Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఆనందంగా, హాయిగా ఉండే దంపతులే ఆరోగ్యంగా నాలుగు కాలాలు ఎక్కువగా జీవిస్తారని చెబుతున్నారు ఆధునిక పరిశోధకులు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్నపుడు జీవితం పట్ల ప్రేమ ఇనుమడిస్తుంది. ఒకరంటే ఒకరికి ఉండే ఆపేక్ష వల్ల బతుకు మీద మమకారం పెరుగుతుంది. ఇదే విషయాన్ని ఎనిమిదేళ్ళ పరిశోధనలో నిగ్గుతేల్చారు నెదర్లాండ్స్‌లోని టిల్బర్గ్ యూనివర్సిటీ పరిశోధ కులు. భాగస్వామి ఆనందంగా వుంటే వైవాహిక జీవితం సౌఖ్యంగా ఉండడమే కాదు, ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారు. అమెరికాలో ఎనిమిది సంవత్సరాల పాటు 4400 మంది దంపతుల జీవనవిధానాల్ని ఎనిమిది సంవత్సరాల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ ఎనిమిదేళ్ళ కాలాన అధ్యయనానికి సహకరించిన వారిలో 16 శాతం మంది చనిపోయారు. వీరి మరణాలకు దారితీసిన పరిస్థితుల్ని పరిశీలిస్తే బాంధవ్యాలు బలహీనంగా ఉండటం, జీవితంలో సంతృప్తి స్థాయి తక్కువగా ఉండటమని తేలింది. ఇక మిగతావారిలో ఎక్కువమంది తమ జీవన భాగస్వామితో ఆనందంగా ఉన్నారని, దాంతో వారు ఆరోగ్యంగా, హాయిగా ఉన్నారని పరిశోధకులు నిర్ధారించారు.
భారతీయ జీవన విధానంలోనూ కష్టసుఖాలు కలబోసుకుంటూ గడిపేవారు ఎక్కువకాలం బతుకుతుండటం గమనార్హం. పరస్పరం అనురాగం గలవారి జీవితంలో క్రమశిక్షణ ఉంటుంది. ఒకరి పట్ల మరొకరికి ప్రేమనే కాదు నమ్మకం ప్రబలంగా ఉన్నప్పుడు లక్ష్యసాధన దిశగా పురోగమిస్తారు. అనేకానేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడే సమాజంలో 'నీకు నేనున్నాను' అనే భరోసా జీవన భాగస్వామి కల్పిస్తే కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఏ సమస్యలు లేకుండా అంతా బాగానే ఉన్నప్పుడు ప్రేమగానే ఉంటారు. కానీ పరిస్థితులు తలకిందులయినపుడే జీవన భాగస్వామికి సిసలైన పరీక్ష. సంక్లిష్ట పరిస్థితులతో సతమతమయ్యే భర్తతో 'ఎందుకంత దిగులు, నేనున్నా కదా, ఏమీ కాదు... అంతా సర్దుకుంటుంది' అని ధైర్యం చెప్పగలిగే భార్య ఉండటం ఒక వరం.
సుదీర్ఘకాలం పాటు కలిసి కాపురం చేసేవారి మధ్యన ప్రేమనే కాదు సఖ్యత కూడా ఉండాలి. ఈ సఖ్యత హేతువుతో కూడి ఉండటం మరీ ముఖ్యం. ఇద్దరు అసమానుల మధ్య సమానత్వం సిద్ధించదు. సమానుల మధ్యనే సమానత్వం సాధ్యమవుతుందని రంగనాయమకమ్మ 'అసమానత్వం నుంచి అసమానత్వంలోకి' పుస్తకంలో చెబుతారు. పదిమంది నెత్తిగొట్టి పైకెగబాకాలనే ఆలోచనలు ఇద్దరికీ ఉంటే వారి నడుమ ఐక్యత ఉంటుందా? ఇది సాధ్యంకానే కాదు. ఎందుకంటే ఆస్తుల కోసం వెంపర్లాడేవారి నడుమ ఏదో ఒక సందర్భంలో చిచ్చు రేగుతుంది. డబ్బుకోసం కన్నపిల్లలనో, కన్నతల్లిదండ్రులనో శత్రువులుగా చేసుకునేవారిని చూస్తున్నాం. అందుకని ఆస్తిసంబంధాలు కాదు, ఆత్మీయ సంబంధాలు మాత్రమే కాపురానికి కీలకం. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అనే వాటిపై అవగాహన ఉంటే తాము హాయిగా ఉండడానికి తోడ్పడే అంశాలు ఏమిటో తెలుస్తాయి. వ్యక్తిగత, వృత్తిగత, సామాజిక జీవితానికి మధ్యన సమన్వయం సాధ్యమవుతుంది. తమని తాము ప్రేమించుకోడమే కాదు, సాటి మనుషుల పట్ల కరుణతో, ప్రేమతో వ్యవహరించాలనే భావన ఉండాలి.
