Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్రాజ్యవాద అమెరికా వర్తమాన కాలంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రగతిశీల వామపక్ష ప్రభుత్వాలను బలవంతంగా కూలదోసి తన బంట్లను అధికారంలో కూర్చోబెట్టుతున్నది. దానికి వెనెజులా, బోలివియా తాజా ఉదాహరణలు. అయితే అమెరికా కండకావరంతో చేస్తున్న పెత్తందారీ నియంతృత్వ పోకడను మాత్రం ప్రజలు తిరస్కరిస్తున్నారు. అదే వెనెజులా, బొలివియాలో జరిగింది.
1998లో చావెజ్ నాయకత్వంలో మొదటిసారి వెనెజులాలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పదవీ నుంచి చావెజ్ను వెళ్ళగొట్టడానికి కుట్రలు, కుతంత్రాలు సైనిక తిరుగుబాటు జరిగినా ప్రజలు అక్కడ వెనెజులా ఐక్య సోషలిస్టు పార్టీని (పీఎస్యూవీ)ని పరిరక్షించు కుంటూ ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదురైనా కాపాడుకుంటూ వస్తున్నారు. 2018లో మదురో మంచి మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికైనారు. అప్పటి నుంచి అమెరికా మదురో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు చేస్తున్నది. దాని లక్ష్యం లాటిన్ అమెరికాలో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టడం. వెనెజులాలో చమురు పుష్కలంగా లభిస్తుంది. అయితే వెనెజులాలో అది ప్రభుత్వరంగంలో ఉన్నది. దాన్ని సహించలేని అమెరికా సైనిక తిరుగుబాటుకు పూనుకుని, భంగపాటుకు గురైంది. మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారని కూడా ప్రచారం చేశారు.
తాజా జాతీయ ఎన్నికలలో మదురో పార్టీ67.6శాతం ఓట్లతో 277 సీట్ల సభలో మెజారిటీ సీట్లు సాధించుకున్నది. ఈసారి మదురో ఐక్యసంఘటన ఏర్పాటు చేసి గెలిచారు. 277 సీట్లకు 14000 మంది 100 రాజకీయ పార్టీల నుంచి పోటీ చేశారు. ఇది అక్కడ ప్రజాస్వామ్యానికి అద్దం పడుతున్నది. అయినా ప్రతిపక్షం ఎన్నికలలో అవకతవకలు జరుగుతాయి అని ముందే ప్రకటించి ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల పరిశీలకులుగా 200 మంది విదేశీ ప్రతినిధులు అక్కడ ఎన్నికలను పరిశీలించి ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్టు ప్రకటించారు.
ప్రజలు ఏ పరిస్థితులలో మదురో పార్టీకి ఓటు వేశారో గమనించాల్సిన అంశం. వెనెజులా నేడు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నది. చమురు వెలికి తీసినా శుద్ధిచేసేందుకు ఆంక్షలు వలన యంత్రాలకు కావాల్సిన విడిభాగాలు దొరకడం లేదు. రవాణాకు పెట్రోల్, డీజిల్ తీవ్రమైన కొరత ఉన్నది. షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నవారికి మందుల కొరత తీవ్రంగా ఉన్నది. డయాలిసిస్ చేసుకోలేకపోతున్నారు. అమెరికా ఆంక్షలు వలన ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. వీటికి ఇప్పుడు కరోనా తోడైంది. అయినా ప్రజలు వామపక్ష ప్రభుత్వాన్ని 67శాతం ఓట్లతో గెలిపించుకున్నారు. చావెజ్ సాధించిన విప్లవ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
వెనెజులాకు సంఘీభావంగా ఇరాన్ స్పందించి, అమెరికా ఆంక్షలను ధిక్కరించి 10 ఓడలలో పెట్రోల్, డీజిల్ పంపింది. ఆ ఓడలు తిరుగు ప్రయాణంలో వెనెజులా నుంచి శుద్ధిచేయని చమురును తీసుకు వెళ్ళి శుద్ధిచేసి వాడుతారు. ఇది సంఘీబావానికి ప్రతీకగా నిలుస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ చావెజ్ను భయంకర నేరస్తుడిగా ప్రకటించి భవిష్యత్ ఎలా ఉండబోతున్నదో సంకేతం పంపారు.
