రాష్ట్ర పన్నులు
1. అమ్మకం పన్ను: 1916లో జర్మనీ దేశంలో మొదటగా అమ్మకం పన్నును విధించారు. మన దేశంలో 1937లో మొదటి సారిగా ఈ పన్నును విధించారు. 1939లో సంయుక్త మద్రాసు రాష్ట్రం మొదటిసారిగా ఈ పన్నును విధించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకం పన్నును విధించడానికి వీలుగా 1951లో పార్లమెంట్ ఆమోదం లభించింది.
2. రాష్ట్ర ఎక్సైజ్ సుంకం: ఆల్కహాల్‌తో తయారైన మధ్యపానీయాలు, నల్ల మందు మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం విధిస్తాయి. వీటి రేట్లు వేర్వేరు రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయి
3. మోటారు వాహనాలపై పన్ను: అన్ని రాష్ట్రాలు మోటారు వాహనాలపై పన్ను విధిస్తున్నాయి. పన్ను విధింపుకు ఆధారం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. దేశంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం వలన వీటి ద్వారా రాష్ట్రాలు గడించే ఆదాయం కూడా పెరుగుతున్నది. మన రాష్ట్రంలో మోటారు వాహనాలపై జీవితకాల పన్ను (Life Tax) వసూలు చేస్తున్నారు.
4. స్టాంపులు రిజిస్ట్రేషన్లు: బీమా పాలసీలు, వాటాలు బదిలీ మొదలైన వాటి మీద స్టాంపు డ్యూటీని కేంద్రం విధిస్తే, రాష్ట్రాలు వసూలు చేసి వాడుకుంటాయి. స్టాంపులలో జ్యుడిషియల్ స్టాంపులు, నాన్ జ్యుడిషియల్ స్టాంపులు అనే రెండు రకాలుగా ఉంటాయి. జ్యుడిషియల్ స్టాంపులు న్యాయ స్థానాలలో వసూలు చేసే రుసుములు, మెజిస్ట్రేట్ దవీకరణ కోసం మొదలైనవి. వాణిజ్య పరమైన లావాదేవీలకు ఉపయోగించే వాటిని నాన్ జ్యుడిషియల్ స్టాంపులు అంటారు. ఉదాహరణకు ఆస్తుల యాజమాన్యం బదిలీ, ఒప్పందాలు, ప్రామిసరీ నోట్లు మొదలైనవి.
5. వినోదం పన్ను: సినిమాలు, నాటకాలు, సర్కస్ ప్రదర్శనలు, క్రీడలు ఈ పన్ను పరిధిలోనికి వస్తాయి. టికెట్ విలువను బట్టి పన్ను విధిస్తుంటారు. వివిధ రాష్ట్రాలలో ఈ పన్ను రేటు వేరు వేరుగా ఉంటుంది. ప్రవేశ రుసుముతో కలిపి ఈ పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు. అయితే వసూళ్లు తక్కువ చూపించి పన్ను ఎగవేయడం మూలానా కొన్ని రాష్ట్రాలు స్లాబ్ పద్ధతిని ప్రవేశ పెట్టాయి.
6. స్థానిక సంస్థల పన్నులు: భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు పని చేస్తాయి కాబట్టి, రాష్ట్ర జాబితాలోని కొన్ని పన్నులను వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాలలో స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నులు ఒకే విధంగా లేవు. అయినప్పటికీ స్థూలంగా వీటి పరిధిలో ఉన్న పన్నులను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.
1. భూమి భవనాలపై పన్ను.
2. వాహనాలపై పన్ను.
3. వినోదాలపై పన్ను.
4. ప్రకటనలపై పన్ను.
5. ఆక్ట్రారు, టెర్మినల్ పన్ను.
6. వ త్తి పన్ను
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (Goods and services Tax) : మనదేశ పన్నుల సంస్కరణలలో అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న ''గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్'' జూలై 01, 2017 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న అనేక రకాల పరోక్ష పన్నులు అంతర్థానమై పోయి వాటి స్థానంలో జీఎస్టీ విధానం అమలు లోనికి వచ్చింది. ప్రస్తుతం వస్తువులపై రకరకాల పన్నులుండవు. వాటి స్థానంలో జీఎస్టీ ఒక్కటే వుంటుంది. ప్రపంచంలో జీఎస్టీని మొదటగా 1954 లో ఫ్రాన్స్ దేశం అమలు చేసింది. తర్వాత కాలంలో జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, కెనడా, యనైటెడ్ కింగ్డమ్. ఆస్ట్రేలియా, బ్రెజిల్ మొదలైన దేశాలు అమలు చేశాయి. 1991లో రష్యా, 1994లో చైనా దేశాలు జీఎస్టీని అమలు చేశాయి. ప్రస్తుతం 140 దేశాలలో ఈ విధానం అమలులో వుంది. కెనడాలో అమలు చేస్తున్న ద్వంద్వ జీఎస్టీ విధానం ఆధారంగా మన దేశంలో జీఎస్టీ విధానం రూపకల్పన జరిగింది.
