Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైవింగ్ రాకున్న మ్యానెజ్ చేద్దాం..
- ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి వసూళ్లు
- రవాణా శాఖలో జోరుగా సాగుతోన్న బ్రోకర్ల దందా..
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రైవింగ్ రాకున్న పర్వాలేదు.. లైసెన్స్ ఇప్పిస్తాం.. అడిగినన్ని డబ్బులిస్తే ఓకే.. క్షణాల్లో పనులు పూర్తి చేసిపెడతాం.. అవసరమైతే అధికారులను మ్యానెజ్ చేస్తామంటూ నగర రవాణాశాఖ కార్యాలయాల్లో బ్రోకర్లు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఒక్కో పనికి ఒక రేటు ఫిక్స్ చేసి మరి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లాకు చెందిన రమేశ్ అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కోసమని ఓ బ్రోకర్‌ను ఆశ్రయించగా.. టూ వీలర్ లైసెన్స్ కోసం రూ.4 వేలు ఖర్చువుతుందని చెప్పగా.. అంత మొత్తం చెల్లించాడు. వాస్తవానికి ఈ రెండు సేవలకు కలిపి ప్రభుత్వానికి చెల్లించేది రూ.1500లోపే. అంటే మిగతా రూ.2500 ఎవరి జేబులోకి వెళ్తున్నాయో అందరికీ తెలుసు. ఈ లెక్కన రవాణశాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఓ ఆర్టీఏ ఏజెంట్‌ను అడగ్గా.. ఇదంతా మమూలే అన్నట్టు సమాధా నమిచ్చాడు.. ప్రధానంగా వినియోగదారుల్లో నెలకొన్న అవగాహనా లేమి ఒక కారణం కాగా నేరుగా వెళితే ఆర్టీఏ సేవలు కావని, దళారులు ద్వారా వెళ్తే పనులు చకచకా జరుగతాయని అపోహ కూడా మరో కారణంగా తెలుస్తోంది. దీనిపై రవాణాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
దోపిడీకి అడ్డుకట్ట పడేదెన్నడో..?
రెండేండ్ల క్రితం ప్రభుత్వం ఆర్టీఏ సేవలను ఆన్లైన్ చేసిన విషయం విదితమే. దీంతో సుమారు 59 రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆర్టీఏ ఆఫీసుల్లో ఒక దరఖాస్తు ముందుకెళ్లాలన్నా.. అధికారి సంతకం కావాలన్న.. లైసెన్స్ రావాలన్న.. ఇలా ఏది తీసుకోవాలన్నా.. ప్రతి పనికీ చేతులు తడాపాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ సేవలు పనిచేయవు. కార్యాలయంలో సిబ్బంది, దళారులదే రాజ్యం. తమ చేతికి మట్టి అంటకుండా జేబులోకి కాసులు వచ్చేలా దళారులను ఆ శాఖ సిబ్బంది ప్రోత్సహిస్తున్నారు. ఎల్ఎల్ఆర్ నుంచి శాశ్వత డ్రైవింగ్ లెస్సెన్స్ వరకు, ఫిట్నెస్ నుంచి వాహన రిజిస్ట్రేషన్, పేరు బదాలయింపు ఇలా ప్రతిసేవకూ బ్రోకర్లను సంప్రదిస్తేనే పనులు జరుగుతాయి. అదే దరఖాస్తును నేరుగా పట్టుకువెళ్తే ఇది లేదు.. అది లేదని తిరస్కరిస్తుంటారని తెలిసింది. ఇదంతా అక్కడి సిబ్బంది, దళారులు కుమ్మకై చేస్తుంటారని వినికిడి. చేసేదేమిలేక ఉద్యోగుస్తులు, వ్యాపారస్తులు, ఇతరులు వృత్తిరీత్యా పనులతో బిజిగా గడిపేవారు నేరుగా వెళ్లకుండా ఇలా దళారులను ఆశ్రయించి పెద్దఎత్తున డబ్బులు చెల్లించి పనులు పూర్తి చేయించుకుంటున్నారు. ఫలితంగా ఆర్టీఏలో ఆన్లైన్ సేవలు ఉన్నప్పటికీ ఎందుకు ఉపయోగం లేకుండా పోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.