మనకోసం మనం బతకడమే కాదు, పరుల కోసం ఆలోచించాలనే దృష్టికోణం భార్యాభర్తలు ఇద్దరికీ ఉంటే వారి జీవితం సవ్యంగా ఉంటుంది. తమ జీవితానికి సంబంధించిన సకల అంశాల్లో నిజాయితీతో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎదుటివారి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కోరుకునే లక్షణం భార్యాభర్తల్లో ఉంటే దురలవాట్లకు దూరంగా ఉంటారు. ఏం తినాలో, ఏం చూడాలో, ఏం చదవాలో సరిగ్గా నిర్ణయించుకుంటారు. పిల్లల్ని కూడా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతారు. ఇంట్లో ఇమడలేని పరిస్థితులున్నవారు, భాగస్వామితో సఖ్యంగా లేనివారు బజార్లో పనికిరాని చెత్తను భుజిస్తారు. మద్యానికి బానిసలవుతారు. ఇంట్లో ఉండే భార్యలు టీవీలతో, మొబైల్స్‌తో కాలక్షేపం చేస్తారు. ఇది అంతిమంగా వారి ఆరోగ్యాన్ని హరిస్తుంది. అనురాగం లోపించిన మనుషులు తమకు తెలిసీ తెలియకనే మరణానికి చేరువ అవుతుంటారు.
పేదరికమే కాదు ప్రేమరాహిత్యమూ మనుషుల్ని చంపేస్తుంది. ప్రేమ రాహిత్యానికి మూలాలు అసమ ఆర్థికవ్యవస్థల్లో ఉంటాయన్నది నిజమే. అందుకని వ్యవస్థ మారే వరకు మనకుండా ఉండలేం. కనుక సంక్లిష్టమైన సమాజంలో ఎవరితో జత కట్టాలనుకుంటున్నామో జాగ్రత్తగా నిర్ణయించు కోవాలి. జీవన భాగస్వామి ఎంపిక అతి కీలకం. కనుకనే మీ ఎంపిక వ్యక్తుల కోణంలోంచే కాదు కుటుంబాల కోణంలోంచి ఉండాలని నెదర్లాండ్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యకర మైన, ఆనందకరమైన జీవనశైలి గల కుటుంబాలకు చెందిన వారిని వివాహమాడటం శ్రేయస్కరమన్నది వారి సూచన.
మనిషి జీవించేది ఒకే ఒక్కసారి. మరల రమ్మన్నా రాదు జీవితం. అందుకని జీవితాన్ని సానుకూలదృష్టితో చూడటం అలవరుచుకోవాలి. హేతువు భూమికగా జీవనపథాన్ని నిర్ణయించుకోవాలి. తిమ్మినిబమ్మి చేసి ఎలాగో బతికేద్దామని కాకుండా నీతిగా, నిజాయితీగా జీవించాలనే లక్ష్యం ఉండాలి. మీ లక్ష్యాన్ని సమ్మతించే ప్రేమాస్పద మనిషి కోసం ఎదురుచూడాలి. 'ప్రేమ లేని ముద్దు కన్నా మరణం మేలు' అంటుంది సోవియట్ వీరవనిత జోయా. మరి ప్రేమ లేని కాపురం ఎలా? అందుకే మనసా, వాచా, కర్మేణా తనని ఆమోదించే వ్యక్తితో కలిసి ఉన్నప్పుడే ఆనందం రెట్టింపవుతుంది. బతుకు మీది తీపి పెరుగుతుంది. ఆనందకరమైన, సానుకూలమైన జీవన విధా నంతో నిరతమూ, నిత్యమూ ప్రేమలో ఉండటం ద్వారానే ఇది సాధ్యం.