Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో చెలరేగే హింసకీ, కుటుంబ జీవనానికీ గల సంబంధం అర్థం చేసుకోలేకపోతే మనమూ, మన పిల్లలూ, మన చుట్టూ ఉన్నవారు భద్రంగా, శాంతంగా, ఆరోగ్యంగా ఉండలేరు. మరీ ముఖ్యంగా కుటుంబ జీవనంలో స్పష్టత, పారదర్శకత, సున్నితత్వం కొరవడితే పిల్లల బతుకు అగమ్యగోచరమవుతుంది. ఆడపిల్లల మీద దాడులు చేయడం, ప్రేమ పేరిట వేధించడం గమనిస్తే మన కుటుంబాలు ఎటు పోతున్నాయో చూడాలి? పిల్లల్ని ఎలా పెంచుతున్నామో యోచించాలి?
సినిమాలు, ఇంటర్నెట్, చుట్టూ ఉండే మిత్రబృందాలు, ప్రలోభాలకు లోను చేసే రకరకాల ప్రభావాలు కుటుంబంలో సృష్టించే కల్లోలం అనూహ్యం. ఈ కల్లోలానికీ, హింసకీ మూలాలు ఎక్కడున్నాయో అర్థం చేసుకోవాలి. మనిషిని ముట్టడించే మార్కెట్శక్తుల్లో, పాలనా వ్యవస్థల నిర్లక్ష్యంలో, స్పందనా రాహిత్యంలో ఈ మూలాలున్నాయి. అంతమాత్రాన వ్యక్తులుగా, కుటుంబాలుగా నిష్క్రియాపరంగా మిగిలిపోతే జరిగే దారుణాలకు నిత్యం ఎవరో ఒకరు బలవుతుంటారు. ఆ ఒకరిలో మనమూ, మన వాళ్ళు ఉండరన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకని ముందుగా కుటుంబంలోనే సున్నితత్వం, పారదర్శకత, నిజాయితీ పాదుకోవాలి. పిల్లలకు సౌకర్యాలు కల్పించడమే కాదు, వారు అడిగిందల్లా కొనివ్వగానే సరిపోదు. వాళ్ళ పోకడలు ఎలా ఉన్నాయో ఓ కంట కనిపెట్టాలి. నిత్యం ఏవో ఒడిదుడుకులతో సతమతమయ్యేవారు పిల్లలకు సమయం వెచ్చించగలరా? కానీ తప్పదు పిల్లలకోసం సంపాదించడమే కాదు, వారి మానసిక సంచలనాల్ని అవలోకించాలి.
పాపం, పుణ్యం, ప్రపంచమార్గం పసిపిల్లలకే కాదు కౌమారంలో, తొలి యవ్వనంలో ఉన్నవారికి సైతం తెలియదు. అందుకని వారు అడగ్గానే సెల్ఫోన్లు, బైక్‌లు, డ్రస్సులు కొనివ్వడం, ప్యాకెట్‌మనీ అందించడంతో బాధ్యత తీరిపోదు. పిల్లల్ని కాలేజీల్లో చేర్పించి ఇక తమ పని తీరిందనుకోడం సరికాదు. అసలు కుటుంబంలో అమ్మా, నాయిన, పిల్లలు కలిసి మాట్లాడుకునే సందర్భాలు వారంలో ఎన్ని ఉంటాయి? పదమూడు, పధ్నాలుగేళ్ళు దాటిన పిల్లల ఆలోచనల, కోర్కెల, ఉద్వేగాల తీరుని గమనించారా? పిల్లల ఇష్టాలు ఏమిటి? వాళ్ళ స్నేహితులు ఎవరు? అమ్మ, అయ్యల వద్ద దాచడానికి ప్రయత్నించే విషయాలేమిటి? సిగిరెట్లు తాగుతున్నారా? మందు కొడుతున్నారా? అమ్మాయిలతో అల్లరిచిల్లరగా ప్రవర్తిస్తున్నారా? ఈ అంశాల్ని పట్టించుకునే దృష్టికోణం ఎందరిలో ఉంది.
