Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కడి ట్రంప్ అయినా, ఇక్కడి మోడీ అయినా ఒకే తాను ముక్కలన్నది తిరుగులేని సత్యం. ఇరువురిదీ విద్వేష రాజకీయ వారసత్వం. పీడిత జన వ్యతిరేక ఆచరణ. ఈ సత్యాన్ని కరోనా రోజులలోని వారి ఆచరణ మరింతగా మన కండ్లకు కడుతోంది. ఈ స్థితిలో అమెరికా నల్ల జాతీయుల ఉద్యమానికి మన సంఘీభావం మరింత క్రియాశీలం కావాల్సిన అవసరముంది.
అమెరికాలో జాత్యాహంకారులు మరింతగా రెచ్చిపోతూనే ఉన్నారు. నల్లజాతీయుడు జార్జ్ హత్యకు నిరసనగా ఒక వైపు అమెరికా అంతా అట్టుడికి పోతూ ఉంటే, మరో వైపు తెల్లజాతి పోలీసులు శుక్రవారం రాత్రి అట్లాంటా రాష్ట్రంలో మరో నల్లజాతి యువకుడు రేషార్డ్ బ్రూక్‌ను అత్యంత దారుణంగా బలితీసు కున్నారు. అంతటి 'నాగరిక' దేశంలో ఇంతటి అనాగరిక హత్యలేమిటని అఖిల ప్రపంచం విస్తుపోతుంది. ప్రజా ప్రతిఘటనలు హౌరెత్తుతున్నా పాలకులు ఎందుకు ఈ వ్యవస్థీకృత నేరాలను ఆపలేక పోతున్నారో అర్థంకాక సామాన్య జనం భయకంపిత మవుతున్నది. నిజంగా పాలకులు ప్రయత్నిస్తే తమ ఆధీనంలో ఉన్న పోలీసులు చేస్తున్న ఈ జాత్యాహంకార హత్యలను ఆపలేరా? అంతటి శక్తి ఆ రాజ్య పాలకులకు లేదా? ప్రజలు ఇలా రోజుల తరబడి రోడ్లెక్కుతుంటే, ఏకంగా దేశంలో కీలక నగరమైన సియాటెల్‌లో ఒక ప్రాంతాన్ని ఆందోళన కారులు ఆక్రమించుకుని క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ (చాజ్) అని నామకరణం చేసి స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకున్నా అత్యంత బలసంపన్నుడనని విర్రవీగే ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు ముడుచుకు కూర్చుని ఉన్నాడు? మరోవైపు, ఉన్మాదిలా మాట్లాడుతూ ఆందోళనకారుల ఆగ్రహావేశాలని అనుక్షణం ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అమెరికాలోని జాతి వివక్షకు వ్యతిరేకంగా పదుల కొలది ప్రపంచ దేశాలలో లక్షల కొలది ప్రజలు ప్రత్యక్ష ఆందోళనలలో పాల్గొంటూ, తమ దేశ పరువు నడిబజారులో తీస్తున్నా దేశాధ్యక్షుడు ఎందుకు తగువిధంగా స్పందించకున్నారు? ఇందులో ఏమైనా మతలబు ఉందా? రాజకీయ కుట్రేమైనా ఈ జాత్యాహంకార హత్యల వెనుగ దాగి ఉందా? లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఆ ట్రంపు వీరవిధేయులు, అనుంగు సహచరులే మన దేశాన్ని ఏలుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా పరిణామాలను సరిగ్గా అంచనా వేయడం అవసరం.
నాయకులు జాతి విద్వేషాలను ఒక రాజకీయ సాధనంగా, తమ అధికారానికి సోపానంగా వాడుకోవడం కొత్తేమీ కదు. అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం కాస్తా శృతి మించింది. మరో మాటలో చెప్పాలంటే, జాతి పేరుతో మతం పేరుతో ప్రజలను రెండు శత్రు శిబిరాలుగా చీల్చి, మైనారిటీ శిబిరం నుంచి మెజారిటీ శిబిరానికి ముప్పువాటిల్లబోతున్నదన్న భయాన్ని కల్పించి, తాము మెజారిటీ శిబిర రక్షకులుగా ప్రచారం పొంది ఎన్నికల విజయాన్ని సొంతం చేసుకోవడాన్ని ఒక తిరుగులేని ఎత్తుగడగా ప్రయోగిస్తున్నారు నాయకులు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మన దేశ ప్రధాని మోడీ ఇద్దరూ ఇద్దరే. అక్కడి జాత్యాహంకార హత్యలైనా, ఇక్కడి మైనారిటీ మతస్తులు, దళితులపై దాడులైనా ఎన్నికల గెలుపు కోసం వీరు సాగిస్తున్న క్షుద్ర రాజకీయాలే అన్నది ఒక నిగూఢ సత్యం.
