మనుషులు బతుకుదెరువు కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం ప్రాచీన కాలం నుంచీ జరుగుతూ ఉన్నదే. ఎన్నో తెగలు, జాతులవారు మెరుగైన జీవనం కోసం, భూమిపై ఆపేక్షతో తాము ఎప్పుడూ చూడని ప్రాంతాలకు సైతం పోయి స్థిరపడటం కనిపిస్తుంది. తాము స్థిరపడిన ప్రాంతాలో తమ మూల సంస్కృతిని మరిచిపోకుండా కొన్ని ఆచార సంప్రదాయాలనైనా బతికించుకునే ప్రయత్నం చేస్తారు. గ్రీన్లాండ్ అని ఇప్పుడు పిలుస్తున్న దేశంలో ఒకప్పుడు తొండలు కూడా గుడ్డుపెట్టేవి కావు. అటువంటి భూ భాగంలోకి మనుషులు ఎట్లా ప్రవేశించారు, ఎట్లా బతుకుతున్నారనేదే ఈ వ్యాసం సారాంశం.
ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండే గ్రీన్లాండ్ ద్వీపం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం. గ్రీన్లాండ్ అనగానే పచ్చని చెట్లు పుటల్టతో, గడ్డి గాదంతో కళ కళలాడుతుందను కుంటే పొరపాటే. ఎరిక్ రెడ్ అనేవ్యక్తి ఐస్లాండ్కు చెందిన వ్యక్తి ప్రస్తుతం గ్రీన్లాండ్ అని పిలు స్తున్న భూభాగాన్ని క్రీ.శ. 982లో కనిపెట్టాడు. అతడు అక్కడ మూడేండ్లపాటు ఉండి కొంత భూభాగంలో వ్యవసాయం ప్రారంభించాడు. ఆ తరువాత ఐస్లాండ్ చేరుకొని అక్కడి వారిని తాను కనిపెట్టిన భూభాగంలో ఉండేలా ప్రోత్సహించేందుకు దాన్ని గ్రీన్లాండ్ అని అభివర్ణించి వారిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. నిజానికి అది వ్యవసాయానికి అంతగా పనికిరాని భూస్వరూపాలతో ఉన్న ప్రాంతం. మొత్తం మీద చాలా మంది ఆ ద్వీపానికి వచ్చి కాలనీలు స్థాపించుకుని జీవించసాగారు. క్రీ.శ.1605లో డెన్మార్కు రాజు నాలుగవ క్రిస్టియన్ గ్రీన్లాండ్ భూభాగాన్ని తన రాజ్యంలో భాగంగా ప్రకటించాడు. 1953లో గ్రీన్‌లాండ్‌కి ఒక దేశం హోదా వచ్చేవరకు అది డెన్మార్కు సార్వభౌమాధికారం కింద ఒక కాలనీ మాదిరిగానే ఉంది. ఆ తరువాత గ్రీన్లాండ్ వాసులకు డెన్మార్కు పౌరసత్వం లభించింది. 1979లో ఒక రిఫరెండంలో ప్రజలు డెన్మార్కులో భాగంగా ఉంటూనే స్వయంపాలిత ప్రాంతంగా తమ భూభాగం ఉండాలని చెప్పారు. దీంతో విదేశీవ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు డెన్మార్కు తన ఆధీనంలో ఉంచుకొని మిగతా వ్యవహారాల్లో స్వయం నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను గ్రీన్లాండ్ ప్రజలకిచ్చింది.
గ్రీన్లాండ్ ప్రజల్లో 80 శాతం మంది ఇన్యూయిట్, లేదా డెన్మార్కు-ఇన్యూట్ జాతి వారే అని చెప్పవచ్చు. మిగిలినవారిలో డెన్మార్కు జాతీయులే ఎక్కువ. వీరుకాక యూరప్‌కు చెందిన ఇతరులూ అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు.
భాష, ఆహార విహారాలు
అత్యధికులు మాట్లాడే భాష గ్రీన్లాండిక్. అయితే తూర్పు, పడమర ప్రాంతీయుల మధ్య యాసలో కొన్ని తేడాలున్నాయి. అట్లాగే ప్రతి గ్రీన్లాండ్ పౌరుడు డానిష్ భాష కూడా మాట్లాడగలడు.
ప్రజలు ఎక్కువగా చేపలు, ఆలు, ఇతర కూరగాయలు, కేన్లలో నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. సీల్, ధృవపు ఎలుగుబంటి మాంసాన్ని కూడా తింటారు.
సామూహికంగా భూములపై హక్కును కలిగి ఉంటారు ప్రజలు. ఇన్యూయిట్ కుటుంబాలు తాము వాడుకోగా మిగిలిన వస్తువులను పేదవారికి ఉచితంగా ఇచ్చివేస్తాయి. అయితే రాజధాని నగరం వంటి చోట్ల నివసించే యూరోపియన్ జాతీయుల వంటివారికి ప్రయివేటు ఆస్తిపై హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల పరిరక్షణకు గట్టి చట్టాలు కూడా ఉన్నాయి.
స్త్రీ, పురుషులకు ప్రత్యేకించిన పనులంటూ లేవు. ఎవరు ఏపనైనా చేస్తారు. కాకపోతే చేపలు పట్టడం, వేటాడటం వంటి పనులు ఎక్కువగా పురుషులు చేస్తే.. స్త్రీలు మాంసాన్ని ఆరబెట్టడం, వేటాడిన జంతు చర్మాలను బాగుచేయడం చేస్తారు. అయితే అమ్మాయిలకంటే అబ్బాయిలకు సమాజంలో ఎక్కువ విలువ ఉంటుంది.
వివాహం విషయానికి వస్తే ఎక్కువగా ప్రేమ వివాహాలే ఉంటాయి. ఏవో కొన్ని మాత్రమే పెద్దలు కుదిర్చిన పెండ్లిళ్లు కనిపిస్తాయి. గ్రీన్లాండ్ సమాజంలో ఉమ్మడి కుటుంబాలు చాలా ముఖ్యమైన భూమిక కలిగి ఉన్నాయి. ఒకే రక్త సంబంధం కలిగిన కుటుంబాలు ఎన్నుంటే అన్నీ కలిపి వేటాడిన జంతు మాంసాన్ని సమానంగా పంచుకుంటాయి. అయితే తమ జాతీయులు కానివారితో కూడా వీరు వివాహ సంబంధాలు పెట్టుకుంటారు.
- మౌక్తిక్
Authorization