1. ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి దాని లక్షణాలను వివరిం చండి?
నిర్వచనాలు :-
1. 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే నిర్వహించుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం' అని అబ్రహాం లింకన్ నిర్వచించారు.
2. 'ఎవరు ఎలా పరిపాలించాలో నిర్ణయించే మార్గమే ప్రజాస్వామ్యం' - మేకైవర్
ప్రజాస్వామ్య లక్షణాలు
1. స్వేచ్ఛ : ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం అనే పునాదు లపైనే ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజలకు స్వేచ్ఛను అందించడమే.
2. సమానత్వం: ప్రజాస్వామ్యం అనేది 'ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉరడే ప్రభుత్వం' అని ప్రొఫెసర్ సిలి పేర్కొన్నాడు.
3. స్వతంత్ర న్యాయ శాఖ : ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కచ్చితంగా న్యాయశాఖ స్వతంత్రంగా పని చేస్తుంది.
4. పౌర ప్రభుత్వం : ప్రజల చేత ఓటు ద్వారా ఎన్నుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. 'ప్రజాస్వామ్యం బాలెట్ ప్రభుత్వమే గానీ బుల్లెట్ ప్రభుత్వం కాదు'
5. అధిక సంఖ్యాకుల పాలన : ప్రతి ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకైతే మెజారిటీ శాసనసభ సీట్లు దక్కుతాయో, ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. అంటే అధిక సంఖ్యాకుల మద్దతు ప్రభుత్వం' అని చెప్పవచ్చు.
6. రాజ్యాంగ నిబంధనలు అమలు : ప్రజాస్వామ్యం కచ్చితంగా రాజ్యాంగ నిబంధనలపైనే పనిచేస్తుంది.
7. సామ్రాజ్యవాదానికి యుద్ధానికి వ్యతిరేకం : ప్రజాస్వామ్యం అంతర్జాతీయ శాంతి సమానత్వం, న్యాయం, సహకారం అనే అంశాలకు విలువనిస్తుంది.
8. బల ప్రయోగాలకు అవకాశం లేదు : ప్రజా సంక్షేమం పేరిట కూడా బలవంతపు విధానాలు, చట్టాలు ప్రజలపై రుద్దడానికి అవకాశం లేదు.
9. మానవ హక్కులకు ప్రాధాన్యత : ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వ్యక్తుల మానవ హక్కులకు ప్రాధాన్యత లభిస్తుంది.
10. వాక్ స్వాతంత్య్రం : ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉంది.
2. ప్రజాస్వామ్య రకాలను వివరించండి?
ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించ వచ్చు. అవి 1.ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
2. పరోక్ష ప్రజాస్వామ్యం
1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం : ఏ ప్రభుత్వంలోనైతే ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొంటారో దానినే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వ విధానాలను, శాసనాలను ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించ డంలో ముందుంటారు. ప్రత్యక్ష ప్రజా స్వామ్యంలో ప్రజల ఇష్టం ప్రత్యక్షంగా వ్యక్తీకరించ బడుతుంది. కాని వారు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కాదు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు :
ఎ. ప్రజాభిప్రాయ సేకరణ,
బి. ప్రజాభిప్రాయ నివేదన
సి. పునరాయనం
డి. ప్రజా నిర్ణయం
ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోనూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉంది. స్విట్జర్లాండ్ కొన్ని చిన్న కాంటాన్లలో ఏప్రిల్ లేదా మే నెలల్లో ఒక ఆదివారం రోజు సమావేశమై వారికి అవసరమైన ప్రతినిధులను ఎన్నుకుని పనులు చేయించుకుంటారు.
2. పరోక్ష ప్రజాస్వామ్యం: పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ విధమైన ప్రజాస్వామ్యంలో తక్షణ సార్వభౌమాధి కారానికి అంతిమ సార్వభౌమాధికారానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభ రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. కాబట్టి శాసనసభ అనేది తక్షణ సార్వభౌమాధికారిగా చెప్పవచ్చు. అంతిమ సార్వభౌమాధికార ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యేక కాల పరిమితికి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ కాల పరిమితికి వారు ఎన్నుకున్న ప్రతినిధుల కార్యక్రమాలను సమీక్ష చేస్తారు. ఒక వేళ ఈ కాలపరిమితిలో వీరితో సంతృప్తి చెందకపోతే వచ్చే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోరు. తిరస్కరిస్తారు.
ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం చేత సమర్థవంతంగా నడుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఈ ప్రాతినిధ్య ప్రభుత్వంలో అధికారం ప్రజలదే.
3. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్య ప్రయోజనాలు, లోపాలు వివరించండి?
జవాబు : గ్రీక్ పదాలైన 'డెమోస్', 'క్రెటియో' అనే పదాల కలయికగా ఆంగ్ల భాషలో 'డెమోక్రసీ' అనే పదం పుట్టింది. 'డెమోస్' అంటే 'ప్రజలు', 'క్రెటియో' అంటే 'అధికారం' అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం అని అర్థం.
ప్రజాస్వామ్య ప్రయోజనాలు
1. సమర్థవంతమైన ప్రభుత్వం: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల ఇష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు బాధ్యత వహిస్తూ వారికి సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు.
2. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ : ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు.
3. సమానత్వానికి ప్రాధాన్యత: ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజ కీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది.
