Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 భాషల్లో ఉచిత కోర్సులు అందిస్తున్న వర్సిటీ
- 45 రోజుల వ్యవధిలో కోర్సు పూర్తి
- ప్రతిరోజూ ఆన్లైన్లో పాఠాలు
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ప్రపంచంలో మనిషి ఎక్కడి కెళ్లినా ఆ దేశంలోని వ్యక్తులతో తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఆంగ్ల భాష దోహదపడుతోంది. అయితే దీని వల్ల కొన్ని దేశాల్లో ఆయా ప్రాంతీయ భాషపై అవగాహన లేకపోవడంతో అక్కడికి వెళ్లిన వారికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఒక దేశానికి చెందిన వ్యక్తులు మరో దేశానికి వెళ్లినప్పుడు ఆ దేశ భాషలోనే సంభాషించే అవకాశం ఉంటుంది. అందుకు ''ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్'' (ఇప్లూ) యూనివర్సిటీ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. అదేమంటే ఇంగ్లీష్‌తోపాటు మరో 11 భాషల్లో ఇఫ్లూ షార్ట్‌టర్మ్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. మరో నెల రోజుల్లో ఈ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చనుంది.
ఉచిత షార్ట్‌టర్మ్ కోర్సులు...
ఇంగ్లీష్‌తోపాటు స్పానిష్, జపనీస్, జర్మనీ, ఫ్రెంచ్ తదితర 11 భాషల్లో బోధించే ఈ కోర్సులకు ఉచితంగానే అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ కోర్సులకు ఉచితంగానే అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ కోర్సుల కాలపరిమితి 45 రోజులుగా నిర్ణయించారు. ప్రపంచంలో ఎవరైనా ఈ కోర్సులను నేర్చుకునే ఆసక్తి ఉంటే ఇఫ్లూ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఉచిత కోర్సులను పూర్తి చేయవచ్చు.
అడ్మిషన్ల పొందడమేలా...
ఇఫ్లూ ఉచితంగా అందించనున్న 12 భాషల కోర్సులకు అడ్మిషన్లు పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతాయి. ఆసక్తి గల వారు ఇఫ్లూ వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీంతో పూర్తి స్థాయి దరఖాస్తు అందుబాటులోకి వస్తుంది. దీంతో ఆయా విద్యార్థులు తమకు ఆసక్తి ఉండి, నేర్చుకునే భాషలు ఎంపిక చేసుకుని దానిపై క్లిక్ చేయాలి. పూర్తి వివరాలను దరఖాస్తులో పొందుపర్చిన తర్వాత సబ్మిట్ నొక్కాలి. దీంతో అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో విద్యార్థికి సంబంధించిన ఒక ఐడీ వస్తుంది. ఈ ఐడీ ఆధారంగా ప్రతిరోజూ ఆన్లైన్లోనే భాష నేర్చుకోవచ్చు.
ప్రతిరోజు ఒక పాఠం...
అడ్మిషన్ పొందిన విద్యార్థి ప్రతిరోజూ ఒక పాఠం నేర్చుకునేందుకు వీలు ఉంటుంది. సదరు విద్యార్థి తమ ఐడీతో లాగిన్ కాగానే ఆన్లైన్లో ఆ రోజుకు కావాల్సిన మెటీరియల్ కంప్యూటర్‌పై డిస్ప్లే అవుతుంది. ఈ సిలబస్‌లోని అంశాలను తమ మాతృభాషతో క్రోడీకరించుకుని చదువుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత భాషల్లో ఆయా భాషా నిపుణులు ఆన్లైన్లో నివృత్తి చేస్తారు. ఇలా 45 రోజుల పాటు ఆన్లైన్లో బోధన జరిగిన తర్వాత కోర్సు పూర్తవుతుంది. అయితే వర్సిటీ నుంచి ఎలాంటి డిప్లొమా సర్టిఫికెట్లు జారీ చేయబడవు. కేవలం ఆయా భాషలను ఉచితంగా నేర్చుకునేందుకే తమ వెబ్సైట్ ద్వారా ఈ అవకాశం కల్పించారు.
తొలిసారిగా ఆన్లైన్లో ఉచిత కోర్సులు
ప్రపంచ భాషలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో తొలిసారిగా ఆన్లైన్లో ఉచితంగా 12 భాషల్లో కోర్సులు అందిస్తున్నాం. విదేశీ భాషలను నేర్చుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నా అవి అందుబాటులో లేవు. ఇతర భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా విద్యార్థులు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడుతాయి. వర్సిటీ సేవలను ప్రపంచ వ్యాప్తంగా తెలిజేయాలనే సంకల్పంతోనే ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం.