Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈవారంలో బ్రెజిల్ అధ్యక్షుడు అమెరికాలో మూడు రోజులపాటు చేసిన పర్యటన ప్రపంచంలో అత్యంత కరడుగట్టిన ఇద్దరు మితవాదులను కలిపింది. ఆ మితవాదులలో ఒకరు జైర్ బోలసొనారో. ఈయన మాజీ సైనికాధికారి. బ్రెజిల్లో 1964 సంవత్సరం నుంచి 1985 సంవత్సరందాకా సాగిన కిరాతక సైనిక పాలన సమర్థకుడు. రెండో వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈయన ప్రపంచవ్యాప్తంగా సైనిక నియంతలను, ఫాసిస్టులను ఆకర్షించే ధృవంలాంటివాడు. అమెరికా అధ్యక్ష నివాసమైన శ్వేత భవనంలో మంగళవారంనాడు జరిగిన సంయుక్త పత్రికా సమావేశంలో 'పశ్చిమార్థ గోళంలో సోషలిజం ముగింపు దశకు వచ్చింది' అని ట్రంప్ ప్రకటించాడు. సోషలిజాన్ని అంతం చేయటమనే ఫాసిస్టు ఉద్యమాల రాజకీయ లక్ష్యాన్ని ట్రంప్, బోలసొనారోలు తమ ప్రభుత్వాల ప్రధాన కార్యక్రమంగా ఎంచుకున్నారు. న్యూజిలాండ్‌లో బ్రెంటన్ టర్రాన్ట్ అనే శ్వేతజాతికి చెందిన ఉగ్రవాది ముస్లింలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనేకమంది మరణానికి కారకుడైన కొద్దిరోజులకే ట్రంప్, బోల్సొనారోలు సోషలిజం అంతమే మా పంతం అని ప్రకటించారు. 'శ్వేతజాతీయుల నవ్య అస్థిత్వానికి ట్రంప్ ప్రతీక' అనీ, 'ప్రతి మార్క్సిస్టు మెడపై తన కాలుతో తొక్కుతాను' అనీ టర్రాన్ట్ విడుడల చేసిన మానిఫెస్టోలో ప్రకటించాడు. శ్వేత భవనంలో ట్రంప్, బోల్సొనారో కలయిక పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు శక్తులను ఎలా పెంచి పోషిస్తున్నాయో తెలిపింది. ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా, అమెరికా దేశాలలో ఫాసిజానికి కింది నుంచి ప్రజాసమూహాల మద్దతు లేదు. 'ప్రజాస్వామ్య' ప్రభుత్వాల పేరిట కార్పొరేట్ పెట్టుబడిదారుల సహకారంతో ఫాసిజం వేళ్లూనుతోంది. సోమవారం రాత్రి బోల్సొనారో ఇచ్చిన విందులో ప్రధాన అతిథిగా తీవ్ర మితవాది స్టీవ్ బాన్నన్ పాల్గొన్నాడు. ఈయన గతంలో గోల్డ్‌మన్ శాక్స్ వైస్ ప్రెసిడెంట్‌గాను, నౌకాదళ అధికారిగాను పనిచేశారు. ప్రస్తుతం ఈయన ఫాసిస్టు ఉద్యమాలకు మేధో, వ్యవస్థీకృత సేవలను అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈయనకు బోల్సొనారో కుమారుడైన ఎడ్యుయార్డోతో సన్నిహిత సంబంధాలను కలిగివున్నాడు. ఎడ్యుయార్డో బ్రెజిల్ పార్లమెంటు సభ్యుడు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రగతినిరోధక రాజకీయ పార్టీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బాన్నన్ స్థాపించిన మూవ్మెంట్ అనే ఉద్యమానికి ఎడ్యుయార్డో లాటిన్ అమెరికా ప్రతినిధిగా ఉన్నాడు.
