Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల్లో వివిధ రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం నేటి రివాజు. తమ విధానాలేమిటో చెప్పి ఓట్లడగటం కనుమరుగవుతోంది. ఈ దశలో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలన్న తర్వాత కొందరికి మోదం, మరెందరికో ఖేదం. అంటే ఓడిన అభ్యర్థులకే కాక, వారికి అప్పు తెచ్చినవారు, అప్పు ఇచ్చేవారికి అప్పిచ్చిన మైక్రో ఫైనాన్స్సంస్థలు, చిట్ఫండ్ కంపెనీలు, ఉద్దెర మీద మందు సప్లయి చేసిన 'దాతలు' మొదలైనవారెందరో భోరు మంటున్నారట! మీడియా అంచనా ప్రకారం ఆయా పార్టీలిచ్చిన సొమ్ముకాక అనేక మంది అభ్యర్థులు రెండు, మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. ఎన్నికలు కార్పొరేటైజ్ అయిన తర్వాత ఇది సర్వసాధారణ అంశం. ఫలితాలొచ్చిన రోజు నుంచి వివిధ పత్రికలు, ముఖ్యంగా తెలుగు పత్రికలు వారి వారి రాజకీయ అనుబంధాలకనుగుణంగా వ్యాఖ్యలు చేసేవి కొన్ని, భవిష్యత్ ''వెలుగు''ల కోసం వార్తలు సేకరించి, గుదిగుచ్చి పాఠకుల ముందుకుమ్మరిస్తున్నవి మరికొన్ని. దీన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు, పెట్టలేరు కూడా. కాని 'హిజ్ మాస్టర్స్ వాయిస్'కున్న అవగాహనా రాహిత్యానికి, అవహేళన పైత్యం జతపడి అసందర్బ ప్రేలాపనొకటి మొన్న శనివారం పాఠకులమీద వాంతి చేసుకుంది. ''కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడితే... కాలగర్భంలో కలసిపోతారని కమ్యూనిస్టులకు తెలిసొచ్చింది(ట!). ప్రజా సమస్యలను పక్కనబెట్టి.. బూర్జువా విధానాలకే కమ్యూనిస్టులు'' పెద్దపీట వేస్తు న్నారట! అందుకే వామపక్షం పత్తాలేకుండా పోయిందట!
మొదటగా ఒక విషయం స్పష్టీకరించాలి. ఫ్రెంచ్ విప్లవకాలంలో ఆ దేశ పార్లమెంట్లో నాటి వ్యవస్థను కాపాడాలనుకునేవారు, వీలైతే సమాజ చక్రాన్ని వెనక్కి తిప్పాలనుకునే సంపన్నులంతా కుడివైపు కూర్చుంటే, మార్పుకోరేవారు, తిరుగుబాటు దారులు ఎడమవైపు కూర్చునేవారు. రాజకీయ నిఘంటువులోకి 'లెఫ్ట్', 'రైట్' అనే మాటలొచ్చి చేరింది ఆవిధంగా. లెఫ్ట్ (వామపక్షం) రైట్ (మితవాదం / యధాతథవాదం) అనేవి రెండు పార్టీల పేర్లు కావు. రెండు సైద్దాంతిక ధోరణులు. 'వామపక్షం పత్తా లేకుండా పోయింద'ని విర్రవీగే వారికి యోగ్యతా పత్రంలో చెలం చెప్పినట్టు ''కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళు లేక ఎండిన గడ్డిపూల ఆర్తనాదం'' వినేవారు, లోకానికి వినిపించేవారు కమ్యూనిస్టులేనన్న స్పృహ ఉన్నట్టు లేదు. ప్రభుత్వ పాత్ర కనీసపక్షానికి కుదించాలని నాటి ఫ్రాన్స్ రైట్ వాదించింది. ప్రభుత్వ పాత్ర గరిష్టంగా ఉండాలని 1789లోనే ఫ్రెంచ్ లెఫ్ట్ డిమాండ్ చేసింది. 