Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిగులు, నిరాశ, ఆందోళన, విపరీత ఆలోచనల పరంపర నుంచే ఒత్తిడి ఆవహిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఏ పని చేయాలన్నా భయం కలుగుతుంది. చిన్న సమస్య వచ్చినా తెగ హైరానా పడిపోవాల్సి వస్తుంది. సమాజంలోగానీ, ఉద్యోగంలోగానీ పోటీతత్వం, డెడ్లైన్ వంటి లక్ష్యాల విషయాల్లో ఆందోళన కొనసాగితే చల్లగా చెమటలు పట్టేస్తాయి. నిజానికి చేసే పనివల్ల ఆనందం కలిగితే ఎప్పుడూ ఒత్తిడి ఉండదు. ఆ ఆనందం ఉన్నత లక్ష్యాల కోసం, ఉన్నత విలువల కోసం చేసే పనుల్లో మాత్రమే కలుగుతుంది. అపరిమిత కోరికలు, వ్యాపకాలు పెంచుకుంటూ పోతే అది మనసునిండా ఒత్తిడినే నింపుతుంది. శరీరాన్నీ, మనస్సునూ కుదురుగా ఉండనివ్వదు. సమయాన్నీ, శక్తినీ వృథా చేయడమేగాక మానసికంగా బలహీనులను చేస్తుంది. అందుకని ఎంచుకున్న పనిలో ప్రణాళికా ఆచరణా సూటిగా ఉంటే ఏ ఒత్తిడీ దరిచేరదు.
ఎవ్వరం ఒత్తిడి నుంచి తప్పించుకోలేం. పారిపోలేము. కానీ ప్రయత్నిస్తే ఎదుర్కోగలం. ఒక వస్తువును ఇరువైపుల నుంచీ నొక్కినప్పుడు అది ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంది. రెండువైపుల నుంచి బలాన్ని తగ్గించినప్పుడు తిరిగి యథాస్థితికి చేరుకుంటుంది. ఇదే సూత్రం సమాజానికీ వర్తిస్తుంది. రకరకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మనుషులను ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. దీంతో మరింత అలసట ఆవహిస్తుంది. అయితే కుటుంబ నేపథ్యమే ఒత్తిడికి కారణమని పలు పరిశోధనల్లో తేలింది. ఒక ఇంటిపెద్ద ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా మసలుకుంటే కుటుంబ సభ్యులు దానినే అనుసరిస్తారు. అలాకాకుండా కుటుంబ పెద్దలే ప్రతి చిన్న సమస్యకూ ఆందోళన పడితే ఇంట్లోవాళ్లకూ అవే లక్షణాలు అలవడతాయి. నిజానికి ఒతిళ్లతో ప్రవర్తించే తీరు మానవ సంబంధాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆ సమయాల్లో వ్యక్తమయ్యే ప్రతిస్పందన, అసహనం ఇతరులతో ఘర్షణకు కూడా పురిగొల్పవచ్చు. అందుకే కుటుంబం నుంచే ఒత్తిళ్లను నియంత్రించుకునేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలి.
ఒత్తిళ్లు లేనిదెవరికి? అయితే అత్యంత ప్రమాదమైనదేమీ కాదు. శృతిమించితేనే నష్టం. ఎంతో కొంత ఒత్తిడి అందరిలోనూ ఉంటుంది. నిజానికి అది అవసరం కూడా! ఒత్తిడి ఒక ఇంధనం లాంటిది. అసలు ఏ ఒత్తిడీ లేకపోతే జీవితంలో ఏ ప్రగతీ ఉండదు. ఇంధనం లేని వాహనంలా మనుషుల గమనమే స్తంభించిపోతుంది. పరిమితి ఉన్నంతరవకూ సరే.. కానీ ఆ పరిధి దాటిపోతేనే ప్రణాళికలోనో, ఎంచుకున్న మార్గంలోనో ఏదో లోపం ఉన్నట్టు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని చాలామంది గుర్తించలేక నిరాశానిస్పృహల్లో ఉండిపోతారు. ఎవరైనా గుర్తించినా అప్పటికే ఆలస్యమైపోయి అనర్థాలకు దారితీస్తుంది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న క్రమంలో నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ వారిలో ఒత్తిడి తీవ్రత పెరిగిపోతుంది. పరీక్ష బాగా రాస్తే సరి. పొరపాటున అనుకున్నది రాయలేకపోయినా, ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా ఒత్తిడిలో చిత్తయిపోతున్నారు. నూరేండ్ల భవిష్యత్తును కోల్పోతున్నారు. బంగారు జీవితాన్ని బాల్యంలోనే చిదిమేసుకుంటున్నారు.
