Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్‌ట్రంప్ రష్యాతో కుమ్మక్కయ్యాడనే ఆరోపణను గత అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రధాన ఆయుధంగా వాడింది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికను చెడగొట్టాలని రష్యా ప్రయత్నిస్తున్నదని, ట్రంప్ పుతిన్ ఏజంట్‌గా మారాడని కార్పొరేట్ మీడియా న్యూయార్క్ టైమ్స్ నాయకత్వంలో నిరాధార ఆరోపణలు చేసింది. ఇదంతా పూర్తి నిరాధారమని, ట్రంప్ రష్యాతో కుమ్మక్కు కాలేదని రాబర్ట్ మ్యుయల్లర్ నివేదిక పేర్కొనటం డెమోక్రటిక్ పార్టీకి, కార్పొరేట్ మీడియాకు రాజకీయంగా చెంపపెట్టువంటిదని చెప్పాలి.
రెండేండ్ల పాటు ఈ విషయం గురించి లోతుగా విచారించి మ్యుయల్లర్ తన నివేదిక సమర్పించాడు. అత్యంత ప్రగతి నిరోధక రాజకీయ లక్ష్యాలను చేరుకోవటానికి రష్యాగేట్గా పేరొందిన రష్యా వ్యతిరేక బూటకపు ప్రచారాన్ని అమెరికా ప్రజలపై రుద్దారని ఈ నివేదిక పేర్కొంది. శనివారంనాడు మాట్ తైబ్బి అనే పాత్రికేయుడు ఈ విషయంపై రాసిన వ్యాసానికి 'రష్యా గేట్ నేటితరం మానవ హనన ఆయుధం' అనే శీర్షిక పెట్టాడు. ఆ వ్యాసంలో ఆయన ఇలా రాశాడు: 'ఇరాక్ యుద్ధంలో అమెరికా ప్రభుత్వ పిట్టకథలను ప్రచారం చేయటంవల్ల మీడియా పరువు పోయింది. కొద్దోగోప్పో మిగిలిఉన్న మీడియా పరువును రష్యాగేట్ పూర్తిగా నాశనం చేసింది. అయితే ఒక పాత్రికేయ వైఫల్యంగా చూసినప్పుడు రష్యాగేట్ అనే కొండతో పోలిస్తే మానవ హనన ఆయుధం ఒక చీమలాంటిది'.
ప్రధాన మీడియాకు చెందిన వివిధ సంస్థల సంపాదకులు, డెమోక్రటిక్ పార్టీలోని విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడటమే కాకుండా సీఐఏ, ఎన్ఎస్ఏ, ఎఫ్బీఐవంటి గూఢచార సంస్థల్లోని ముఠాల వాదనలకు వాహకాలుగా మారారు. ఈ సంస్థలు ట్రంప్‌ని పూర్తిగా ప్రగతినిరోధక పార్శం నుంచి దాడిచేశాయి. రష్యాకు వ్యతిరేకంగా తగినంత దూకుడు ప్రదర్శించటం లేదని, సిరియాలో సైనిక జోక్యాన్ని ముమ్మరం చేయటం లేదనే కారణంతో ఈ సంస్థలు ట్రంప్‌ను వ్యతిరేకించాయి.
రష్యా వ్యతిరేక ప్రచారం ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదాన్ని తలపించింది. రష్యాకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధ సన్నద్ధతను సమర్థించుకోవటానికి ఒక ఉన్మాద వాతావరణాన్ని సృష్టించటం, ట్రంప్‌కు వ్యతిరేకంగా వున్న ప్రజా వ్యతిరేకతను యుద్ధ అనుకూలతగా మార్చటం, ప్రజాస్వామిక హక్కులపై దాడి చేయటానికి ఏదో ఒక సాకును సృష్టించటం అనే లక్ష్యాల సాధన కోసం ఈ ప్రచారం సాగింది. రష్యా వ్యతిరేక అంతర్జాతీయ బహుముఖ ఫ్రంట్‌లో భాగంగా ఈ ప్రచారం జరిగింది.
