అత్యధికులు మాట్లాడే భాష గ్రీన్లాండిక్. అయితే తూర్పు, పడమర ప్రాంతీయుల మధ్య యాసలో కొన్ని తేడాలున్నాయి. అట్లాగే ప్రతి గ్రీన్లాండ్ పౌరుడు డానిష్ భాష కూడా మాట్లాడగలడు.
ప్రజలు ఎక్కువగా చేపలు, ఆలు, ఇతర కూరగాయలు, కేన్లలో నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. సీల్, ధృవపు ఎలుగుబంటి మాంసాన్ని కూడా తింటారు.
సామూహికంగా భూములపై హక్కును కలిగి ఉంటారు ప్రజలు. ఇన్యూయిట్ కుటుంబాలు తాము వాడుకోగా మిగిలిన వస్తువులను పేదవారికి ఉచితంగా ఇచ్చివేస్తాయి. అయితే రాజధాని నగరం వంటి చోట్ల నివసించే యూరోపియన్ జాతీయుల వంటివారికి ప్రయివేటు ఆస్తిపై హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల పరిరక్షణకు గట్టి చట్టాలు కూడా ఉన్నాయి.
స్త్రీ, పురుషులకు ప్రత్యేకించిన పనులంటూ లేవు. ఎవరు ఏపనైనా చేస్తారు. కాకపోతే చేపలు పట్టడం, వేటాడటం వంటి పనులు ఎక్కువగా పురుషులు చేస్తే.. స్త్రీలు మాంసాన్ని ఆరబెట్టడం, వేటాడిన జంతు చర్మాలను బాగుచేయడం చేస్తారు. అయితే అమ్మాయిలకంటే అబ్బాయిలకు సమాజంలో ఎక్కువ విలువ ఉంటుంది.
వివాహం విషయానికి వస్తే ఎక్కువగా ప్రేమ వివాహాలే ఉంటాయి. ఏవో కొన్ని మాత్రమే పెద్దలు కుదిర్చిన పెండ్లిళ్లు కనిపిస్తాయి. గ్రీన్లాండ్ సమాజంలో ఉమ్మడి కుటుంబాలు చాలా ముఖ్యమైన భూమిక కలిగి ఉన్నాయి. ఒకే రక్త సంబంధం కలిగిన కుటుంబాలు ఎన్నుంటే అన్నీ కలిపి వేటాడిన జంతు మాంసాన్ని సమానంగా పంచుకుంటాయి. అయితే తమ జాతీయులు కానివారితో కూడా వీరు వివాహ సంబంధాలు పెట్టుకుంటారు.
Authorization