మన దేశం సమాఖ్య దేశం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధిలోని శాసనాల ద్వారా పన్నులను విధించే అధికారం కలిగి వుంటాయి. రాజ్యాంగం నిర్ధేశించిన విధులు, అధికారాలు కలిగి వుండడం వల్ల వాటి నిర్వహణకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవలిసి వుంటుంది. జీఎస్టీ ప్రవేశపెట్టడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో పన్నులు విధించి వసూలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. 101 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 246ఎ అధికరణం జీఎస్టీని విధించి వసూలు చేసే అధికారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది.
జీఎస్టీలో విలీనమయ్యే కేంద్ర పన్నులు
- కేంద్ర ఎక్సైజ్ సుంకం.
- ఎక్సైజ్ సుంకాలు (ఔషధాలు, సౌందర్య సాధనాలు)
- అదనపు ఎక్సైజ్ సుంకాలు
- కస్టమ్ సుంకాలు (Countervailing Duty)
- సర్వీస్ టాక్స్
- వస్తు సేవలపై కేంద్ర సర్ చార్జీలు, సెస్‌లు
- జీఎస్టీలో విలీనమయ్యే రాష్ట్ర పన్నులు
- విలువ ఆధారిత పన్ను(వ్యాట్)
- అమ్మకం పన్ను
- విలాస సుంకం
- ప్రవేశ సుంకం
- వినోదం మరియు ఉల్లాసపు పన్ను (స్థానిక సంస్థలు విధించేవి మినహా)
- ప్రకటనలపై విధించే పన్ను
- కొనుగోలు సుంకం
- లాటరీలు, పందాలు, జూదంపై విధించే పన్ను
- జీఎస్టీలో విలీనం చేయనివి ( వీటిపై వ్యాట్, కేంద్ర ఎక్సైజ్ కొనసాగుతుంది)
- మద్యం
- పెట్రోలియం
- ముడిచమురు
- మోటారు స్పిరిట్
- హైస్పీడ్ డిజల్
- సహజవాయువు
- విద్యుచ్ఛక్తి
జీఎస్టీలో 0, 3, 5, 12, 18, 28 శాతాలతో ఆరు శ్లాబులు వున్నాయి. పన్నులేనివి జీరో లోనికి, బంగారం మాత్రమే 3% శ్లాబులో వుంది. జీఎస్టీలో విలీనం చేయనివి మినహా మిగతావన్నీ ఇతర శ్లాబులలో చేర్చారు. జీఎస్టీ వివిధ స్లాబులలో చేర్చే వస్తువులను సమీక్షించి ప్రభుత్వం వాటి స్లాబులను మార్చడం వల్ల అమలైన నాటి నుండి నేటికి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
జీఎస్టీలోను మూడు రకాలున్నాయి.
సెంట్రల్ జీఎస్టీ (CGST)- కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ సుంకాలు, అదనపు ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్ సుంకాలు (Countervailing Duty), సర్వీస్ టాక్స్ దీనిలో విలీనం అవుతాయి.
స్టేట్ జీఎస్టీ (SGST)- విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ సుంకం, వినోదం మరియు ఉల్లాసపు పన్ను, ప్రకటనలపై విధించే పన్ను, కొనుగోలు సుంకం, లాటరీలు, పందాలు, జూదంపై విధించే పన్ను దీనిలో విలీనం అవుతాయి.
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST)- ఏవైనా ఉత్పత్తులు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన పక్షంలో ఐ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ కూడా ఒకే రకమైన పన్ను వుంటుంది. ఈ పన్ను ఉత్పత్తి చేసిన రాష్ట్రానికి కాకుండా వినియోగం చేసిన రాష్ట్రానికి చెందుతుంది.
- డాక్టర్.అక్కెనపల్లి మీనయ్య
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, నల్లగొండ
రిటైర్డ్ (ఎచ్.ఓ.డి) ఎకనామిక్స్ నాగార్టున ప్రభుత్వ కళాశాల
ఫోన్:9490138118