Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హత్యలు, లైంగిక దాడులు, కత్తిపోట్లు, దొమ్మీలు, సహాయం కోసం అర్ధింపులు, కుంగుబాట్లతో జరిగే ఆత్మహత్యలు, ఆక్రందనలు అక్కడ సర్వసాధారణం. ఇదేదో ఎల్-సిసి పాలనలోని ఈజిప్ట్లోనో లేక బిన్ సల్మాన్ సౌదీ అరేబియాలో కనపడే దృశ్యం కాదు. అలాగే ఇరాక్‌లో అబు ఘరైబ్ చెరసాలలోనో, సీఐఏ ఆధ్వర్యంలో నడిచే గ్వాంటానమో బే వంటి నిర్బంధ శిబిరంలోనో కనపడే దృశ్యం కాదు. అలబామా ప్రభుత్వ కారాగారంలో కనిపించే ఈ దృశ్యాలను వివరిస్తూ అమెరికా న్యాయశాఖ గతవారం ఒక నివేదిక విడుదల చేసింది. క్రూర, అసాధారణ శిక్షలను నిషేధించిన అమెరికా రాజ్యాంగానికి చేసిన 8వ సవరణ దారుణ ఉల్లంఘనకు గురవుతున్న విషయాన్ని ఈ దృశ్యాలు మనకు తెలియజేశాయి. అలబామా జైలులో జరుగుతున్న ఇటువంటి అకృత్యాలకు సంబంధించిన 2000 ఫొటోలను సదరన్ పోవర్టీ లా సెంటర్ అనే సంస్థ ఈ నివేదిక వెలువడకముందే మీడియాకు అందించింది. ఇటువంటి ఘటనలు భయానకం అయినప్పటికీ ఇవి అలబామా రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఇవి వివిధ రూపాల్లో అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. 23లక్షలమంది ఖైదీలను కిక్కిరిసిన జైళ్లలో కుక్కుతున్నారు. అమెరికాలోని ఫెడరల్, రాష్ట్ర, స్థానిక, వలస జైళ్లలో పరిస్థితులు అత్యంత అమానవీయంగా ఉన్నాయి. డెబ్బై లక్షలమంది అమెరికన్లు 'నేర న్యాయ వ్యవస్థ' అనే వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ప్రజలలో నాల్గో వంతు అమెరికాలోనే ఉన్నారు. ప్రతి లక్షమంది అమెరికా పౌరులలో 698మంది ఖైదీలుగా ఉన్నారు. 5,40,000 మంది ఖైదీలలో ఎవరికీ ఏ నేరానికీ శిక్షపడలేదు. చాలామంది జైళ్లలోనే మగ్గిపోవటానికి కారణం బెయిల్ తీసుకోవటానికి కావలసిన 10000డాలర్ల మొత్తాన్ని చెల్లించగలిగే స్తోమత లేకపోవటమే. మరో 5లక్షల మందిలో ఐదుగురిలో ఒకరు హింసతో సంబంధం లేని డ్రగ్స్ కేసుల్లో దీర్ఘకాలం శిక్షల్ని అనుభవిస్తున్నారు. ఏ రోజైనా 61000మంది ఖైదీలను ఏకాంత నిర్బంధంలో ఉంచటాన్ని చూడగలమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి నిర్బంధాన్ని క్రూరమైన శిక్షగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. వీరిలో కనీసం 4000మందిని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేయటంతో వారు మానసిక రోగులుగా మారు తున్నారు. అంతేకాకుండా ఈ పరిస్థితి ఖైదీలను ఆత్మహత్యలకు పురికొల్పుతోంది.