లాటిన్ అమెరికాలో మరో దేశం బొలివియా. అక్కడ కూడా ఎన్నికైన ఇవో మోరెల్స్ ప్రభుత్వాన్ని 2019 నవంబర్లో సైనిక తిరుగుబాటు జరిపి బలవంతంగా పదవికి రాజీనామా చేయించారు. అమెరికా ఈ మొత్తం వ్యవహారానికి దర్శకత్వం వహించింది. అమెరికా తొత్తు ప్రభుత్వం ఏర్పడింది. మోరెల్స్ చేసిన ప్రజా అనుకూల పనులను నిలిపివేశారు. ప్రజలు అమెరికా తొత్తు ప్రభుత్వానికి ఎదురుతిరిగి ఎన్నికలు జరపాలని పెద్ద ఎత్తున అందోళనలకు పూనుకున్నారు. మోరెల్స్ రాజీనామా చేసి మెక్సికో తరువాత అర్జెంటీనాలో తలదాచుకున్నాడు. గత నెలలో జరిగిన ఎన్నికలలో మోరెల్స్ పార్టీ అయిన మూమెంట్ ఫర్ సోషలిజం మెజార్టీ ఓట్లు సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మోరెల్స్ తిరిగి బొలివియా చేరుకున్న రోజు 10లక్షల మంది ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
మోరెల్స్ ప్రభుత్వం ఆదేశంలో లభ్యమయ్యే ''లిథినియం'' (బ్యాటరీలో వాడే కెమికల్) పరిశ్రమను జాతీయం చేసింది. జాతి సంపదగా ప్రకటించింది. దాన్ని ఓర్వలేని బహుళజాతి గుత్త సంస్థలు మోరెల్స్పై కక్షకట్టి వారినిధులతో సైనిక తిరుగుబాటు చేయించి బలవంతంగా రాజీనామా చేయించారు. లిథినియంను జాతీయం చేసినందుకు బహుళజాతి సంస్థలు తనను శిక్షించాయి అని మెరేల్స్ ప్రకటించారు. ఆయన తలదాచుకున్న మెక్సికో, అర్జెంటీనాలలో మితవాద శక్తులు ఆయనను హత్య చేయకుండా ట్రేడ్ యూనియన్ వారు ఆయనను కడుపులో పెట్టుకుని కాపాడి బొలివియా పంపటం ఒక ఆదర్శవంతమైన ఉదాహరణ.వారికి మెరెల్స్ విప్లవ కృతజ్ఞతలు తెలియచేశారు.
అటు వెనెజులా, ఇటు బొలివియాలో ప్రజలు హింసకు దిగకుండా తమ ఐక్యతతో అమెరికా సామ్రాజ్యవాద విషపూరిత కుట్రలను సాగనివ్వలేదు. తమ దేశ సంపదను బహుళజాతి గుత్తసంస్థలకు ఇవ్వడానికి నిరాకరించి కాపాడుకున్నారు. ప్రభుత్వ రంగంలోనే ఆ దేశాలలో దొరికే ఖనిజ సంపదను ఉత్పత్తి చేసి తమ ఆర్థిక వ్యవస్థను గట్టిపర్చుకుని ప్రజలకు మేలు చేయాలని ఎన్ని త్యాగాలకైనా సిద్ధం అవుతున్నారు. సామ్రాజ్యవాద అమెరికా ఆటలను సాగనివ్వడం లేదు. ఈ ఐక్యతను పటిష్టం చేసుకుంటూ వామపక్ష ప్రభుత్వాలను పరిరక్షించుకుంటున్న వెనెజులా, బోలివియా ఇతర దేశాలకు మార్గదర్శిగా ఉన్నాయి. ధైర్యాన్ని నింపుతున్నాయి. తలెత్తుకుని పోరాడితే గెలవగలం అనే భరోసా ఇస్తున్నాయి.