Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరాన్‌తో అమెరికా యుద్ధానికి సిద్ధమౌతోంది. 1962వ సంవత్సరంలో సంభవించిన క్యూబా మిసైల్ సంక్షోభం తరువాత ప్రపంచాన్ని వినాశకర యుద్ధం అంచుకు ఇంతగా నెట్టిన సందర్భం మరొకటి లేదు. ఇరాన్లోవున్న ఒక అణు కేంద్రంపై పెద్ద ఎత్తున మెరుపు దాడి చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాల యంలో పనిచేస్తున్న ఇజ్రాయిలీ దౌ త్యవర్గాలను ఉటంకిస్తూ జరుసాలెం పోస్టు ఒక వార్తను ప్రచురించింది. ఈ ప్రమాదకరమైన వార్తను అమె రికా మీడియా కావాలనే ప్రచురి ంచలేదనే విషయాన్ని గమనించాలి. లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితంచేయగల వార్తను అమెరి కా ప్రజలకు అందించవలసిన అవసరం ఉందని అమెరికా మీడియా భావించలేదు. అమెరికా దుందుడుకు చర్యలవల్ల యుద్ధ ప్రమాదం పొంచివుందని చైనా, రష్యాలు ప్రకటించాయి. అమెరికా అవలంభిస్తున్న తీవ్రమైన చర్యలు మధ్య ప్రాచ్ఛం అనే కందిరీగల తుట్టెను కదిలించటంగా ఉంటుందని చైనా హెచ్చరించింది. అమెరికా ఇరాన్‌పై నిరంతరం చేసే రాజకీయ, ఆర్థిక, మానసిక వత్తిడుల లక్ష్యం ఆ దేశంతో యుద్ధం చేయటమేనని జర్నలిస్టులతో మాట్లాడుతూ రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ అన్నాడు. ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించి అమెరికా సర్వసన్నద్దంగా ఉందని మంగళవారంనాడు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్‌తో అమెరికా వైరం తీవ్రతరం అవుతున్నకొద్దీ ప్రత్యక్ష సైనిక దాడికి అమెరికా చేరువౌతోంది. చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతోపాటు అమెరికా భాగస్వామ్యంతో 2015వ సంవత్సరంలో చేసుకున్న ఇరాన్ అణు ఒప్పందాన్ని చట్టవిరుద్దంగాను, ఏకపక్షంగాను రద్దుచేసి ఎనిమిన్నర కోట్ల జనాభాగల ఇరాన్‌పై తీవ్రస్థాయిలో అమెరికా ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలతోపాటు ఇరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద మితవ్యయ, ప్రయివేటీకరణ విధానాలవల్ల ఇరాన్ కార్మికుల నిజ వేతనాలు పడిపోవటం, ద్రవ్యోల్బణం వార్షికంగా 50శాతం పెరగటం జరుగుతోంది. అలానే నిరుద్యో గం పెరిగింది. మందుల కొరత కూడా ఏర్పడటంతో ప్రజలు నానా యాతనలు పడుతున్నారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రభుత్వం కూలిపోయేలా చేయటమే లక్ష్యంగా ఈ ఆర్థిక దిగ్బంధం కొనసాగుతోంది. అంతేకాకుండా ఇరాన్లో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని కూడా అమెరికా భావిస్తోంది. అమెరికా అనుసరిస్తున్న 'గరిష్ట వత్తిడి' విధానం యుద్ధ ప్రకటనతో సమానమైంది. ఈ విధానంవల్ల ఇప్పటికే తీవ్రమైన ఘర్షణ వాతా వరణం నెలకొంది. ఈ పరిస్థి తులలో ట్రంప్ పాలన ఇరాన్‌కు వ్యతిరేకంగా సైనిక బలగాలను దించుతోంది. ఒక విమానవాహక నౌక నాయకత్వంలో ఒక నౌకల సమూహాన్ని, అణ్వస్త్రాలను ఉపయోగించగల సామర్థ్యంవున్న బి-52 యుద్ధ విమానాలను కూడా ఇరాన్‌కు సమీపంలో అమెరికా మోహరించింది. అంతేకాకుండా అమెరికా సైనికులను వేలాదిగా ఆ ప్రాంతానికి తరలించింది. 