Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టిలో మాణిక్యాలను తయారు చేసిన తాను
బ్రతుకు దెరువు కొరకు
మట్టితట్ట నెత్తినెత్తుకుండు.
భావి పౌరుల భవితకు
బంగారు బాటలేసిన తానిప్పుడు
ముళ్ళదారిలో కళ్ళనీళ్ళు పెడుతుండు.
జటిల సమస్యలకు సమాధానం చెప్పినతాను
ఆర్థిక సమస్యల నుండి
ఎలా బయటపడాలో తెలియక
సతమతమైతుండు
ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలపై
నిలిపిన తానిప్పుడు
కటిక దారిద్య్రపు ఊబిలో కూరుకుపోతుండు
కష్టాల కడలిదాటలేక
తన కన్నీటి వెతలు చెప్పలేక
మౌన మునిలా మిగిలిపోయిండు
సుద్దముక్కలా అరిగిపోతున్నా
కొవ్వొత్తిలా కరిగిపోతున్నా
అర్ధాకలితో అలమటిస్తున్నా
బడిపిల్లల బాగుకై పరితపిస్తుండు
సాయం అడగడానికి ఆత్మాభిమానం అడ్డువస్తుంటే
చేసేదేమీలేక
చేతులు కట్టుకొని వెనుతిరుగుతుండు
కార్పోరేట్ శక్తుల ముందు తన శక్తినంత ధారవోసి
చిత్తుచిత్తుగా ఓడిపోయిండు
ఎందరి జీవితాలకు వెలుగునిచ్చాడో, కానీ..
చివరికి గ్రహణం పట్టిన సూర్యునిలా
మిగిలిపోయిండు
అందుకేనేమో మా ప్రయివేట్ పంతులు
ఎవరికి కానివాడిలా
ప్రభుత్వాలకు పట్టనోడిలా
యాజమాన్యాలకు విస్తరాకులా మిగిలిపోయిండు
చేసేదేమీలేక గుండె బరువెక్కి నిలిచిపోయిండు
- గ్యారా అమర్, 9989506310