Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విదేశీ నిధులతో రాష్ట్రంలో కుల, మత ఘర్షణలు ప్రేరేపించేందుకు మా ప్రత్యర్థులు కుట్ర పన్నారు. అందుకే వారం రోజులుగా ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అంటున్నారు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్. హత్రాస్‌లో జరిగిన హత్యాచార ఘటనను అడ్డుపెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ''అంతర్జాతీయ కుట్ర'' జరుగుతోందట! ఈ మేరకు యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ''కుట్ర'' ఏదైనా, ఎవరు చేసినా ఖండించాల్సిందే. అదీ పనిగట్టుకుని ఓ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రలను ముమ్మాటికీ ఖండించాల్సిందే. కానీ దేశమంతటా హత్రాస్ ఘటనపై నిరసనలు పెల్లుబుకుతున్న వేళ.. వాటిని దారి మళ్లించేందుకు ప్రభుత్వమే ఇలాంటి 'కుట్ర' పన్నాగం పన్నితే మాత్రం అది క్షమార్హం కాదు. మనీషాపై అమానుషం జరిగిన ఐదు రోజుల వరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి చేతులు రాని ఘనత వహించిన యూపీ పోలీసులు.. ముఖ్యమంత్రి నోట ఈ ''కుట్ర'' ప్రకటన వెలువడటమే ఆలస్యం, దేశద్రోహం సహా మరో 19 అభియోగాలతో పలు స్టేషన్లలో క్షణాల మీద కేసులు నమోదు చేశారు.
జరిగిన దారుణంపై కనీస మానవత్వం ప్రదర్శించని ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఈ ''కుట్ర'' ఆరోపణలు చేయడం నిజమేనా? లేక ఈ అమానవీయ ఘటనపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని దారిమళ్లించేందుకు ఇదొక ఎత్తుగడా..?! బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు లేకుండా దహనం చేసిన జిల్లా మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, పోలీసు అధికారులపై ఇంతవరకూ ఏ కేసులూ లేవు! కానీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయని చెపుతున్న ఈ ''అంతర్జాతీయ కుట్ర'' ఆరోపణలపై మాత్రం క్షణాలమీద హత్రాస్ మొదలు అయోధ్య వరకు యూపీలోని అనేక స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి! ఇవి ఎవరిని ఏమార్చడానికి? దేనిని నివారించడానికి? నిజానికి ప్రభుత్వానికి ఏది అప్రతిష్ట? జరిగిన దారుణం అప్రతిష్ట కాదా? ఘటనపట్ల పోలీసుల అలసత్వం, అన్యాయంగా అక్రమంగా వ్యవహరించిన తీరు అప్రతిష్టకాదా? స్వయంగా న్యాయాధికారులే నిందితుల తరుపున వకాల్తా పుచ్చుకుని బాధితులను బెదిరించడం అప్రతిష్ట కాదా? కన్నవారిని, తోబుట్టువులను నిర్భందించి, అర్థరాత్రి ఆ ఆడపిల్లను అమానుషంగా కాల్చి బూడిదచేయడం అప్రతిష్టకాదా..? ఎందుకిలా చేయాల్సి వచ్చింది? ఆమె దేహాన్ని అయినవాళ్ళకి అప్పగిస్తే జరిగిన దారుణానికి ఆధారాలు దొరికిపోతాయను కున్నారా? లేక అసలు అత్యాచారమే జరుగలేదనే అసత్యాన్ని వల్లించడానికి అవకాశం లేకుండా పోతుందని భావించారా? కాదంటే వీటన్నిటికీ అర్థమేమిటి? ఇవన్నీ ఏ కుట్రలు? ఎవరి ప్రతిష్టకు భంగం కలిగించే కుట్రలు? ఎవరు పన్నిన కుట్రలు? ఇవికూడా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పన్నిన ''అంతర్జాతీయ కుట్ర''లో భాగమేనా?!
