Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళాకారుల భావప్రకటనా స్వేచ్ఛని అడ్డుకోలేమని, మరీ ముఖ్యంగా సినీ నిర్మాతల, రచయితల వాక్ స్వాతంత్య్రాన్ని భంగం కలిగించడం సరి కాదని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన రోజునే దీపికా పదుకునే ముక్కు కోస్తామని రాజపుత్రుల కర్ణిసేన ప్రకటించడం దుర్మార్గం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీవితం ఆధారంగా నిర్మించిన 'యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్' చిత్రం విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సినిమా, నాటకం, నవలా రచన వంటి సృజనాత్మక ప్రక్రియల్లోని కళాత్మక అభివ్యక్తిని ఏ చట్టమూ అడ్డుకోజాలదని స్పష్టం చేశారు. గతవారం 'పద్మావతి' చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
ఉన్నత న్యాయస్థానం మాటను సైతం పెడచెవిని పెట్టి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కర్ణిసేన ధూర్త ప్రేలాపనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ నాయకులు, సంఫ్‌ుపరివార్ శక్తులు మద్దతునివ్వడం ఆందోళనకరం. దీపికా పదుకునే ముక్కు కోస్తామని బెదిరించడమే కాదు, దీపిక, సంజరులీలా భన్సాలీ తలలు నరికి తెచ్చిన వారికి అయిదుకోట్ల రూపాయలు బహుమానంగా ప్రకటిస్తామని మీరట్‌కు చెందిన ఒక ఠాకూర్ నాయకుడు ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. చట్టాన్ని, రాజ్యాంగాన్ని, వ్యక్తుల భద్రతను కాపాడతామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు మిన్నకున్నారు. ఇది ఉద్దేశపూర్వకమైన, కుట్రపూరితమైన ధోరణి.
'పద్మావతి' చిత్రం కథ ఎవరికీ తెలియదు, దాని స్క్రిప్ట్ కూడా ఎవరూ చదవలేదు. సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ ఇంకా రాలేదు. అయినప్పటికీ షూటింగ్ మొదలయినప్పట్నించి ఈ చిత్రం మీద కర్ణిసేన దాడులు చేస్తూనే వుంది. జనవరిలో అంబర్కోటలో షూటింగ్ జరుపుతున్న భన్సాలీ బృందంపై దాడి చేసింది. మార్చిలో చిత్రనిర్మాణానికి సంబంధించిన సెట్స్‌ను ధ్వంసం చేశారు. ఇటీవలి కాలాన వరుసగా పద్మావతిని నిషేధించాలంటూ, ప్రదర్శిస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజపుత్రుల చరిత్రని, రాణి పద్మావతి గౌరవాన్ని భంగపరిస్తే సహించేది లేదని మాట్లాడుతున్నారు.
చరిత్ర గురించి సంఫ్‌ుపరివార్ మూకలు మాట్లాడటం మరీ విడ్డూరం. అడుగడుగునా చరిత్రని వక్రీకరించే కాషాయ దళానికి చరిత్ర గురించి మాట్లాడే నైతికహక్కు లేదు. పద్మావతి ఒక కల్పిత పాత్ర. ఒక సూఫీ కవి రాసిన కావ్యం ఆధారంగా భన్సాలీ నిర్మిస్తున్న చిత్రం 'పద్మావతి'. ఎక్కడా ఆ చిత్రకథ ఏమిటో నిర్మాతలు, దర్శకులు చెప్పలేదు. రాజపుత్రుల గౌరవానికి భంగం కలిగించే అంశాలు ఈ చిత్రంలో ఉండవని భన్సాలీ ఏనాడో ప్రకటించారు. అయినప్పటికీ ఈ చిత్రం మీద ఇంత రభస చేయడం దురుద్దేశపూర్వకమైన కుట్ర.
ఈ చిత్రానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేముందు ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి సుద్దులు చెబుతున్నారు. కళాకారుల స్వేచ్ఛ చట్టానికి లోబడి మాత్రమే ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు. ఈ చిత్రాన్ని తాము చూసి అంగీకరించాకనే విడుదల చేయాలనడం కర్ణిసేన నేతల దురుసుతనానికి పరాకాష్ట. ఇదే ధోరణితో వ్యవహరిస్తూ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలోని బీజేపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలని అగౌరవపరిచే, అవమానపరిచే ఈ వైఖరి ప్రజాస్వామ్యంపై పాశవికదాడి. ఈ మొత్తం వ్యవహారం మీద నరేంద్రమోడీ మౌనం, సంఫ్‌ు పరివార్ కౌటిల్యానికి నిదర్శనం. తన మౌనంతో మూకస్వామ్యానికి ఆజ్యం పోస్తున్నారాయన.
విభజించే పాలించే కుట్రల్ని బ్రిటిష్ పాలకుల్ని నుంచి నేర్చుకున్న సంఫ్‌ుపరివార్ ఈ దేశాన్ని మతప్రాతిపదికన విభజించి ఏలాలనుకుంటోంది. అందుకే గోల్వాల్కర్ హిందూత్వ సూత్రాల ఆధారంగా ప్రజల మధ్య విభజన రేఖలు గీయడానికి దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో వారికి దొరికిన తురుపుముక్క 'పద్మావతి'. ఆ రాష్ట్రంలో ఓటమి భయంతో బెంబేలెత్తుతున్న బీజేపీ 'కర్ణిసేన' మాటున గాంధీనగర్‌లో పద్మావతి విడుదలని నిరసిస్తూ ప్రదర్శనలు జరిపింది. హిందువుల ఓట్ల కోసం 'పద్మావతి'పై దారుణమైన కుట్రలకు పాల్పడుతున్నది.
అసమానత్వం, మూఢత్వం, దుర్మార్గం, హింసాకాండే పునాదిగా చెలామణయ్యే కాషాయ ఫాసిస్టు మూకలకు శాస్త్రీయ వివేచన, చారిత్రక స్పృహ, కళాభిరుచి, కళల పట్ల గౌరవం ఉండే అవకాశం లేదు. కనుకనే 'బ్లాక్' వంటి గొప్ప చిత్రాల్ని నిర్మించి, భారతీయ సినిమా గౌరవప్రతిష్టల్ని ఇనుమడింపజేసిన సంజరు లీలా భన్సాలీ 'పద్మావతి' చిత్రం మీద హేయమైన వైఖరితో వ్యవహరిస్తున్నది. ఈ అహేతుక ధోరణిపై బాలీవుడ్ మౌనం ఆత్మహత్యా సదృశం. హిందూ ఉగ్రవాదం గురించి కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్ వంటి వారు మాట్లాడుతుండగా, 'పద్మావతి'పై అనుచిత, అవాంఛనీయ, అన్యాయమైన ప్రేలాపనల్ని బాలీవుడ్ వర్గాలు ఖండించకపోవడం విస్మయకరం. బాలీవుడ్ మాత్రమే కాదు, భారతీయ సినీవర్గాలు, మేధావులు, సకల రాజకీయ పార్టీలు 'పద్మావతి'కి మద్దతుగా నిలవాలి. కళాత్మక అభివ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగం. కాపాడుకోవటం స్వేచ్ఛాప్రియుల కర్తవ్యం.