Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా వర్గ పోరాటాలు తీవ్రతరమౌతున్నాయి. పెట్టుబడిదారీ ప్రపంచానికి కేంద్రకంగావున్న అమెరికాలో ఈ ఆర్థిక సంక్షోభ సామాజిక, రాజకీయ వ్యక్తీకరణ తీవ్రస్థాయిలో కనపడుతున్నది. పెట్టుబడిదారీ దేశాలలో వర్గ పోరాటాలు తీవ్రతరమైతేనే అవి సోషలిజం కోసం జరిగే పోరాటాలుగా రూపాంతరం చెందుతాయి.
గత నెలలో ట్రంప్ అధ్యక్ష భవనానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ ఒక అసాధారణ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికకు 'సోషలిజంలో అవకాశాలకు చెల్లించాల్సిన మూల్యం' అనే శీర్షికను పెట్టారు. ఆ నివేదిక ఇలా మొదలయింది. 'కార్ల్ మార్క్స్ 200వ జయంతితోపాటుగా అమెరికా రాజకీయ ప్రవచనం (డిస్కోర్స్)లో సోషలిజం పునఃప్రవేశిం చింది. స్వయం ప్రకటిత సోషలిస్టులు చేస్తున్న సవివర విధాన ప్రతిపాదనలకు కాంగ్రెసులోను, యువ ఓటర్లలోను మద్దతు పెరుగుతున్నది'. అమెరికా కార్మిక వర్గంలో రాజకీయ చైతన్యం అనూహ్యంగా పెరుగుతుండటంతో అమెరికా పాలక వర్గాలు బెంబేలు ఎత్తుతున్నాయి. సోషలిజానికి ప్రజల మద్దతు ముఖ్యంగా యువత మద్దతు పెరుగుతున్నదని అమెరికా ప్రభుత్వం ఈ నివేదిక ద్వారా అధికారికంగా అంగీకరిస్తున్నది. ఒక శతాబ్దం కాలంగా అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతే లౌకిక మతంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ దేశ పాలక వర్గమూ అమెరికా పాలక వర్గంలాగా సోషలిస్టు రాజకీయాలను రాజకీయ ప్రవచనం నుంచి వేరు చేయలేదు.
అత్యంత మితవాద ధోరణితో తయారయిన ఈ 70పేజీల నివేదిక సోషలిజంను అబాసుపాలు చేయటమే ధ్యేయంగా సాగింది. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యం కారణంగా సంక్షోభం తలెత్తిన వెనిజులాను ఉదాహరణగా చూపిస్తూ సోషలిజం అంటే ప్రజలకు కష్టాలు, కన్నీళ్ళే మిగులుతాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. 'అందరికీ ఆరోగ్య సంరక్షణ' అనే సాధారణ సామాజిక సంస్కరణ ప్రతిపాదనతో సోషలిజంను పోల్చటం జరిగింది. మిల్టన్ ఫ్రీడ్మన్, మార్గరెట్ థాచర్లు ప్రవచించిన 'ఆర్థిక స్వేచ్ఛ'ను ఈ నివేదిక కీర్తించింది. ఇక్కడ 'ఆర్థిక స్వేచ్ఛ' అంటే ఎటువంటి ప్రతిబంధకాలూ లేని పెట్టుబడిదారీ మార్కెట్. ఇది అన్ని రకాల సామాజిక సంస్కరణలను, వ్యాపారాలపై విధించే నియంత్రణలను, సంపన్నులపై వేస్తున్న పన్నుల పెంపును నిందించటంగా ఉంటుంది.
