Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటకలో ఎండాకాలంలో జరగబోయే ఎన్నికలు ఈ చలికాంలోనే వేడి పుట్టిస్తున్నాయి. కేంద్రంలో అధికారపక్షమైన బీజేపీ, రాష్ట్రంలో అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేను కూడా హిందువునే అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పుకుంటుంటే... నీకు హిందూత్వం పై విశ్వాసం ఉంటే నీ రాష్ట్రంలో గోవధపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి కేంద్రంలో బీజేపీ పాలన పట్ల, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి ఆగ్రహంగా మారకుండా బీజేపీ మతభావాలను ప్రేరేపిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తుంటే... కాంగ్రెస్ ఎప్పటి లాగే తన అవకాశవాద వైఖరితో వ్యవహరిస్తోంది. బాబ్రీ కూల్చివేత సందర్భంలో కాంగ్రెస్ అనుసరించిన అవకాశవాద వైఖరే ఉత్తర భారతంలో బీజేపీ బలపడటానికి అవకాశమిచ్చింది. అభివృద్ధి, సుపరిపాలన, అవినీతి రహిత భారతం అంటూ ప్రజలను నమ్మించి కేంద్రంలో అధికారం పొందిన బీజేపీ చివరికి వంచనే మిగిల్చింది. వీరి ఏలుబడిలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు కానరాక పోగా అవినీతి పెచ్చరిల్లింది. దీంతో అభివృద్ధి నినాదాన్ని అటకెక్కించిన బీజేపీ తిరిగి తన మతోన్మాద ఫార్ములానే అనేక రాష్ట్రాల ఎన్నికలలో అనుసరిస్తోంది. గుజరాత్ మోడల్ అని చెప్పుకునే ప్రధాని మోడీ స్వరాష్ట్రంలోనే తన అభివృద్ధి నినాదం పనిచేయక... వైషమ్యాలను రెచ్చగొట్టడం, భావోద్వేగాలను రగిలించడంపైనే ఆధారపడ్డారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఇదే ఫార్ములాతో ఉత్తర భారతంలో విజయాలు సాధిస్తున్న బీజేపీకి దక్షిణ భారతం మాత్రం దుర్బేధ్యంగానే ఉన్నది. దీనిని ఛేదించడానికి తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి వాడుకోవాలని అనైతిక ప్రయత్నాలు చేసి దెబ్బతిన్నారు. ఎంతటి హింసకు తెగించినా కేరళ ప్రజల ముందు వారి ఆటలు సాగడం లేదు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వారి ప్రభావం అంతంత మాత్రమే.. ఇక మిగిలింది కర్నాటక. గతంలో ఒకసారి అధికారమిచ్చిన కర్నాటక వేదికగా వారు దక్షిణ భారతంపై కన్నేయడంలో ఆశ్చర్యమేమీ లేదు... కర్ణాటకలో కల్బుర్గీ, గౌరీలంకేశ్ల హత్యలూ, ప్రకాశ్‌రాజ్ వంటి ప్రశ్నించే వారిని బెదిరింపులకు లోను చేయడం ద్వారా లౌకికవాదుల మనోబలాన్ని దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నాలకూ కొదవేలేదు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు కర్నాటకలో మత వైషమ్యాలను రగిలించడం చూస్తుంటే బీజేపీ వ్యూహమేమిటో అవగతమవుతోంది.
''హనుమంతుడు పుట్టిన నేల ఇది'' అంటూ కర్నాటకలో తమ వ్యూహానికి తెరతీసారు యోగి ఆదిత్యనాధ్. ''సీత జాడ కోసం తిరుగుతున్న రాముడికి ఈ నేల నుండే హనుమంతుడు దారిచూపించాడు.'' అంటూ కథ సృష్టించాడాయన..! ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బెంగుళూరులో నిర్వహించిన ''పరివర్తన'' ర్యాలీ వేదికగా ఆయనీవ్యాఖ్యలు చేసారు. రామజన్మభూమి పేరుతో ఉత్తరభారతాన్ని వశపర్చుకున్న తీరునే ''హనుమ జన్మభూమి'' పేరుతో దక్షిణభారతాన్ని చేజిక్కించుకోవడమేనా ఈ వ్యూహం వెనుక మర్మం..!?
బసవన్న, అక్క మహాదేవి, ఫ్రెంచి విప్లవ ప్రతిధ్వనులు వినిపించిన టిప్పుసుల్తాన్ నుండి ఆధునిక యుగంలో ఎందరో సాహితీమూర్తులు, నాటక కర్తలు, మేధావులు, ప్రజాస్వామిక యోధులు, పురోగామి తాత్వికులు ఈ నేలనుంచి పుట్టి దేశానికి వన్నె తెచ్చారు. అటువంటి నేలమీది సానుకూల, లౌకిక అంశాలన్నిటినీ ధ్వంసం చేయటానికి బీజేపీ ప్రయత్నిస్తుంటే... ప్రతిఘటించి ప్రత్యామ్నాయంగా నిలబడాల్సిన కాంగ్రెస్ అవకాశవాదాన్ని ఎంచుకోవడం మరో విషాదం. రాహుల్ గాంధీ వరుసగా హిందూ దేవాలయాలను సందర్శించడం నుండి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేనూ హిందువునే అని ప్రత్యేకంగా చెప్పుకోవడం వరకూ ఇవన్నీ కాంగ్రెస్ అవకాశవాదానికి నిదర్శనం. శతాబ్దాలుగా కన్న భూమిలో స్థిరపడి ఉన్న సామరస్యాన్ని చెరిపేసే ఉన్మాదానికి బీజేపీ తెగబడుతుంటే, సడలుతున్న సంకెళ్లను తిరిగి బిగించే ఛాందసానికి పాల్పడుతుంటే శాస్త్రీయ భావజాలం పునాది మీద నిలబడి ఎదిరించవల్సింది పోయి కాంగ్రెస్ అవకాశవాదానికి పాల్పడుతున్నది. వెరసి ఇరు పార్టీలు అనుసరిస్తున్న విధానాలు కర్నాటక సంతరించుకున్న వైభవాన్నంతటినీ మసకబారుస్తున్నాయి.
బీజేపీ విధానాలతో దేశంలో ఆర్థిక వృద్ధి నేలచూపులు చూస్తోంది. ఉత్పత్తిరంగం కుదేలైంది. ధరాఘాత సూచీ కొండెక్కుతోంది. వ్యవసాయం నైరాశ్యంలో ఉంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. పెద్దనోట్ల రద్దు ప్రజలకు శరాఘాతమైంది. జీఎస్టీ పుణ్యమా అని వ్యాపారవర్గం ఉక్కిరి బిక్కిరై అలసిపోయి ఉంది. దేశంలో ఒక్కో వర్గానికి ఒక్కో ఆవేదన.. అందుకు కర్నాటకా మినహాయింపు కాదు. భవిష్యత్తుపై కమ్ముకున్న కారుమబ్బులు ఎలా తొలగిపోతాయో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సమస్యలకు పరిష్కారం కాదు కదా ఆ ప్రస్తావనే లేకుండా అశాస్త్రీయ భావాలను, పుక్కిటి పురాణాలను వల్లిస్తూ ప్రజల ఆలోచనలను దారి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే...ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకునేందుకు సిద్ధంగా లేని కాంగ్రెసు కూడా ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నది.