Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె వెన్నుముకని బలోపేతం చెయ్యండి,
భుజాలకు బరువులు అలవాటు చెయ్యండి
ఇది సహజం సహజం అని పదే పదే ఆమె చెవిలో చెప్పండి. మంచి పేరు వస్తుందని ఆశ పెట్టండి,
చెడ్డ పేరు వస్తుందని భయపెట్టండి
ఆమెని మాత్రం మరింతగా తీర్చిదిద్దండి.
త్రాసులో నువ్వు తేలడం అంటూ ఉండదని తేల్చి చెప్పేయండి
బరువు వైపు, బాధ్యత వైపు,
నిందల వైపు,
నిష్టూరాల వైపు తీసుకెళ్ళి
ఎదురీతలు నేర్పండి
మెదడు, మాట, చూపు, నవ్వు
ఎప్పుడు ఎక్కడ వాడాలో
అడుగడుగుకీ అడిగి తెలుసుకోమని చెప్పండి
జన్మంతా ఎవరి వెనకనో ముని వేళ్ళని నోటికడ్డు పెట్టుకొని
వంగి వంగి నడవాలని నిక్కచ్చిగా చెప్పేయండి
చిన్న నవ్వునీ, సొంత స్థానాన్ని
పిసరంత అభినందననీ
ఆశించిన కొద్దీ ఆశాభంగమని చెప్పండి
గీసిన గీతల మధ్యనే గరగరా తిరుగుతూ
గుట్టుగా ఉండాలని
కూర్చున్న చోటు దాటి కలలు కూడా వెళ్లకూడదని
నువ్వు 'అనంతమైన వాటిని
సష్టించే శూన్యానివి' అని
ఆమె మీద ఆమెకొక
ఆశ పుట్టక ముందే
చెప్పేయండ్రా !!
- రేఖాజ్యోతి
rekhapoetry@gmail.com