వెనెజులా అధ్యక్షుడైన నికొలస్ మదురోను ఒక సోషలిస్టు నియంతగా అభివర్ణిస్తూ ఇద్దరు అధ్యక్షులూ వెనెజులాపై సైనికశక్తిని ప్రయోగిస్తామని బెదిరించారు. 'ప్రత్యామ్నాయా లన్నీ ఎదురుగానే ఉన్నాయి' అని ట్రంప్ వెనెజులాపై గతంలో చేసిన బెదిరింపును పునరుద్ఘాటించాడు. వెనెజులాపై దాడి చేయటానికి సైనిక స్థావరంగా బ్రెజిల్ భూభాగాన్ని వాడుకోవటానికి అనుమతినివ్వాలని ట్రంప్ బ్రెజిల్ అధ్యక్షుడ్ని అడిగాడు. అది బ్రెజిల్, వెనెజులా ప్రాదేశిక సమగ్రతకు భంగకరమని తెలిసినా సైనిక కార్యకలాపాల రహస్యాన్ని బయటకు చెప్పకూడ దంటూ సమాధానాన్ని బోల్సొనారో దాటవేశాడు.
ట్రంప్, బోల్సొనారోలు చేసుకున్న ఒక ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం అమెరికా ఉపగ్రహాలను ప్రయోగించే స్థావరంగా బ్రెజిల్‌లోని అల్కాంటారా ఉంటుంది. ఈ చర్యలన్నింటినీ బ్రెజిల్‌ను అమెరికా రక్షణ వ్యవస్థలో అంతర్భాగం చేసేందుకు సందేహం లేదు. శ్వేతభవనాన్ని దర్శించటానికి ముందు బోల్సొనారో వర్జీనియాలోని లాంగ్లేలోవున్న అమెరికా గూఢచార సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించాడు. సీఐఏ మద్దతుతో నెలకొల్పిన సైనిక నియంతృత్వ క్రూరపాలనలో 21ఏండ్లపాటు మగ్గిన దేశాధినేత సీఐఏ కార్యాలయాన్ని సందర్శించటం నిజంగా అసాధారణం.
బ్రెజిల్ మిలిటరీ నియంతృత్వాన్ని కీర్తించటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రగతినిరోధక శక్తులతో కార్మిక వర్గానికి ఎంత ప్రమాదం పొంచివుందో బోల్సొనారో చెప్పకనే చెప్పాడు. వేలాది ప్రజలను హత్యచేసి, హింసించి, జైళ్లలో కుక్కిన సైనిక ప్రభుత్వాన్ని కీర్తించిన ఒక మాజీ సైనికాధికారి ప్రభుత్వంతో తమ ప్రభుత్వానికి 'సమిష్టి విలువలు' ఉన్నాయని ట్రంప్ పొగడటం మరీ విడ్డూరం. 20ఏండ్ల క్రితం ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో బ్రెజిల్ పార్లమెంటును మూసివేయాలని, దేశం మారాలంటే కనీసం 30వేలమంది చనిపోయే అంతర్యుద్ధం రావాలని ఆయన ప్రకటించాడు.
తీవ్రమౌతున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం, చిన్నాభిన్నమైన రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ క్రమం, పెరుగుతున్న వాణిజ్యయుద్ధాల తీవ్రత, భౌగోళిక వ్యూహాల ఘర్షణ, అన్నింటికీ మించి ప్రపంచ స్థాయిలో వర్గపోరాటాలు పునరావిర్భవించటంవంటి కారణాలచేత బూర్జువావర్గాలు మరోసారి నియంతృత్వంవైపు, ఫాసిజంవైపు మొగ్గుచూపు తున్నాయి. ఈ పరిణామాలు సోషలిజమా లేక సంస్కరణవాదమా అనే ప్రత్యామ్నాయా లను మనుముందు ఉంచటం లేదు. రోజా లక్సెంబర్గ్ అన్నట్టుగా సోషలిజమా లేక ఆటవిక సమాజమా అనేవాటినే ప్రత్యామ్నాయాలుగా మనముందు ఈ పరిణామాలు ఉంచాయి. ఫాసిజాన్ని, సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రతిఘటించాలంటే అంతర్జాతీయ స్థాయిలో కార్మిక వర్గాన్ని సమీకరించటమొక్కటే మనముందున్న ఏకైక మార్గం!