Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి3వ తేదీనాడు బ్రిటిష్ లేబర్‌పార్టీ నాయకుడైన జెరెమీ కోర్బిన్‌పై భౌతికదాడి జరిగింది. ఆయన వార్షికంగా జరిగే 'నా మసీదును సందర్శించండి' కార్యక్రమంలో భాగంగా ఉత్తరలండన్లోని ముస్లిం వెల్ఫేర్ సెంటర్ సందర్శించినప్పుడు ఈ దాడి జరిగింది. జాన్ మర్ఫీ అనే 31ఏండ్ల యువకుడు కోడిగుడ్డుతో వెనుక నుంచి కోర్బిన్ తలపై కొట్టాడు. 'వేసిన ఓటునుబట్టి నీకు రావల సింది వస్తుంది' అని అరిచాడు. ఆ ఘటనకు సమీపంలోవున్నవారు మర్ఫీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యూరోపియన్ యూనియన్ నుంచి ప్రధాని థెరేసా మే ప్రతిపాదిత బ్రిటన్ నిష్క్రమణ(బ్రెగ్జిట్), లేబర్‌పార్టీ ప్రతిపాదించే ప్రత్యామ్నాయ ప్రణాళిక విఫలమయితే మరోసారి రిఫరెండం జరపటానికి కోర్బిన్ మద్దతు ఇస్తాడనే అనుమానంతో మర్ఫీ ఈదాడి చేసినట్టు తెలుస్తోంది.
మితవాద పాలకవర్గం, దాని నేతృత్వంలో నడిచే మీడియా సృష్టించిన అసహన రాజకీయ వాతావరణంతో ఏర్పడే ప్రమాదం గురించి మార్చి3న ఘటనలు హెచ్చరికగా ఉన్నాయి. అభివృద్ధి నిరోధక మితవాద రాజకీయ శక్తులపట్ల మరింత జాగరూకతతో ఉండవలసిన అవసరాన్ని, ఈ శక్తులకు వ్యతిరేకంగా నిశ్చయాత్మక రాజకీయ పోరాటం చేయవలసిన అవసరాన్ని కోర్బిన్‌పై జరిగిన దాడి గుర్తు చేస్తోంది. సాధారణంగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిపై భౌతికంగా దాడి జరిగినప్పుడు మీడియా విపరీతంగా పట్టించుకుంటుంది. అయితే కోర్బిన్‌పై జరిగిన దాడి గురించి బ్రిటిష్ మీడియా ఆలస్యంగా స్పందించటమే కాకుండా జరిగిన దాడి తీవ్రతను తక్కువచేసి చూపింది. బీబీసీ 'విసరబడిన కోడి గుడ్డు' అని, సన్ 'గుడ్డుతో దాడి' అని రాశాయి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ పోలీసు కూడా 'కోడి గుడ్డు విసరటం'గా నమోదు చేసింది. మితవాద గిడో ఫాక్స్ బ్లాగ్ మర్ఫీని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో మర్ఫీ తాను కోడిగుడ్డును కోర్బిన్ నెత్తిమీద కొట్టానని పేర్కొనటమే కాకుండా కోర్బిన్‌కు హమస్, ఐఆర్ఏలతో సంబంధం ఉందని కూడా ఆరోపించాడు. 'దేశంలోని మెజారిటీ ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసమే' తాను అటువంటి చర్యకు పాల్పడ్డానని ఆ ఇంటర్వ్యూలో మర్ఫీ చెప్పాడు. ఫాసిస్టు ధోరణిగల ఈ బ్లాగ్ కోర్బిన్‌పై మర్ఫీ చేసిన దాడిని కొనియాడింది.
