూ
మధు బువ్వను పండించే
ధరణిపై ధన్యజీవి ఒక్క రైతే !
ఇప్పుడు..
రైతే రాజన్నది పాతబడ్డ వాక్యం!
రాజ్యమే..
రైతుది కావాలనేది కొత్తపాట !!
- అశోక్ అవారి, 9000576581