సోషలిజాన్ని ఇంత నీచంగా చిత్రించటానికిగల కారణం ఏమిటని చూసినప్పుడు అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఈమధ్య కాలంలో అమెరికా, ఐరోపా దేశాలలో జరిపిన సర్వేలలో ప్రజలు పెట్టుబడిదారీ వ్యవస్థతో విసిగిపోయారనీ, సోషలిజానికి మద్దతు పెరుగుతుందనీ తేలింది. 2017 మే నెలలో యూరోపియన్ బ్రాడ్ కాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో 18-35ఏండ్ల మధ్య వయసున్న యువతలో సగానికి పైగా తాము తిరుగుబాటులో పాల్గొంటామని చెప్పారు. 'ప్రపంచాన్ని బ్యాంకులు, పెట్టుబడి ఏలుతున్నాయి' అని 10మందిలో 9మంది చెప్పారు. గత ఏడాది నవంబరు నెలలో యుగవ్ నిర్వహించిన సర్వే ప్రకారం 21-29ఏండ్ల మధ్య వయసున్న యువతలో 51శాతం పెట్టుబడిదారీ దేశంలో జీవించటం కంటే సోషలిస్టు లేక కమ్యూనిస్టు దేశంలో జీవించటానికే తాము ఇష్టపడుతున్నామని చెప్పారు. అమెరికాలో 18-29ఏండ్ల మధ్య వయసున్న యువతలో సగానికంటే తక్కువమందికి పెట్టుబడిదారీ వ్యవస్థపై సదభిప్రాయం ఉంది. అలాగే అదే వయసున్న సమూహంలో సగానికి పైగా సోషలిజంపట్ల సదభిప్రాయం ఉందని గాల్లప్ సర్వేలో తేలింది. యువతకు పెట్టుబడిదారీ వ్యవస్థపట్ల సానుకూల అభిప్రాయం 2010లో 68శాతం ఉంటే ఈ ఏడాది అది 45శాతం ఉంది. అంటే కేవలం ఎనిమిదేండ్లలో 23శాతం తగ్గింది.
సోషలిజంపట్ల ఇలా ఆసక్తి పెరుగుతున్నదంటే అమెరికాలోను, అంతర్జాతీయంగాను వర్గ పోరాటం పునర్జీవనంలోకి వచ్చిందని అర్థం. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటిదాకా చెప్పుకోదగిన సమ్మెలు 21జరిగాయి. ఈ సంఖ్య 2017తో పోలిస్తే మూడు రెట్లుఎక్కువ. ఈ సంవత్సరారంభంలో జరిగిన ఉపాధ్యాయుల సమ్మె అమెరికా పాలక వర్గాలను భయబ్రాంతులను చేసింది. ఎందుకంటే ఆ సమ్మె దశాబ్దాలుగా వర్గ పోరాటాలను అణచివేస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక సంఘాలను పట్టించుకోకుండా జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా వర్గ పోరాటాలు తీవ్రతరమౌతున్నాయి. పెట్టుబడిదారీ ప్రపంచానికి కేంద్రకంగావున్న అమెరికాలో ఈ ఆర్థిక సంక్షోభ సామాజిక, రాజకీయ వ్యక్తీకరణ తీవ్రస్థాయిలో కనపడుతున్నది. పెట్టుబడిదారీ దేశాలలో వర్గ పోరాటాలు తీవ్రతరమైతేనే అవి సోషలిజం కోసం జరిగే పోరాటాలుగా రూపాంతరం చెందుతాయి.
నిరంతర యుద్ధాలు, తీవ్రస్థాయిలో పెరిగిన సామాజిక అసమానతలు యువతను, కార్మికులను పోరాటాలలోకి దింపి వారిలో రాజకీయ చైతన్యాన్ని నింపాయి. 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం తరువాత పదేండ్లలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అయింది. బుష్ పాలనలో మొదలయిన యుద్ధాలు లిబియా, సిరియా, యెమెన్లకు విస్తరించాయి. ఒబామా కాలంలో కింది నుంచి పైకి సంపద బదిలీ అయింది. వీటన్నింటి పర్యవసానంగా సంక్షోభంలో కూరుకుపోయిన పాలక వర్గాల నేరాలకు, వెనుకబాటుతనానికి అపరావతారంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు.
ట్రంప్ పాలనలో అమెరికా రాజకీయార్థిక వ్యవస్థలో సంక్షోభం మరింతగా తీవ్రతరమౌతున్నది. దానితోపాటుగా వర్గ పోరాటాలు కూడా తీవ్రతరమౌతున్నాయి. ప్రజాకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం పెట్టుబడిదారీ వ్యవస్థలో క్రమేణా బలహీనపడుతున్నది. అంతిమంగా దానిని వదిలించుకోవలసిన సమయం ఆసన్నమైందని ప్రజలు అనుకోవటానికి కావలసిన ప్రక్రియ కొనసాగుతూవుంది.