'అమెరికా ప్రయోజనా లు' ఇరాన్ సైనిక దాడి ప్రమాదాన్ని ఎదుర్కొంటు న్నాయనే సాకుతో అమెరికా ఇదంతా చేస్తోంది. ఇదంతా ఒక బూటకం. ప్రజలను ఆకలితో అలమటిం పజేసి తన చెప్పుచేతల్లో ఉండేలా చేయటం కోసం అమెరికా సామ్రాజ్యవాదం ఇరాన్‌ను చక్రబంధంలో ఉంచింది. 2001వ సంవత్సరం నుంచి ఇరాన్ ఈశాన్య సరిహద్దులోగల అప్గానిస్తాన్పైన, పశ్చిమ సరిహద్దులోగల ఇరాక్‌పైన అమెరికా దండెత్తింది. ఇరాన్ సముద్ర తీరంలోగల పర్షియన్ సింధుశాఖ ప్రాంతంలో వైమానిక, నౌకా స్థావరాలను గొలుసు కట్టుగా అమెరికా నిర్మించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోగల గ్రీన్ జోన్లో వున్న అమెరికా రాయబార కార్యాలయానికి ఒక మైలు దూరంలో గురితప్పి నేలపై పడిన క్షిపణిని, సిరియాలో ఇరాన్ మద్దతుగల మిలీషియాల నుంచి ఏర్పడే ప్రమాదాన్ని, ఒమాన్ సింధుశాఖలో చమురు టాంకర్లపై జరుగుతున్న దాడులను అమెరికా ఇరాన్‌కు ఆపాదిస్తోంది. ఇది అమెరికా ఆడుతున్న నాటకం, ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించటానికి సాకుగా వాడటానికేనని యావత్ ప్రపంచానికి తెలుసు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పాతుకుపోయిన సంక్షోభమే అమెరికా ఇరాన్‌పై యుద్ధానికి సిద్దపడేలా చేస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సోవియట్ పతనం తరువాత అమెరికా పెట్టుబడిదారీ పాలక వర్గం తనకు ప్రాతినిధ్యవహించే రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల ద్వారా సైనిక శక్తిని ఉపయోగించి ప్రపంచ మార్కెట్లపైన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మధ్య ప్రాచ్చ్యంలో తన ఆధిపత్యానికి సవాలుగా మారిన ఇరాన్‌ను అడ్డుతొలగించటానికి అమెరికా యుద్ధానికి సన్నద్దమౌతోంది. ఈ యుద్ధం యావత్ ప్రపంచానికి విపత్తుగామారే అవకాశం ఉంది. అమెరికా ప్రజలకు ఇరాన్‌పై యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలపటానికి ప్రయత్నం చేయకుండానే ఇరాక్ కంటే జనాభాలో మూడు రెట్లు, భూభాగంలో నాలుగు రెట్లు పెద్దదైన ఇరాన్‌పై యుద్ధం చేయటానికి అమెరికా సిద్దపడుతోంది. ఇరాన్‌కున్న వ్యూహాత్మక స్థితి దృష్ట్యా ఆ దేశంతో యుద్ధమనేదే జరిగితే యావత్ మధ్య ప్రాచ్చ్య దేశాలేకాకుండా అణ్వస్త్ర దేశాలయిన చైనా, రష్యాలతో కూడా సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ యుద్ధోన్మాదం మానవాళి భవితను కబలించకముందే ప్రపంచ ప్రజలందరూ శాంతి కోసం ఉద్యమించాలి. ఈ ఉద్యమం అమెరికా సామ్రాజ్యవాదం దాడి నుంచి ఇరాన్‌ను కాపాడటమే కాకుండా మానవాళి అస్థిత్వానికి అండగా నిలువగలదు.