Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనవరి 23న ప్రజామోదానికి అతీతంగా వెనిజులా 'తాత్కాలిక అధ్యక్షుడు'గా జువాన్ గువాయిడో తనకు తాను ప్రకటించుకున్నారు అధ్యక్షుడిగా గువాయిడో తనకుతాను ప్రకటించుకుంటుండగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనను వెనిజులా అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్టు ఒక ట్వీట్ చేశారు. ఇలా ఒక ట్వీట్‌తో మరోదేశంలో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నానికి లాటిన్ అమెరికాలోని అనేక మితవాద ప్రభుత్వాలు మద్దతునిచ్చాయి. దీనితో అమెరికా ఈ తిరుగుబాటు వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్నట్టు స్పష్టమైంది. కానీ లాటిన్ అమెరికా దేశాలు మెక్సికో, క్యూబా, బొలీవియాలు అమెరికా కుట్రను వ్యతిరేకించాయి. అమెరికా పన్నిన ఈ కుట్రకు కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు తమ మద్దతు ప్రకటించాయి. అయితే రష్యా, చైనా, టర్కీ రాజ్యాంగబద్ధంగా వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన నికొలాస్ మదురోనే తాము గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి.
ప్రపంచంలోనే అత్యంత చమురు, అత్యంత బంగారం నిల్వలున్న దేశాలలో ఒకటయిన వెనిజులాకు అప్రజాస్వామికంగా అధ్యక్షుడినని ప్రకటించుకున్న గువాయిడోను గుర్తించటమంటే ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అవుతుంది. అంతేకాకుండా వెనిజులాతో రష్యా, చైనాలకు గల సన్నిహిత ఆర్థిక, రాజకీయ సంబంధాలను దెబ్బతీయటం కూడా అమెరికా సామ్రాజ్యవాదం నేతృత్వంలో జరుగుతున్న ఈ తిరుగుబాటు లక్ష్యాలలో ఒకటి. ఈ తిరుగుబాటు వెనుక రెండు దశాబ్దాల సన్నాహం ఉంది. 2002లో జార్జి బుష్ అధ్యక్ష పాలనలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మార్గదర్శకత్వంలో ఆనాటి అధ్యక్షుడైన హుగో చావెజ్‌పై తిరుగుబాటు జరిగింది. ఆ తరువాత వెనిజులా 'అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి అసాధారణ స్థాయిలో ప్రమాదకరంగా పరిణమించినందున ఆంక్షలను విధిస్తున్నాం' అని అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అన్నారు.
ఇలా చట్టవిరుద్ధ ప్రభుత్వానికి మద్దతు పలికి వెనిజులాలో సైనిక తిరుగుబాటుకే కాకుండా బయట నుంచి సైనిక జోక్యానికి కావలసిన పరిస్థితులను ట్రంప్ ప్రభుత్వం సృష్టిస్తోంది. అమెరికా జోక్యానికి ప్రతిగా ఆ దేశంతో వెనిజులాకున్న దౌత్య సంబంధాలను రద్దు చేసినట్టు అధ్యక్షుడు మదురో ప్రకటించారు. అంతేకాకుండా 72గంటలలో అమెరికా దౌత్య సిబ్బందిని దేశం వీడాలని కూడా ఆదేశించారు. ఈ ప్రకటన చెల్లదని, అమెరికా దౌత్య సిబ్బంది దేశంలోనే ఉండాలని 'తాత్కాలిక అధ్యక్షుడు' గువాయిడో కోరినందున తాము వెనిజులాలోనే ఉండదలచామని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ విధంగా మదురో ఆ దేశాన్ని విస్మరించటం ద్వారా వెనిజులాతో అమెరికా ఘర్షణకు దిగింది.
మదురో ప్రభుత్వంతో ఏర్పడిన ఘర్షణను వెనిజులాలో సైనిక జోక్యానికి సాకుగా అమెరికా వాడదలచింది. నిజానికి వెనిజులాలో సైనిక జోక్యం అమెరికా ప్రభుత్వ పరిగణనలో ఉందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. మదురో ప్రభుత్వాన్ని 'అక్రమ' ప్రభుత్వమని, 'ప్రజాస్వామ్యం' కోసం అమెరికా నిలబడుతుందని ట్రంప్ చెప్పటం మరీ విడ్డూరం. ఇలా చెబుతున్న ట్రంప్ పాలనకు సౌదీ అరేబియాలో హంతక పోలీసు రాజ్యాన్ని నడుపుతున్న రాచరిక మహ్మద్‌బిన్ సల్మాన్ ప్రభుత్వం, ఈజిప్ట్‌లో జనరల్ సిసి నియంతృత్వంతోపాటు మధ్యప్రాచ్యంలోగల అనేక నియంతృత్వ ప్రభుత్వాలతో ఎటువంటి పేచీ లేదు.
అమెరికాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలమధ్య ఎన్ని అభిప్రాయబేధాలున్నప్పటికీ వెనిజులా తిరుగుబాటు విషయంలో ఆ రెండు పార్టీలూ ఒకే తాటిమీద నడుస్తున్నాయి. అమెరికా తొత్తులయిన స్వయం ప్రకటిత వెనిజులా అధ్యక్షుడు గువాయిడో, అతని అనుచరులను 'గొప్ప దేశభక్తులు, వెనిజులా ప్రజాస్వామ్య భవితకు ఆశాకిరణాలు'గా అమెరికా సెనేట్‌లో డెమోక్రటిక్ పార్టీ విప్గావున్న డిక్ డర్బిన్ అభివర్ణించారు. గువాయిడో తననుతాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న రోజు 'వెనిజులాలో ఒక నూతన గొంతుక ఆవిర్భవించింది' అని రాసిన న్యూయార్క్ టైమ్స్ ఆ 'నూతన గొంతుక' అమెరికా పెయిడ్ ఏజంట్ అని తన పాఠకులకు తెలియజేయటాన్ని విస్మరించింది. ఇదే దినపత్రిక 2002లో చావెజ్‌పై సీఐఏ ప్రోత్సాహంతో జరిగిన విఫల సైనిక తిరుగుబాటును సమర్థించిందనే వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి.
వెనిజులాలో కొనసాగుతున్న తిరుగుబాటుతో లాటిన్ అమెరికాకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా అంతఃసూచనలున్నాయి. అంతర్జాతీయ బూర్జువావర్గం నియంతృత్వ పాలనా రూపాలను ఎంచుకోవటంతో ఈ పరిణామాన్ని విడదీయలేము. అమెరికాలో అత్యవసర పరిస్థితిని విధిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. నాజీలతో కుమ్మక్కయిన పెటైన్కు నివాళులర్పించాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఉవ్విళ్ళూరుతున్నారు. జర్మనీలో ప్రధాన ప్రతిపక్షంగా ఫాసిస్టుల ఏఎఫ్‌డీ ఆవిర్భవించింది. ఇటలీ ప్రభుత్వం మితవాద శక్తుల ఉక్కు కౌగిలిలో నలిగిపోతోంది. భారతదేశంలో మతతత్వ శక్తుల నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ప్రతిచోటా ద్రవ్య పెట్టుబడి గుప్పెట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు కునారిల్లుతున్నాయి.
అంతిమంగా వెనిజులాలో కనీస ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు దేశంలోని యావత్ ప్రజానీకాన్ని సమీకరించాలి. అవసరమైతే సాయుధం చెయ్యాలి. అలాగైతేనే మదురో మరో అలెండీగా మిగిలిపోకుండా మనగలుగుతారు!