బ్రెగ్జిట్తోను, కోర్బిన్, వామపక్షాలపై చేసిన దాడుల ఫలితంగాను ఉద్భవించిన ఉద్రిక్త రాజకీయ వాతావరణం కారణంగా కోర్బిన్‌పై మర్ఫీ దాడి చేశాడు. ఈ దాడుల వెనుక క్రూరమైన తర్కం ఉంది. 2017 జూన్19న డార్రెన్ ఓస్బోర్న్ అనే వ్యక్తి ఒక వాహనాన్ని అద్దెకు తీసుకుని ఫిన్స్‌బరీ పార్క్ మసీదు బయట నమాజు చేయటానికి వచ్చిన వారిపై వేగంగా తన వాహనాన్ని నడిపినప్పుడు 12మంది గాయపడ్డారు. మక్రామ్ అలీ అనే అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆ సంఘటనను 'టెర్రరిస్టు మర్డర్'గా భావించిన న్యాయమూర్తి ఓస్బోర్న్కు 2018 ఫిబ్రవరి18న 43ఏండ్లు కారాగార శిక్ష విధించాడు. విచారణ సందర్బంగా కోర్బిన్‌ను, లేబర్ పార్టీకి చెందిన లండన్ మేయర్ సాధిక్ ఖాన్‌ను సెంట్రల్ లండన్‌లో ఒక నిరసన ప్రదర్శనలో చంపాలని తాను ఒక ప్రణాళిక రూపొందించినట్టు ఓస్బోర్న్ అంగీకరించాడు.
ఓస్బోర్న్ బ్రిటన్ ఫస్ట్ అనే సంస్థ చేస్తున్న ఫాసిస్టు ప్రచారంతోను, టోమ్మీ రాబిన్సన్ ముస్లిం వ్యతిరేక ఉన్మాదపూరిత వ్యాఖ్యలతోను ప్రభావితమయ్యాడు. ఓస్బోర్న్ దాడికి కేవలం ఒకేడాది ముందు ఫాసిస్టు థామస్ మైర్ లేబర్ పార్లమెంట్ సభ్యురాలు జో కోక్స్ను హత్య చేశాడు. అతను 'బ్రిటన్ ఫస్ట్, ఇది బ్రిటన్ కోసం' అని అరుస్తూ ఆమెపై కాల్పులు జరిపాడు. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా, వద్దా అనే విషయంపై రిఫరెండం జరగటానికి ఒక వారం ముందే కోక్స్ హత్య జరిగింది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో కొనసాగాలని ప్రచారం చేసిన ప్రముఖులలో ఆమె ఒకరు.
ఇంగ్లాండు రాజకీయాలలో వెర్రి ఆవేశం ప్రబలమవుతోంది. పాలకవర్గం వివిధ వర్గాలుగా చీలిపోయి యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా, వద్దా అనే విషయంపై ఈ వర్గాలు ఘర్షణ పడటం జరుగుతోంది. అయితే మొత్తంగా చూసినప్పుడు పాలకవర్గ ధోరణి యావత్తు మితవాదంవైపే మొగ్గుతోంది. బ్రెగ్జిట్ గురించి పాలకవర్గ ముఠాల మధ్య ఎన్ని బేధాభిప్రాయాలున్నా ఆ ముఠాలన్నింటికీ కార్మికవర్గానికి వ్యతిరేకంగా మితవ్యయ చర్యలను చేపట్టాలనే లక్ష్యంతో ఉంది. అలా చేసినప్పుడు తీవ్రస్థాయి సామాజిక వ్యతిరేకత వస్తుందేమోననే భయం కూడా ఈ పాలకవర్గ ముఠాలకు ఉంది. కోర్బిన్ లేబర్ పార్టీలోని యువతను వామపక్షంవైపు తిప్పాడుగానీ వారిని సమరశీలం చేయలేకపోయాడు. అయినప్పటికీ అది జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందని బ్రిటిష్ పాలక వర్గం భావిస్తోంది.
ఐరోపా అంతటా పచ్చి మితవాద, ఫాసిస్టు పార్టీలు విజృంభిస్తున్న నేటిస్థితిలో బ్రిటన్‌లో కోర్బిన్ నాయకత్వం వహిస్తున్న లేబర్‌పార్టీ కూడా ఈ ధోరణికి అతీతంగా లేదు. చరిత్రలో పదేపదే పునరావృతమౌతున్నట్టు పసలేని సంస్కరణవాదానికి సోషలిజం కోసం పోరాటం చేయగల సత్తా లేకపోవటమే కాకుండా తననుతాను రక్షించుకోగల శక్తి కూడా ఉండదు. బ్రిటిష్ చరిత్ర కోర్బిన్ కోసం ఈ పాఠాన్ని సిద్ధంగా ఉంచినట్టు కనపడుతోంది.