సూడాన్ దక్షిణ ప్రాంతంలో 'లటుక' అనే ఆదివాసీ తెగ ఉంది. వీరిని అసలైన మసాయి ప్రజలుగా భావిస్తారు. కానీ వీరు నిలోటిక్ నీగ్రోలు అనుసరించే ఆచారాలను తమ సంస్కృతిలో మిళితం చేసుకున్నారు. ఈ ప్రజల్లో ఇప్పటికీ ఓ వింత ఆచారం ఉంది. ఎవరైనా పెండ్లి కావలసిన కుర్రాడికి నచ్చిన అమ్మాయి కనిపిస్తే అమ్మాయిని అతడు కిడ్నాప్ చేస్తాడు. అట్లా కిడ్నాప్ చేయడం ద్వారా తాను ఫలానా అమ్మాయిని పెండ్లి చేసుకోవాలనుకుంటున్నానని చుట్టుపక్కల వారికి తెలియజేస్తాడన్నమాట. కిడ్నాపింగ్ తరువాత అబ్బాయి తరఫున ఓ పెద్దమనిషి పిల్ల తండ్రి దగ్గరకు వెళ్లి .. ఈ పెండ్లి ఆయనకు ఇష్టముందా లేదా అని అడుగుతాడు. తన కూతురుతో ఆ అబ్బాయి పెండ్లి ఇష్టమయినట్లయితే కాబోయే అల్లుణ్ణి చితకబాదుతాడు అమ్మాయి తండ్రి. ఒక వేళ ఇష్టం లేకపోతే ఆ తండ్రి చేసేది ఏమీ ఉండదు. కిడ్నాపర్ మాత్రం ఎత్తుకెళ్లిన అమ్మాయిని ఆర్భాటంగా పెండ్లి చేసుకుంటాడు. ఈ మొత్తం డ్రామాలో అమ్మాయి ఇష్టాఇష్టాల ప్రస్తావనే ఉండదు. అదే ఇక్కడ గమనించాల్సిన విషాదం.