జానపద వినోదాల్లో కోలాటం ఒకటి. దీన్ని స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం అని రెండు రకాలుగా చెప్పవచ్చు. పురుషులు మూరెడు పొడవుగల కట్టెల్ని చేతపట్టుకొని గుండ్రంగా తిరుగుతూ కోలాటం చేస్తారు. స్త్రీలు నేలపై కూర్చొని చేతులపై కూర్చొని కోలాటం వేస్తారు. అట్లాగే స్త్రీలు చెక్కల్ని చేతబట్టి 'జడకోపు'ను రకరకాల అల్లికలో చూపిస్తారు. ఇప్పుడు స్త్రీపురుషులు ఇరువురూ కలిసి ఆడే కోలాటం, స్త్రీలు కూడా పురుషులు వేసే కోలాటాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. ఈ చిన్న వ్యాసంలో కేవలం కూర్చొని వేసే కోలాటం గురించి తెలుసుకుందాం.
జానపద స్త్రీలు పని పాట ముగించుకొని రాత్రి సమయాల్లో కాని, పండుగ పబ్బాల్లో కాని, ఈ కోలాటమేస్తారు. సరిసంఖ్యలో పాల్గొంటారు. అందరూ చుట్టూ వలయాకారంలో'చక్కమళ్ళు' (పద్మాసనం) వేసుకొని కూర్చుంటారు. ఇద్దరిద్దరు రెండు చేతుల్ని వేళ్లతో ఇరికించుకొని పట్టుకుంటారు. నాలుగు అరచేతులు కలిసేలా కొడతారు. పాటను ఎత్తుకునే ముందు కొట్టడాన్ని 'ఎత్తుగడ' అంటారు. పాటను ఒకరు పాడుతుంటే మిగిలినవారు వంత పాడుతారు. కోపును తెగ్గొట్టే సమయంలో ఈ పాటను పాడుతారు..
చింత పూత, చింత పూత రాలంగ
చిలకా బొట్టు పెట్టంగా
దండమయ్యా దండమయ్యా నా మరది
దండల్జెచ్చే మరది
వాకు తోటకు పోతాడు
అరకట్టాకుల్ తెత్తాడు
నెల్లోపల్లికి పోతాడు
నేర్కొలు తెత్తాడు
పై పాటలు అయిపోగానే చేతులు బిరబిరా కొడతారు.అందరూ లయాత్మకంగా కొడుతున్నారో లేదో వారిలోనే ఒకరు కనిపెడుతూ ఉంటారు. అందరూ ఒకే సారి కొట్టిన వెంటనే ఇంకో పాట ఎత్తుకుంటారు.
కుండడు కూడొండినదాన
కుక్కల నక్కల కేసినదాన
బానడు కూడొండినదాన
బావమరుదుల కేసినదాన
చిక్కుతీసిన చినకోల్లి
రాయా పోదామపద
అంటూ అరచేతుల్ని విడిపించుకొని కుడి ఎడమల పక్క నుండే ఒక్కొక్క సారి చప్పట్లు అందిస్తారు. ఇవి కుడిపక్క ఒక్కసారి (అందరూ ఒకేసారి) ఎడమపక్క ఒక్కసారి అందిస్తూ ఉండగా లయాత్మకంగా కొట్టడం వినిపించగానే ఇట్లా పాడుతారు...
కోలికోలి కొమ్మలాట
మేడమింద బొమ్మలాట
మీ మొగుల్లంత దండిపోయిరి
మీరు పొండి మిడతల్లారా
నాలుగిండ్ల నట్టనడుమ
నగలయ్యను నేను గంటి
నాగలోకము నేనే బోతిని
ఇట్లాంటి గేయాలు పాడుకొన్న తరువాత చివరిగా కొంత ఇతివృత్తమున్న గేయం పాడతారు. ప్రతి పాదంలోను మొదట, చివరగా 'కోయిలా కొమ్మనెరుడో' అనే ఊతపదంతో గేయానికొక తూగు, కోలాటానికి ఒక ఊపునిస్తుంది. జానపద గేయాల్లో ఊతపదాలెక్కువగా ఉంటాయి. వాటిలో ఉయ్యాలో- గురిగింజ గురిమల్లెలో- చందమామ యెన్నిలాయిలో లాంటి ఊతపదాలుంటాయి. ఒక్కొక్క పదాన్ని పాడుతుండగా మిగిలినవారంతా వంత పాడుతారు. ఇట్లా అనేక పాటలు పాడుకుంటూ కోలాటం ఆడతారు మన జానపద స్త్రీలు. అయితే ఇప్పుడు ఈ పాటలు చాలా వరకు మరుగున పడిపోయాయి. ఈ ఆటను, పాటల్ని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది.
-సిహెచ్కె రెడ్డి
Authorization