మార్షల్ ఐలాండ్స్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దీవులు. బ్రిటిష్ క్యాప్టెన్ విలియం మార్షల్ 1788లో క్యాప్టెన్ థామస్ గిల్బర్ట్తో కలిసి ఈ ప్రాంతాన్ని కనిపెట్టడం వల్ల ఆయన పేరు మీదుగా ఈ ద్వీపాలను పిలుస్తున్నారు. 'మజురో' నగరం రాజధాని. మార్షలీస్ భాష ప్రధాన భాష.
భోజనంతో పాటు పానీయాలను తీసుకోవడం ఇక్కడి ప్రజలకు అలవాటు. చేపలు, మాంసం బాగా తింటారు. స్థానిక ఫలాలు, ఆహార ధాన్యాలు, కూరగాయలకు తోడు బయటి నుంచి బియ్యం, పంచదార, పిండి వంటి వాటిని దిగుమతి చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. స్థానికంగా ఉపయోగించే కొబ్బరి పాల స్థానాన్ని కాఫీ, కోలా డ్రింక్స్ ఆక్రమించాయి.
పట్టణ ప్రాంతాల్లో ధనవంతులు, పేదవారికి మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. ఉన్నత వర్గాలవారికే ఉద్యోగాలు ఎక్కువగా దక్కుతున్నాయి. అట్లాగే రాజకీయాధికారం కొంతమంది నాయకుల బృందం, ఇంగ్లీషుమాట్లాడే స్థానికంగా స్థిరపడిన మిశ్రమజాతీయుల చేతుల్లోనే ఉంది.
పూర్వం ఉన్నత వర్గాల స్త్రీపురుషులు రకరకాల పచ్చబొట్లు పొడిపించుకొని తాము ఏ వర్గంవారో ప్రకటించుకునేవారు. ప్రసిద్ది చెందిన నావికులు, వైద్యులు కూడా తమ ప్రత్యేకతను తెలయజేస్తూ పచ్చబొట్లు పొడిపించుకునేవారు. ఇటువంటి ఉన్నతవర్గాలతో మాట్లాడటానికి ప్రత్యేకమైన భాషాశైలిని ఉపయోగించాలి. ప్రస్తుతం కూడా మర్యాదగల, సాధారణ భాష అని తాము మాట్లాడే భాషను రెండు రకాలుగా విభజించుకున్నారు.
మాతృస్వామ్య వ్యవస్థ ఇక్కడ ఉంది. స్త్రీ చాలావరకు అధికారాన్ని చలాయిస్తుంది. బయటికి మగవారే అన్ని పనులూ చేస్తున్నట్టు కనిపించినా ప్రతి విషయంలోనూ స్త్రీదే తుది నిర్ణయంగా ఉంటుంది.
వివాహం, కుటుంబం
తమ బంధువులు, వంశాలకు చెందినవారినే కాకుండా వేరేవారిని కూడా వివాహం చేసుకోవడానికి ఇక్కడ అనుమతి ఉంది. అట్లాగే అనేకమంది విదేశీయుల రాకపోకలు ఉన్నందువల్ల విదేశీయులను కూడా వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. యువత తమకు ఇష్టమైనవారిని వివాహం చేసుకోవచ్చు. అయితే చాలా వివాహాలు తొందరగానే దు:ఖాంతమవుతూ ఉంటాయి. పెండ్లయిన తరువాత దంపతులిద్దరూ వారిలో ఎవరో ఒకరి తల్లిదండ్రులకు చెందిన భూమిలో నిర్దేశితకాలం కాపురం ఉండాలి. ఒకరిద్దరు పిల్లల్ని కనడం ద్వారా ఆ కుటుంబం లేక కమ్యూనిటీ ప్రాచీన హోదాను పొందాలి. అప్పుడే ఆ కమ్యూనిటీ సభ్యులుగా గుర్తింపు పొందుతారు.
కుటుంబంలో పెద్ద హోదాలో ఉన్నవారు నిద్రించేందుకు ఎత్తయిన వేదికలు ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. అట్లాగే ఒకటి నుంచి నాలుగు లేక అయిదు కుంటుంబాలవరకు ఉన్న ఉమ్మడి కుటుంబం వంటచేసుకోవడానికి ప్రత్యేకమైన వంట ఇల్లు ఒకటి ఉంటుంది. అది ఒక ఉమ్మడి మాతృస్వామిక కుటుంబం అయినా అందులో పురుషుని తరఫు వారుకానీ, స్త్రీ తరఫువారుకానీ కలిసి జీవించే అవకాశం ఉంది. వంట ఇల్లును ఒకరు అంతకన్నా ఎక్కువ మంది స్త్రీ, లేక పురుషులు అజమాయిషీ చేస్తారు. వంటసామగ్రిని సమకూర్చడంలోను, వంటచేయడంలోను ఆ కుటుంబంలోని యువతీయువకులు పాల్పంచుకుంటారు.. అయిదేళ్లు నిండిన బాల బాలికలు గృహసంబంధ పనుల్లోసహాయంచేస్తారు.. వయసులో మరీ పెద్దవారు వంటచేయడంలోనో లేక చేపల చాపలను అల్లడంలోనో, పాత వస్తువులను రిపేర్ చేయడంలోనో... ఇట్లా ఏదో ఒక పనిలో పాల్పంచుకుంటారు.
- మౌక్తిక్
Authorization