ఆంక్షలను ఎత్తివేసే విషయంపై కీలక ప్రకటన చేసిన అరవింద్ కేజ్రీవాల్
Tue 25 Jan 14:51:13.607811 2022
హైదరాబాద్ : ఢిల్లీలో తాజాగా విధించిన కరోనా ఆంక్షలను ఎత్తివేసే విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. త్వరలోనే ఆంక్షలను ఎత్తేస్తామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు విధించిన రాత్రి కర్ఫ్యూ, సరి-బేసి విధానంలో దుకాణాలను తెరవడం వంటి ఆంక్షలను తొలగించాల్సిందిగా గత వారం తనను పలువురు వ్యాపారులు కోరారని గుర్తు చేశారు. ఇవాళ ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం ఉందని, జనవరి 15న అది 30 శాతమని ఆయన వివరించారు. కరోనా కేసులు పెరిగినప్పుడు ఆంక్షలు పెట్టక తప్పలేదని, దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. అవసరం కాబట్టే ఆంక్షలను పెట్టాల్సి వస్తోందన్నారు. ఆంక్షలు ఎత్తేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ కు తాను ప్రతిపాదనలు పంపినా ఆయన అంగీకరించలేదన్నారు. త్వరలోనే ఆంక్షలు ఎత్తేసేలా ఎల్జీని ఒప్పిస్తామన్నారు. ఢిల్లీలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిందని, 82 శాతం మంది రెండు డోసుల టీకాను తీసుకున్నారని కేజ్రీవాల్ చెప్పారు. వాస్తవానికి ఆంక్షలను ఎత్తేయాలని శుక్రవారమే ఎల్జీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఇప్పుడే వద్దని ఆయన సూచిస్తూ, ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. కేసులు తగ్గాక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.