బాధితులను పరామర్శించడానికి ప్రభుత్వ పెద్దలకు ఎలాగు మనసు రావటం లేదు. కనీసం ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను, చివరికి మీడియాను కూడా అందుకు అనుమతించకపోవడంలోని ఆంతర్యమేమిటి? మొన్న రాహుల్, ప్రియాంకలను అడ్డుకోవడం, నిన్న ఆప్ ఎంపీ సంజరుసింగ్పై సిరా చల్లడం దేనికి సంకేతాలు? హత్రాస్ గ్రామాన్ని చీమ కూడా దూరకుండా పోలీసు పహారాలో దిగ్బంధించాల్సిన అవసరమేమిటి? ''హత్రాస్ గ్రామానికి పోయేందుకు వీసా ఎక్కడ లభిస్తుందో ఎవరైనా చెప్పగలరా?'' అంటూ ప్రముఖ రచయిత్రి నటాషా బధ్వార్ చేసిన వ్యాఖ్యలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పైగా బాధితుల నోరు నొక్కడమేగాక వారు అబద్ధాలు మాట్లాడుతున్నారని పోలీసులూ, ఇతర పెద్దలూ నిందితులకు వత్తాసు పలికే స్థితికి దిగజారడంలోని పరమార్ధమేమిటి? ఈ చర్యలన్నీ ఎవరి కోసం? దోషుల్ని కాపాడుకోవడానికేనా? ఈ క్రమంలో సాక్షాధారాలను సైతం మాయం చేసిన తీరు తెన్నులను కప్పిపుచ్చుకోవడానికేనా? చివరికి హిందూ సాంప్రదాయాలకు తామే రక్షకులమని గొప్పలు చెప్పుకునేవారు.. ఆ సాంప్రదాయాల్నీ బాధితురాలితో పాటే మంటగలిపారు కదా..! కన్న కూతురుకి పసుపు రాస్తామని కాళ్ళావేళ్లా పడ్డా కనికరించని ఈ కసాయిలు రక్షించేది ఏ సాంప్రదాయాలను? ఎవరి ప్రయోజనాలను?
నెత్తురూ కన్నీరూ ఏకమై, బాధితత్వానికి నిలువెత్తు రూపమై న్యాయం కోసం వేడుకున్న ఓ ఆడపిల్లను బూడిదచేయడం ప్రతిష్టా? మనిషిగా అమెను గౌరవించలేదు సరికదా కనీసం ఆమె మరణాన్నైనా గౌరవించని అమానుషత్వం ప్రతిష్టా? జరిగిన దారుణాన్ని, ప్రభుత్వ వైఫల్యాన్ని లోకం వెలెత్తి చూపితే మాత్రం అది అప్రతిష్టా?! కండ్లముందు నిజం అడుగడుగునా నెత్తురోడుతూ కనిపిస్తున్నా.. అత్యాచారమే జరగలేదని బుకాయించడం మొదలు, ఆమెతో పాటే ఆధారాలనూ దగ్ధం చేసిన ఏలుబడిని పౌరసమాజం ప్రశ్నిస్తోంది.. ఏం సమాధానమిస్తారు? జేఎన్‌యూ వైద్యకళాశాల మెడికో లీగల్ నివేదిక పోలీసుల వాదనలకు భిన్నంగా అత్యాచారం జరిగిందని స్పష్టం చేస్తోంది. దీనికి ఏం సమాధానమిస్తారు? ఈ పరిస్థితుల్లో.. ''వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికి సమాధానం చెప్పలేక జపిస్తున్న పలాయన మంత్రమే ఈ 'అంతర్జాతీయ కుట్ర' ఆరోపణలా?'' అని జనమనుకుంటే ఆ తప్పెవరిది? ఉత్తరప్రదేశ్‌లోనూ మరో ఈశాన్య ఢిల్లీని, బీమా కోరేగావ్నూ సిద్ధం చేస్తున్నారా..?!