2014లో మోడీ ప్రమాణస్వీకారం అనంతరం వదిలిన ''కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన'' డైలాగ్ 225ఏండ్లనాటి ఫ్రెంచ్ మితవాదుల భావమే! ప్రభుత్వరంగ పరిశ్రమల మూసివేత, ప్రభుత్వ ఉద్యోగుల తీసివేత (కుదింపు) కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వారితో నింపడం... నేటి మన తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానమిదేగా. రెండు శతాబ్దాల క్రితం విషయాన్ని అమలు చేయడం కాలం చెల్లిన సిద్దాంతాన్ని పట్టుకు వేలాడటం కాదా?! కమ్యూనిస్టులు ప్రజా సమస్యలను పక్కనబెట్టింది ఎప్పుడు? బహుశా మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాసమస్యల్ని ప్రస్తావించిందే వామపక్షాలు. నిద్రలో లేపి అడిగినా ఆయా డివిజన్లలోని ప్రజా సమస్యల్ని చెప్పగల నిబద్ధత వామపక్షాలది. క్యాంపెయిన్లో పాల్గొన్న రాష్ట్ర నేతలు సైతం నమ్రతగా ప్రజా సమస్యల్ని కార్పొరేషన్లో ప్రస్తావించగల తమ అభ్యర్థులకే ఓటేయండని ఓటర్లను కోరారు. చట్టసభలు తిట్ల పురాణాలకు వేదికలుగా ''అలరారుతుండ''గా కనీసం జీహెచ్ఎంసీలోనైనా 'వాటాల పంపకాలు' కాకుండా సగటు హైద్రాబాదీ చుట్టూ చర్చ జరగాలని ఆశించిందీ, దానికోసం ప్రయత్నించిందీ వామపక్షాలే. 'వందీశ్వరులు', 'వెయ్యీశ్వరులు' కూడ కాని వామపక్ష అభ్యర్థులు కోటీశ్వరులతో తూగలేనివారు.
దేశంలో సరళీకృత ఆర్థిక విధానం ప్రారంభమైన నాటినుంచే దాన్ని నికరంగా ప్రతిఘటిస్తున్నది వామపక్షాలే. ఈ 30ఏండ్లలో జరిగిన 20దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలకు చోదకశక్తి వామపక్షాలే. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితమే నేడు చుక్కలంటుతున్న ధరలు, సర్వ వ్యాపితమవుతున్న నిరుద్యోగం, ఛిద్రమవుతున్న వ్యవసాయం, చితికిపోతున్న చిన్నపరిశ్రమలు, పెరుగుతున్న అసమానతలు-వామపక్షాలు రాజకీయ పొద్దు తిరుగుడు పూలు కావు. ప్రజా సమస్యలపై పనిచేయడమే వాటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు. వామపక్షాలు జీవించేది, చివరికి మరణించేది కూడ ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే. పాలకుల గ్రాసానికి అల వాటుపడ్డ బానిస కలాలకు ఈ విషయం అర్థంకావడం కష్టమే!
ముస్లిం జనాభా అధికంగా ఉన్న హైదరాబాద్ బీజేపీ వ్యూహానికి లాంచింగ్ ప్యాడ్. కార్పొరేషన్ గెలవడం కంటే మతాలవారి చీలికను పెద్దది చేయడమే వారి లక్ష్యం. కింది స్థాయి నాయకులకు తెలియకపోయినా బీజేపీ కేంద్ర నాయకుల ఈ లక్ష్యం ఈ ఎన్నికల్లో సిద్ధించినట్టే అనిపిస్తోంది. 40శాతం ముస్లిం జనాభా ఉన్న హైదరాబాద్లో (జీహెచ్ఎంసీ పరిధిలో 28శాతం) బీజేపీ విద్వేష జ్వాలలు పెరిగితే రాష్ట్ర సమగ్రతకే కాదు, దేశ సమగ్రతకే తీవ్రహాని జరుగుతుంది. వామపక్షం 1980వ దశకం నుంచీ ఈ విషయంలో దేశాన్ని అప్రమత్తం చేస్తూనే ఉంది. వామపక్షాల శక్తిని ఓట్లతో, సీట్లతో జోకడం అసంబద్ధం.