4 . రాజకీయ చైతన్యం : నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్య వేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు.
5. దేశభక్తిని పెంపొందిస్తుంది : ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరుచూ ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకో వడాన్ని బాధ్యతగా భావిస్తారు. రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందిస్తారు.
ప్రజాస్వామ్య లోపాలు
1. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం: ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసన సభల నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది.
2. బలహీనమైన అస్థిర ప్రభుత్వం : ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరుచుగా మారుతుంటాయి.
3. అల్ప సంఖ్యాక ప్రభుత్వం : వాస్తవంగా గమనిస్తే ప్రజా స్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింభించదు. ప్రజాస్వామ్యం అంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతు గల ప్రభుత్వం అని అంటారు.
4. సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం: ప్రజాస్వామ్యం సాంప్రదాయకంగా పని చేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు.
5. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం : ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభా వ్యవహారాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధానాల నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.
4. ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన నిబంధన లను వివరించండి?
పరిచయం :- అన్ని ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అతి ముఖ్యమైనది. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తప్పనిసరిగా కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. కొన్ని దేశాలలో ప్రజాస్వామ్యంచాలా విజయ వంతమైంది.
1. నిష్పక్షపాతమైన, స్వతంత్ర పత్రికలు: స్వతంత్ర, నిష్పక్షపాత మైన పత్రికలు అనేవి ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అతి ముఖ్యమైన సాధనం. స్వతంత్రమైన పత్రికలు ప్రజా సంబంధమైన జాతీయ సమస్యలపైన స్పందిస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పత్రికలు పని చేస్తాయి. నిష్పక్షపాతమైన పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్య విజయం సాధ్యమవుతుంది.
2. లిఖిత రాజ్యాంగం: ప్రజాస్వామ్య విజయానికి లిఖిత రాజ్యాంగం కూడా అతి ముఖ్యమైన సాధనం. ఎందుకంటే లిఖిత రాజ్యాంగం పౌరులకు రాజకీయ హక్కుల గురించి విధుల గురించి అవగాహనను, నమ్మకాన్ని కలిగిస్తుంది.
3. ప్రజాస్వామ్యంపై కోరిక: ప్రజలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక, ఇష్టం, స్వేచ్ఛా స్వాతంత్య్రా లను కాపాడుకోవాలనే ఆకాంక్ష ప్రజాస్వామ్యం విజయ వంతం కావడానికి తోడ్పడతాయి.
4. నిరంతర అప్రమత్తత : ప్రజల నిరంతర అప్రమత్తతనే ప్రజాస్వామ్య విజయానికి ముఖ్యమైన సాధనం. ప్రజలు, ప్రభుత్వ రాజకీయ కార్యకలాపాలను, రాజ కీయ నాయకుల చర్యలను గమనిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాలి. కాబట్టి, ప్రజాస్వామ్య విజయంలో ప్రజలు నిరంతర అప్రమత్తతను మించింది ఏదీ లేదు.
5. స్వతంత్ర న్యాయశాఖ : నిష్పక్షపాతమైన నిజాయితీతో కూడిన భయాందోళనలకు అతీతమైన స్వతంత్ర న్యాయశాఖ ప్రజాస్వామ్యం విజయానికి అతిముఖ్య మైనది. ఇది ప్రజలకు ధైర్యాన్ని, నమ్మకాన్ని న్యాయాన్ని అందించడంలో హామీ ఇస్తుంది.
6. బలమైన ప్రతిపక్షం: పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బలమయైన ప్రతిపక్షం అవసరం. ప్రభుత్వం చేసే పనులకు నిరంతరం చెక్ పెడుతూ అప్రమత్తం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో ప్రతిపక్షాలు చాలాసమర్థంగా పని చేస్తాయి. భారతదేశంలో కూడా ప్రతి పక్ష పార్టీలు చాలాసార్లు విజయవంతమైన గొప్ప పాత్ర పోషించాయి.
7. క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు: క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచుతాయి. ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీల పనితీరుపై తీర్పుగా వ్యవహరిస్తాయి. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా స్వేచ్ఛా వాతావరణంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి సహకరిస్తాయి.
8. స్థానిక ప్రభుత్వాల చురుకైన పాత్ర : ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలు చురుకైన పాత్ర పోషిస్తాయి. స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని రాజకీయ భాగస్వామ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే కచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించాలి.
9. అధికారం వికేంద్రీకరణ: ప్రజాస్వామ్యం విజయానికి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి. ప్రజస్వామ్య ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అధికారాలు పంచుకుని పరిపాలిస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడడానికి ఎలాంటి అవకాశం లేదు.
10. రాజకీయ, ఆర్థిక సామాజిక న్యాయం: ప్రజాస్వామ్య విజయానికి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం తప్పనిసరి.
11. మెరుగైన విద్యావ్యవస్థ: ప్రజాస్వామ్య విజయంలో విద్యావ్యవస్థ చాలా ప్రభావాన్ని చూపుతుంది. నిరక్షరాస్యత ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డంకిగా ఉంటుంది. విద్య సమాజానికి మేధావులను అందిస్తుంది. అర్ధం చేసుకునే జ్ఞానాన్ని సమకూరుస్తుంది.
- దారావత్ సైదులు నాయక్
సివిక్స్ లెక్చరర్
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఫోన్్ 9908569970