అప్పులు తీసుకున్నవారికోసం ఏర్పాటు చేసే జైళ్లు చట్టవిరుద్ధమని అధికారికంగా ప్రకటించినా అప్పులు తీర్చనందుకు పేద కార్మికులను నిర్బంధిస్తూనే ఉన్నారు. ఇండియానా రాష్ట్రంలో తనకు అందని అంబులెన్స్ బిల్లు కట్టలేదని ఒక పేద తల్లిని మూడు రోజులపాటు మురికి కూపంగావున్న జైలులో నేరస్థుల మధ్య ఉంచారు. ఇటువంటి కథలు అమెరికాలో సర్వసాధారణం. ట్రంప్ పాలనలో వలస వచ్చినవారిపై ఫెడరల్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించి వేలాది స్త్రీ, పురుషులను, పిల్లలను అత్యంత హేయమైన పరిసరాలలో నిర్బంధిస్తున్నారు. దక్షిణ సరిహద్దును దాటటానికి ప్రయత్నించారనే ఆరోపణతో ఫిబ్రవరిలో 77000మందిని నిర్బంధించారు. వలస కార్మికులను వారి ఇళ్లవద్ద, పని ప్రదేశాలలో అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా అమెరికా నగరాలలో ప్రతిఏటా 1000మందికిపైగా పోలీసులచేత చంపబడుతున్నారు. పోలీసులపై నేరారోపణలు చాలా అరుదు. వారిపై శిక్షల ఊసే ఉండదు. దానితో పోలీసులు ఎటువంటి జంకూ లేకుండా ప్రజలను కాల్చి చంపుతుంటారు.
తమ దేశంలో ఇంత జరుగుతున్నా పట్టించుకోని అమెరికా పాలక డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవటం కోసం ఏ దేశంలోనైతే ప్రభుత్వాలను మార్చాలనుకుంటాయో లేక ఏ దేశంపైనైతే దాడి చేయదలిచాయో ఆ దేశంలో మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తుంటాయి. కేవలం ముగ్గురు వ్యక్తులు దేశంలోని కింది సగం జనాభాతో సమానంగా సంపదను నియంత్రించే దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గదర్శిగా ప్రకటించుకోవటం అమెరికాకే చెల్లింది. ఒకవేళ అమెరికా జైళ్లలోని నికృష్ట పరిస్థితులు రష్యా, చైనాలలో ఉన్నట్టయితే మీడియాలోను, అమెరికా కాంగ్రెసులోను నానా యాగీ చేసి ఆర్థిక ఆంక్షల్ని విధించాలని, 'మానవతా' సైనిక జోక్యం చేసుకోవాలనే డిమాండ్లు మిన్నంటేవే.
50ఏండ్ల క్రితంవరకూ అలబామా జైళ్లలోని పరిస్థితుల వంటివి బయటపడినప్పుడు రాజకీయ పార్టీలు, మీడియా తీవ్రంగా స్పందించేవి. కానీ నేడు అటువంటి పరిస్థితి లేదు. జైళ్ల దుస్థితికి తానుకూడా కారణమైనందున డెమోక్రాటిక్ పార్టీ మౌనంగా ఉంది. మీడియాలోను, విద్యాలయాలలోను, పని ప్రదేశాలలోను జరుగుతున్న 'నేను సైతం' ఉద్యమంలో అమెరికా జైళ్లలో జరుగుతున్న లైంగిక హింస గురించి గానీ, అమెరికాకు ప్రాణరక్షణ కోసం వలస వస్తున్న వారిపై జరుగుతున్న హింస గురించి గానీ ప్రస్తావనే లేదు. అంతిమంగా అమెరికా జైళ్లలోని నికృష్ట పరిస్థితులు, రాజ్య అణచివేత యంత్రాంగం అమెరికా 'ప్రజాస్వామ్యం'లోని డొల్లతనానికి ప్రతీకలు. అమెరికా సమాజానికి సారధ్యం వహిస్తున్న ద్రవ్య పెట్టుబడికి వ్యతిరేకంగా పెల్లుబికే సామాజిక, రాజకీయ నిరసనలను అణచివేసేటందుకే ఈ రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగిస్తారు. అమెరికా పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్థ నగ స్వరూపం ఇదే.