నమ్మకాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. పూర్వం విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో కొన్ని అపోహల వల్ల ఏర్పడిన మూఢ నమ్మకాలు ఇప్పటికీ కొనసాగడమే ఇబ్బందికరమైన విషయం. అసంఖ్యాకంగా మనుషులు నమ్మకాలను స్వాగతించి బలమైనవాటికి శక్తికలిగించారు. కాల క్రమంలో ఈ నమ్మకాలే మనుషుల జీవితంపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరుకున్నాయి. సామాన్యులను కొన్ని నమ్మకాలు భయకంపితులను చేస్తాయి. సూర్య, చంద్రగ్రహణాలు వచ్చాయంటే గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా కదలకుండా ఇంట్లోనే పండుకోవాలనే నమ్మకం ఇటువంటిదే. వారు బయటికి వస్తే గర్భస్థ శిశువుకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనే ప్రచారం ఉండటంతో ఎందుకయినా మంచిదని చాలామంది ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండిపోతారు.
నిజానికి సూర్య చంద్రగ్రహణాలకు సంబంధించి ఆటవిక దశలో ఉన్న మానవునికి కొన్ని భయాలు ఉండేవి. తమకు ఆరాధ్యుడయిన సూర్యున్ని ఎవరో మింగేస్తున్నారని, ఇది తమకు కీడు కలిగించే విషయమని భావించి ఆటవికులు భయంతో నివాసాలను దాటి బయటికి వచ్చేవారు కాదు. అది ఇప్పటికీ కాస్త రూపం మార్చుకొని కొనసాగుతూ ఉండటం గమనార్హం.
ముహూర్తాలు చూసి కొత్తపనిని మొదలు పెట్టడం, లేక పెళ్ళివంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలు జరపడం భారతీయ సమాజంలో ఉన్న అతి ముఖ్యమైన నమ్మకం. అలాగే శకునాలు చూసి పని చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడం కూడా. ఏదో ముఖ్యమైన పని ఉందంటూ ఇంట్లోనుంచి బయటికి అడుగు పెట్టగానే భర్త చనిపోయిన స్త్రీ కాని, పిల్లి కాని ఎదురొస్తే వెంటనే 'చెడ్డ శకునం' అనుకుంటూ మళ్ళీ ఇంట్లో దూరేవారు ఎందరో కనిపిస్తారు. భర్త చనిపోయిన స్త్రీని చూసి వెనక్కి వెళ్ళిపోతే ఆమె ఎంత మానసిక క్షోభకు గురవుతుందో ఇటువంటివారు ఆలోచిస్తారా నమ్మకానికి హేతువుతో సంబంధం లేదు అనేవారున్నారు. సరే వారి మాట నిజమే కావచ్చు. కానీ ఆ నమ్మకం ఎదుటివారిని బాధపెట్టకూడదు కదా. మానవత్వం లేని నమ్మకం ఉంటే ఏమి, ఊడితే ఏమి?
అయితే ఈ నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. భారతీయులకు చెడ్డ శకునం అనుకున్నవి పాశ్చాత్యులకు మంచివిగా ఉంటాయి. ఉదాహరణకు గుడ్ల గూబ అంటే భారతీయులు చెడ్డ శకునంగా భయపడిపోతారు. గుడ్ల గూబ పొరపాటున ఇంట్లో దూరిందంటే నెలలు, సంవత్సరాలు ఇంటిని పాడుపెట్టి ఇంట్లో వారు బయటికి వెళ్ళి ఉంటారు. అట్లాగే కోయిల అనగానే శ్రావ్యమైన గానంతో మురిపాలొలికించే పక్షిగా భారతీయులు చూస్తారు. కానీ పాశ్చాత్యులు దాన్ని మోసం చేసే పక్షిగా చూస్తారు. ఒక పక్షి ఒక జాతికి మంచి శకునం, మరొక జాతికి చెడ్డ శకునం ఎందుకవుతుంది? ఇవన్నీ మూఢనమ్మకాలు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
Authorization