అమెరికాలో నల్ల జాతీయులు (ఆఫ్రో- అమెరికన్స్) 14శాతానికి మించరు. నాలుగు వందల ఏండ్ల క్రితం బానిసలుగా ఆ గడ్డపై కాలుపెట్టి ఆ దేశం సంపన్న దేశంగా అవతరించేందుకు తమ చీమూ నెత్తురులు ధారబోసిన జాతి అది. ప్రతిఫలం మాత్రం అవమానం, అణచివేత, అభద్రత, వెనుకబాటు తనం. మరో వైపు తెల్లజాతి. తెల్లజాతి దురహంకారులలో, అన్ని వనరులూ అమరిన తరువాత, ఆ వనరులు సమకూర్చిన వారిపై ఉండే యాజమాన్యపు చిన్నచూపు. తమ యాజమాన్యాన్ని, ఆధిపత్యాన్నీ మరింతగా ప్రదర్శించి ఇంకింతగా పీల్చి పిప్పి చేసి, పైశాచిక ఆనందం పొందాలనే దురాశ. ఈ తెల్లజాతి దురహంకారుల దురాశే వారిచేత నల్లవారిపై దాడులు చేయిస్తోంది. దురహంకార మనస్థితిని మరింతగా ఎగదోసి తన ఎన్నికల విజయానికి వాడుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. అందుకే ఇప్పుడు అమెరికా ఆరని అగ్నిగుండంలా తయారయ్యింది. అయినా, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం అమెరికాలోని తెల్లజాతీయుల నుండే కాకుండా, యూరప్ దేశాలనుండి కూడా గణనీయ మద్దతునే పొందగలుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు, ఎన్నికల విజయానికి కావాల్సినన్ని ఓట్లు రాల్చగల జనాలను ప్రసన్నం చేసుకుని, తన వైపు నిలుపుకుంటే చాలు- ఇక మిగిలిన ప్రజలు ఏమై పోయినా చింతలేదన్న దృఢ చిత్తాన్ని ప్రదర్శిస్తున్నాడు. నల్లవారి ఆందోళనలు మరింతగా ఎగసి పడితే, హింసాత్మక రూపం తీసుకుంటే, మెజారిటీలైన తెల్లవారిలో తీవ్ర ద్వేషం రగుల్కుంటుందనీ, ఆ ద్వేషం అంతిమంగా తమ ప్రయోజనాలకోసం దృఢంగా నిలిచే తనపై అభిమానంగా మలుపు తిరిగి తెల్లజాతీయుల ఓట్ల వర్షం కురిపిస్తుందనీ ట్రంప్ కలలు కంటున్నాడు. అమెరికాలో జాతి విద్వేషాన్ని ద్వేషించే తెల్లజాతి, లాటిన్ అమెరికన్, ఇండియన్ తదితర సమూహాలకు చెందిన మానవీయులు ఉన్నా వారి శాతం తక్కువ కాబట్టి వారు తన విజయానికి అడ్డురాలేరని ట్రంప్ తలపోస్తున్నాడు. కాబట్టే, అధ్యక్షునిగా ఆందోళనలను ఆపేందుకు అన్ని చర్యలూ తీసుకోకపోగా ఆజ్యం పోస్తున్నాడు.
అక్కడి ట్రంప్ అయినా, ఇక్కడి మోడీ అయినా ఒకే తాను ముక్కలన్నది తిరుగులేని సత్యం. ఇరువురిదీ విద్వేష రాజకీయ వారసత్వం. పీడిత జన వ్యతిరేక ఆచరణ. ఈ సత్యాన్ని కరోనా రోజులలోని వారి ఆచరణ మరింతగా మన కండ్లకు కడుతోంది. ఈ స్థితిలో అమెరికా నల్ల జాతీయుల ఉద్యమానికి మన సంఘీభావం మరింత క్రియాశీలం కావాల్సిన అవసరముంది.