ఇటువంటి దగాను ప్రచారంలో పెట్టిన వారిలో డెమోక్రటిక్ పార్టీకు చెందిన హౌస్ ఇంటిలిజెన్సీ కమిటీ సభ్యుడుగావున్న ఆడమ్ స్కిఫ్ ఒకడు. ఇతనితోపాటు సెనేట్ సభ్యుడైన మార్క్ వార్నర్, ఎమ్ఎస్ఎన్బిసికి చెందిన రాచెల్ మద్దో, అర్థరాత్రి టీవీ షోలను నిర్వహించే స్టీఫెన్ కోల్బర్ట్, సేత్ మేయర్స్, టైమ్స్ సంపాదకీయ పేజీ బాధ్యుడు జేమ్స్ బెన్నెట్, కార్టర్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో సీఐఏ మద్దతుతో నడిచిన ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనే సంస్థను నడిపిన ఇతని తండ్రి డగ్లస్ బెన్నెట్ తదతరులు ఈ ముఠాలో ఉన్నారు. ఒబామా పాలనలో నేషనల్ ఇంటిలిజెన్సీ డైరెక్టర్‌గా పనిచేసిన జేమ్స్ క్లాప్పర్, ఒబామా సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నన్ తదతరులందరూ ప్రచార మాద్యమాలలో ట్రంప్‌ని రష్యా తొత్తు అని ప్రచారం చేశారు.
వీరందరూ ఒక పెద్ద రాజకీయకుట్రలో భాగస్వాములయ్యారు. అమెరికా ద్రవ్యపెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా మసలే హిల్లరీ క్లింటన్‌ను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసింది. ట్రంప్ ప్రకటించిన కార్మిక వర్గ వ్యతిరేక సామాజిక విధానాన్ని లేక ప్రజాస్వామిక హక్కులపట్ల అతనికున్న ఏహ్యభావాన్ని లేక అతని వర్ణ వివక్షతో కూడిన వలస వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించకూడదని డెమోక్రటిక్ పార్టీ ముందుగానే నిర్ణయించింది. అటువంటి ప్రగతినిరోధక విషయాలపై ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ బడ్జెట్లో రక్షణరంగానికి రికార్డ్ స్థాయి కేటాయింపులు జరపటానికి అధ్యక్ష భవనంతో డెమోక్రటిక్ పార్టీ కుమ్మక్కయింది. సంపన్నులకు పన్నులు తగ్గించటం, అమెరికాకు వలసొచ్చిన వారిని జైళ్లలో కుక్కటం వంటి ట్రంప్ చర్యలకు డెమోక్రటిక్ పార్టీ ప్రత్యక్ష, పరోక్ష మద్దతునిచ్చింది. ఒకవైపు రష్యా వ్యతిరేక ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మరోవైపు ప్రజలను లింగ, వర్ణ ప్రాతిపదికన చీల్చే 'మీ టు' ఉద్యమాన్ని ప్రోత్సహించింది. అంతేకాకుండా సామ్రాజ్యవాద యుద్ధాలకు మద్దతుదారులుగా ఉన్న ఉన్నత శ్రేణి వర్గాలను బలోపేతం చేసింది.
మ్యుయల్లర్ నివేదికతో డెమోక్రటిక్ పార్టీ నిజస్వరూపం బయటపడింది. ట్రంప్‌ను తొలగించాలనే ప్రయత్నంగానీ, రష్యాపట్ల ఆయన దుందుడుకుగా వ్యవరించేలా చేయటానికి చేసిన ప్రయత్నాలుగానీ ఫలించకపోగా అవి రిపబ్లిక్ పార్టీ బలోపేతం కావటానికి దారీతీసింది. ఆవిధంగా మ్యుయల్లర్ నివేదిక డెమోక్రటిక్ పార్టీనే కాకుండా 'ఫేక్ న్యూస్' ఫ్యాక్టరీలుగావున్న కార్పొరేట్ మీడియాను కూడా నగంగా అమెరికా ప్రజలముందు నిలబెట్టింది. అంతిమంగా మ్యుయల్లర్ నివేదిక అమెరికా ప్రజాస్వామిక ఉద్యమ అమ్ములపొదిలో ఒక ఆయుధమైంది.