టీనేజి పిల్లల భావోద్వేగాలు, వారి ప్రేమ వ్యవహారాలు, తొలిచూపు సంవేదనలు ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు. ఇరవయ్యేళ్ళు కూడా లేని ఓ అబ్బాయి పదేళ్ళ నుంచి ఆ అమ్మాయి తనకు తెలుసు అని చెబుతున్నాడంటే తల్లిదండ్రులు కళ్ళు మూసుకున్నారా అనిపిస్తుంది. ఆడపిల్లల, మగపిల్లల స్నేహాలు తప్పుకాదు. వారి మధ్యన ఆకర్షణ నేరం కాదు. ఇష్టం కలగటం అసహజం కాదు. నిజానికీ అది ఆకర్షణో, మోహమో, ప్రేమో పిల్లలకే తెలియదు. కానీ సినిమాల ప్రభావం కారణంగా దానికి 'ప్రేమ' అని పేరు పెడతారు. గర్ల్‌ఫ్రెండ్, బారుఫ్రెండ్ ఉండటం గర్వకారణమనే భావజాలానికి తెలియకనే తలొగ్గుతారు. కనుకనే టీనేజి పిల్లల భావోద్వేగాల్ని గమనిస్తూ, సరైన దిశలో నడిపించాలి.
పిల్లలు ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా తల్లిదండ్రులతో పంచుకోగల వాతావరణం కుటుంబాల్లో ఉండాలి. కోర్కెల స్వభావం, ప్రేమ నైజం, మోహం, ఆకర్షణ వంటి విషయాల గురించి పిల్లలతో మాట్లాడాలి. తనకు ఇష్టమైన అమ్మాయి గురించి అబ్బాయి, తనకు ఇష్టమైన అబ్బాయి గురించి అమ్మాయి కూడా అమ్మా నాయినలతో చెప్పగలగాలి. ఆ ఇష్టాలకు ఉన్న పరిమితులు అర్థం చేయించాలి. అంతేగాక జీవితానికి అర్థం, లక్ష్యం ఉండాలని పిల్లలు తమంతట తాము గుర్తించే జీవనశైలి కుటుంబంలో కనిపించాలి.
పిల్లలకు బుద్ధులు నేర్పడం హితబోధలతో జరిగేది కాదు. చిన్నప్పట్నించి పెంపకంలో అంతర్భాగం కావాలి. పుస్తకాలు చదవడం, సినిమాల మంచీచెడు మాట్లాడుకోడం, ఇతరుల పట్ల కరుణతో వ్యవహరించడం, ఆడపిల్లల పట్ల గౌరవంగా మసలుకోడం దైనందిన జీవితాచరణలో మిళితం కావాలి. టీవీల్లో ఏం చూడాలో, నెట్లో ఏం బ్రౌజ్ చేయాలో, మొబైల్‌ను ఎంతమేరకు వాడాలో చెప్పకనే చెప్పాలి. ఇంట్లో అమ్మాయి, అబ్బాయి పెంపకంలో అంతరాలు చూపకూడదు. తొలుత భార్యాభర్తల నడుమ పరస్పర ప్రేమ, గౌరవం తప్పనిసరి. అంతేగాక వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీకి ప్రాధాన్యమివ్వాలి. ఆక్రమంగా ఆస్తులు పోగేయడం ఘనతగా భావించే ఇంట పిల్లల ఆలోచనలూ వక్రమార్గం పడతాయి.
అడ్డదారుల్లో పోగేసిన సంపదలతో పిల్లలకు అడిగిందల్లా ఇస్తే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తూనే వున్నాం. తాము ఏం చేసినా కాపాడగలిగే 'బ్యాడ్ ఫాదర్' ఒకడు ఉన్నాడని అబ్బాయిలు భావిస్తారు. వారి మాటల, చేతల దౌర్జన్యం ఆడవాళ్ళ గొంతులు కోస్తుంది. కత్తిగాట్లతో వారి సున్నిత హృదయాల్ని గాయపరుస్తారు. ఈ హింస, కుటుంబ జీవనంలోని ప్రేమ రాహిత్యానికి తార్కాణం. కరుణ కొరవడిన దుష్ఫలితం. మార్కెట్‌శక్తుల దౌష్ట్యం కుటుంబాల్ని చెరబట్టిన వైనానికి పరాకాష్ట. మంచీచెడు చెప్పగల అమ్మమ్మలకీ, తాతయ్యలకీ ఇంట్లో చోటు లేదు. వారిని వృద్ధాశ్రమాలకు తరిమేసేవారు పిల్లలకు మాత్రం మంచి చెప్పగలరా? ఆలోచిస్తే, వివేచిస్తే అన్నీ ప్రశ్నలే. అనేక వైరుధ్యాలతో కూడిన చిక్కుముడులే. ఈ ముడులు విప్పాలంటే నిజాయితీ, నిష్కల్మషత్వం, సద్వివేచన అవసరం. ఒక సందర్భాన కొడవటిగంటి కుటుంబరావు చెప్పినట్టు ఇతరులకు వీలయినంత ఎక్కువ మంచిని చేయగల జీవనసరళి కుటుంబాలకీ, సమాజానికీ శ్రేయస్కరం.