Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల అధికారి దాన కిషోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రానున్న ఎన్నికలకు జిల్లా, నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో బుధవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ స్థాయి పూర్తి సమాచారం, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు, పోలీసు బందోబస్తు, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అవసరాలు, పోలింగ్ సిబ్బంది, స్వీప్ కార్యక్రమ వివరాలు, సమాచార వ్యవస్థ, పోలింగ్ సిబ్బంది, సంక్షేమం తదితర అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని రూపొందించాలని ఆదేశించారు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రముఖ అధికారులు, వారి ఫోన్ నెంబర్లు, భౌగోళిక వ్యవస్థ, శాంతిభద్రతల పరిస్థితుల వివరాలు, జిల్లా, నియోజకవర్గ స్థాయి చిత్రాలు, ఓటర్ల వివరాలు, మహిళ, పురుష ఓటర్ల వివరాలు, ఓటరు గుర్తింపు కార్డుల కవరేజీ వివరాలు తదితర సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన పోలింగ్ సిబ్బంది, పోలింగ్ పార్టీల రవాణా ఏర్పాట్లు, పోలింగ్ బృందాలు ప్రయాణించే మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలను ఈ ప్రణాళికలో పొందు పర్చాలన్నారు.