చైనాలో కుక్క మాంసం ఇంష్టంగా తినేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ కుక్క మాంసం తినడం కోసం ఒక ఫెస్టివల్‌నే నిర్వహిస్తున్నారు. కుక్క మాంసం వ్యాపారులకు లాభం చేకూర్చాలని నాలుగైదు ఏళ్ళ క్రితం ఇలా ఫెస్టివల్ ప్రారంభించారు కొందరు. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రేకెత్తడానికి కారణమయింది. నిజానికి కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం కుక్క మాంసాన్ని తినడాన్ని అనుమతిస్తుంది. ఇది అక్కడ చట్టబద్దమే.అయితే జంతు ప్రేమికుల ఆందోళనల వల్ల కొన్ని చోట్ల నిరుత్సాహపరుస్తోంది. దశాబ్దాలుగా నడుస్తున్న ఎన్నో కుక్క మాంసం షాపులను మూసివేసింది కూడా. కానీ ఇప్పటికీ చైనాలో కుక్క మాంసం బాగానే అమ్ముడు పోతోంది.
చైనా గువాంగ్జీ ప్రావిన్స్‌లో ఉన్న యూలిన్లో వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పండగ నిర్వహిస్తున్నారు. దాదాపు పదివేల కుక్కలను ఈ సందర్భంగా చంపి మాంసప్రియులకు వడ్డిస్తారు. కుక్క మాంసం తింటే ఆరోగ్యానికి మంచిదని, అదృష్టం కలిసి వస్తుందని చైనా సంప్రదాయవాదులు నమ్ముతున్నారు. అందుకే ఈ మాంసాన్ని వీరు ఆరగిస్తున్నారు. అయితే డాగ్ మీట్ ఫెస్టివల్‌ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో అనేక మంది గొంతెత్తారు. దీంతో యూలిన్లో బహిరంగంగా కుక్కలను వధించరాదని, 'డాగ్ మీట్' అనే బోర్డు ప్రదర్శించరాదని స్థానిక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చైనాలో రాచరిక కాలం నుంచి కుక్క మాంసం తినడం ఉంది. కొన్ని రాజవంశాలవారి అధికార పాకశాలల్లో కుక్క మాంసాన్ని వండి వడ్డించేవారని చరిత్ర చెబుతోంది. అయితే తరువాత కాలంలో ఈ మాంసాన్ని తినడాన్ని రాజులే నిషేధించారు. అయినా చైనీయుల్లో ఇప్పటికీ ఆ మాంసాన్ని ఇష్టంగా తింటున్నారు. కొన్ని ప్రావిన్స్‌ల్లో కుక్క మాంసం వారి ఆహారంలో ఒక భాగమయింది.
Authorization