వ్యక్తుల వైఖరులు, సంవేదనలు, అవగా హనలు, ధోరణులు వంటి ఆత్మాశ్రయ లక్షణాల ద్వారా వ్యక్తమయ్యే సంస్కృతిని గుణాత్మకం అంటారు. సంస్కృతి అనేది ఒక మార్మిక వస్తువు కాదు. మార్మిక అనుభవం కాదు. అట్లాగే కనిపించని వస్తువూ కాదు, కనిపించని అనుభవమూ కాదు. సంస్కృతికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది. ఎన్నో గుణాల్లో వ్యక్తమవుతుంది. ఒక వ్యక్తి స్వేచ్ఛను, వికాసాన్ని, బాధ్యతను ఆరాధిస్తాడు. అందులో వ్యక్తమవుతూ ఉంటుంది సంస్కృతి. వీటిని నిరసించే వ్యక్తి సంస్కృతి హీనుడని వేరే చెప్పనక్కరలేదు. పైగా శాస్త్రీయ దృక్పథం, మానవత, విశాలత, అనేవాటిని సుగుణంగా ఎంచడంలో, వాటిని పాటించడంలో సంస్కృతి మూర్తీభవించి ఉంటుంది. వీటికి భిన్నమైన ధోరణులలో... అంటే పిడివాదాల్లో కాలం చెల్లిన సంప్రదాయాలను పట్టుకొని ఊగుతాడనడంలో, సంకుచితత్వంలో సంస్కారం సూన్యమని అర్థమవుతుంది. ఇతరులకు హాని కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు వారిపట్ల సంతాపాన్ని వ్యక్తపరచడం, పరితపించడం; అంతేగాక అనుక్షణం తనను తాను స్వపరిశీలన చేసుకుంటూ తనను తాను అధిగమించడం వంటివన్నీ సంస్కృతిగలవాని లక్షణాలు. తనను గురించి తాను నిత్యం మంచివానిగా, జ్ఞానిగా ఎంచుకొంటూ ఇతరుల పట్ల హీనభావాన్ని కలిగి ఉండటంలో ఇతరుల్లోని మంచితనాన్ని కూడా చూడలేకపోవడంలో, ఇతరుల కష్టాలను అర్థంచేసుకోకపోవడంలో ఒకని సంస్కృతీ రహిత స్వభావం వ్యక్తమవుతుంది.
నిరాడంబరత, చట్టబద్ధత, కాలాన్ని పాటించడం, తనలోని బలహీనతలను ఒప్పుకోగలగటం వంటివి సంస్కృతిగలవాని జీవనశైలిలో భాగం. స్త్రీని గౌరవించడం, స్త్రీ మానవతను గుర్తించడం, స్త్రీ స్వేచ్ఛ కొరకు కృషి చేయడంలో సంస్కృతి కనిపిస్తుంది. స్త్రీని తక్కువగా అంచనావేయడం, ఆమె పురుషుని చేతిలో వస్తువన్నట్లు భావించడం, ఆమె తనతో సమానం కాదని అనుకోవడంలో ఒకని సంస్కార హీనత అర్థమవుతుంది. సంస్కారం గలవాడు అమానుష ధోరణులకు, దోపిడి విధానాలకు, మనుష్యులను వస్తువులుగా మార్చే పద్ధతులకు, వివక్షతకు, జాత్యహంకారం, కుల దురహంకారం, మతోన్మాదం, అస్పృశ్యత వంటివాటన్నింటికి బద్ధ వ్యతిరేకి. ఆలోచనల్లో సమగ్రత్వం, ఆదర్శాలకై అంకితమవ్వడం, సాటి మానవుని పట్ల స్వాభావికంగా ఉండే గౌరవం వంటివన్నీ సంస్కృతిగలవానికి ప్రతీకలే. సంప్రదాయాలను, చట్టాలను, నైతిక విలువలను గుడ్డిగా నిరాకరించడంలో కాదు; వాటిని సశాస్త్రీయ దృక్పథంతో పరిశీలన చేసి, మానవత్వం అనే కొలబద్దతో అంచనా వేసే ధోరణిలో సంస్కృతి గుప్తమై ఉంటుంది.
జీవితానందం, తృప్తి, నిరీక్షణం కొరకు తాపత్రయపడుతుంది సంస్కృతీపరమైన జీవితం. జీవితంలోని ప్రతి క్షణాన్ని నిత్యత్వంగా భావిస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న హేయమైన, నాశనకరమైన భయంకర పరిణామాల మధ్యలో గూడా ప్రపంచాన్ని నమ్మడం, మంచిరోజుల కొరకు క్రియాత్మకంగా నిరీక్షించడం సంస్కృతి గలవాని స్వభావం. ఈ అన్ని లక్షణాలు అందరిలో లేకపోయినా; కొందరిలో కొన్నైనా ఉన్నందువలననే మన ప్రపంచం మనగలుగుతున్నది.
-వి ఎన్
Authorization