ఎక్కువగా పోటీతత్వం నుంచే ఒత్తిడి ఎదురవుతుంది. అది ఆరోగ్యకరంగా ఉంటే నష్టమేమీ లేదు. కానీ చాలాసార్లు అది అసూయ, ద్వేషాల మధ్య కాలిపోతుంది. వాస్తవానికి పనిని ఆస్వాదించలేనివారు, ఆనందించలేనివారే ఒత్తిడికి గురవుతున్నారని ఎన్నో సర్వేల్లో శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఎంతటి పనినైనా చేసేయగలనన్న ఆత్మవిశ్వాసంతోనే అనుకున్నది సాధించవచ్చని పలు ఉదంతాలూ గుర్తుచేస్తున్నాయి. ఒత్తిడిని సవాలుగా తీసుకున్నప్పుడే గమ్యాన్ని చేరుకుంటామని చెప్పడంలో సందేహం లేదు. ఉదాహరణకు గాలి ఒత్తిడి సరైన మోతాదులో ఉన్నప్పుడే బెలూన్ నిండుగా కనిపిస్తుంది. అప్పుడది గాలిలో తేలికగా తేలియాడుతుంది. అవసరానికి మించిన గాలిని నింపితే ఠాప్మని పేలిపోతుంది. తగినంత గాలి లేకపోతే తుస్సుమని నేల వాలుతుంది. జీవితం కూడా అంతే. జీవితంలో మార్పయినా, అభివృద్ధి అయినా ఒత్తిడి జయిస్తేనే లభిస్తుంది.
కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలకే అతిగా ఆలోచించి ఆందోళన పడిపోతుంటారు. ప్రయత్నం పూర్తిగాక ముందే ఫలితం, లక్ష్యం మీద కేంద్రీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో లక్ష్యం నెరవేర్చుకోవడంలో జాప్యం జరిగితే నిరాశానిస్పృహలకు లోనై ఒత్తిడిలో కొట్టుమిట్టాడిపోతుంటారు. తట్టుకోలేక చెడు వ్యసనాలకు బానిసలవుతున్నవారి సంఖ్యా రోజురోజుకీ గణనీయంగా పెరిగిపోతున్నది. ఇంకొందరైతే ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నష్టం జరిగిపోయిన తర్వాత అంత చిన్న విషయానికి అనవసరంగా దిగులుపడ్డానే అని పశ్చాత్తాప పడినా ప్రయోజనం ఉండదు. అందుకే ఒత్తిడి లేనిదే శక్తి ఎక్కడి నుంచీ రాదు. ఒత్తిడికి గురైన ప్రతిసారీ జీవితంలో పట్టుకోల్పోతున్నామనే భావన సరైంది కాదు. చాలా సందర్భాల్లో ఒత్తిడి విజయసాధనకు దోహద పడుతుందని తెలుసుకోవాలి. విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలన్న ఒక చిన్న ఒత్తిడే అతడిని సన్నద్ధం చేస్తుంది. ఆందోళనకు గురైతే ఆ ఒత్తిడే ప్రమాదంగా మారుతుంది. అందుకే ఒతిళ్ల నుంచి బయటపడగలిగే మార్గాలను అన్వేషించి, ఆచరించగలిగిన వారే జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు.