దట్టమైన అడవిలో పక్షుల కిలకిలా రావాలు, సెలయేర్ల గలగలలు..చుట్టూ గుట్టలు... మధ్యలో ఒక కోయగూడెం. దాని పేరే బయ్యక్కపేట. ప్రస్తుతం తాడ్వాయి మండలంలో ఉంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క జాతర మొదట ఇక్కడే జరిగేది. ఆ తర్వాత అది వివిధ కారణాల వల్ల మేడారం చేరింది. ఏడవ శతాబ్దంలో కోయదొరలు వేటకు వెళితే అక్కడ పెద్దపులుల కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పసిపాప కనిపించిందనీ, ఆమెను తమ గ్రామమైన బయ్యక్కపేటకి చంద వంశస్తులు తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టడం జరిగిందని, అప్పటి నుంచి ఆమె ఊరి ప్రజలను సర్వరోగాల నుండి రక్షించింది అనేది ఒక కథనం. చంద వంశస్తులలో తలపతి అయిన చంద పరమయ్య కొన్ని ఏండ్లుగా జాతర నిర్వహించడం జరిగిందని పూర్వపు ములుగు తాలూకా మహబుబాబాద్ కోర్టు ప్రతుల ద్వారా తెలుస్తున్నది. రాను రాను భక్తులు పెరిగేకొద్ది జాతర నిర్వ్వహణకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడంతో మేడారం చుట్టుప్రక్కల జంపన్నవాగు, 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఏర్పాటు చేసుకొని చందవారికి వడ్డెలయిన సిద్దబోయిన వంశస్తులను వెంటబెట్టుకొని మేడారం జాతర నిర్వహించడమైనది.
మారుతున్న ఆచారాలు
మేడారం జాతర మొదట కొన్ని గూడేలకు, అది గిరిజన ప్రాంతానికి మాత్రమే పరిమితమై జరిగేది. ఒకప్పుడు జాతరను ఆదివాసులు మండ మెలిగే దగ్గరనుంచి జాతర పూర్తి అయ్యేంత వరకు తమ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలంగా జరుపుకునేవారు. ఇప్పుడు పూజా కార్యక్రమాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మేడారం జాతర వస్తుందటే రెండు రోజుల ముందు ఎడ్లబండి మీద రాత్రికి రాత్రే కుటుంబాలకు కుటుంబాలే ఉత్సాహంగా మేడారం బయలు దేరేవి. ఇంకో పక్క వెన్నెల రాత్రులలో తల్లిని తలుచుకుంటూ కాలినడకన నడుస్తూ డప్పులు వాయించుకుంటూ వెళ్లేవారు. గతంలో చిలకల గుట్టనుండి సమ్మక్క తల్లి (కుంకుమ భరణి)ని తీసుకొచ్చేటప్పుడు 'ఇప్పసార' ఉండాలనేది నియమము. కాని ఇప్పుడు 'ఇప్పసార' స్థానంలో గుడుంబా, లిక్కర్ చోటు చేసుకుంది. అలాగే సమ్మక్క తల్లిని అడవిలో దొరికే 'కంకపూల'తో మాత్రమే పూజించాలి అనేది వారి ఆచారం. క్రమంగా అది బంతి పూల పూజగా మారుతున్నది. అలాగే సమ్మక్క, సారలమ్మ గద్దెలకు పసుపుతో అలంకరించాలనే నియమం ఉంది. నిజానికి ఈ గద్దెలు మట్టి గద్దెలు. ఇప్పుడు పసుపు పెయింటుతో గద్దెను అలం కరించే రోజులొచ్చాయి. సహజమైన మట్టి గద్దెలను ఖరీదైన గ్రానైట్ రాళ్లు ఆక్రమించాయి. దేవాదాయశాఖ ఆధ్వర్వంలో ఈ మార్పులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఆదివాసీలతో సంప్రదింపులు ఏ మాత్రం లేవు.
మరో పక్క జాతరలో సంస్కృతి, సాంప్రదాయాలు పక్కకు నెట్టేసి గుడి లోపల పోలీస్ కళాజాత, నృత్యాలు, పాటలు కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఇవన్నీ ఆదివాసీ ప్రజలకి, జాతరకి పూర్తిగా వ్యతిరేకమైనవి. ఇప్పటి వరకు సమ్మక్క-సారలమ్మకు ఆకారాలు లేవు. కేవలం కుంకుమ భరణి, పసుపు రాసిన దిమ్మెలను పూజించడమే ఆనవాయితిగా వస్తోంది. కానీ విగ్రహాలు లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారే ప్రజలు అక్కడికి వస్తారు, పూజిస్తారు. ఇది ప్రభుత్వానికి లాభదాయకం కాదు కనుక ప్రతి రోజు సమ్మక్క-సారలమ్మలు పూజింపబడాలంటే వారికి రూపం ఉండాలి. అప్పుడు నిత్యం పూజాకార్యక్రమాలు ఉంటాయి. భక్తుల రాక ఎప్పటికీ ఉంటుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతంది అనే ఉద్దేశ్యంతో గుడిలో విగ్రహాలు (బంగారు ప్రతిమలు)ఏర్పాటు చేయడానికి పూనుకుంది ప్రభుత్వం. కానీ ఆదివాసీల వ్యతిరేకతతో ప్రస్తుతానికి విగ్రహాల ప్రతిపాదన ఆగిపోయింది.
మూడు నాలుగేళ్ళ కిందట వరకు జాతర ఒక నెల ముందుందనగా భక్తుల కానుకలు, హుండి రూపంలో వచ్చే కానుకలు పూజారులకు దక్కేవి. ఇప్పుడు అది పూర్తిగా దేవదాయశాఖ పరిధిలోకి వెళ్ళిపోయింది. రానున్న రోజుల్లో గిరిజన పూజారుల స్థానంలో బ్రాహ్మణ పూజారులను పెట్టినా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు ఇక్కడ లాభ దృష్టిగాని, వ్యాపారదృష్టి గాని మచ్చుకైనా లేదు. గిరిజనేతరులు ఎప్పుడైతే మేడారం చుట్టు పక్కలకు చేరుకున్నారో ఆదివాసీలను రుణగ్రస్థులను చేసి వారి భూములను ఆక్రమించుకున్నారు. వారిని మద్యం మత్తులో ముంచేశారు. జాతర ప్రభుత్వపరమైన తరువాత ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వ్యాపారీకరణ జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటి నుండి దీని స్వరూపం, స్వభావాలు మారడం మొదలైనాయి. ఫలితంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడుతున్నాయి.
జాతర పేరుతో చేసే అభివృద్ధి మూణ్ణాల్ల ముచ్ఛటే. ఇప్పుడు ఆదివాసీల జాతర పూర్తిగా ప్రభుత్వ, గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్ళిందనేది అందరి నాలుకలపై ఓలలాడుతున్న మాట. మేడారం ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం ఇందుకు ఒక నిదర్శనం. దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల నుండి(చత్తీస్ఘడ్, ఒరిస్సా, మహరాష్ట్ర మొ||) భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకునే మహాజాతర సమ్మక్క-సారలమ్మ జాతర.అది ఇప్పుడు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధంగా కొనసాగుతున్నది. గిరిజన సంస్కృతి పరాయీకరణ చేసే ప్రయత్నాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రత్యేకించి గిరిజన ప్రజానీకం ఆదివాసీ మేధావులు తీవ్రంగా వ్యతిరేకించాలి.
-పెనుక ప్రభాకర్
సెల్ : 9494283038
Authorization