రాతియుగాల నుంచి ఈ ప్రపంచంలో కళ మనుగడలో ఉంది. కడుపు నిండి కాస్త విశ్రాంతి దొరికిన సమయంలో నాటి మానవులు ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. బొమ్మలు వేసేవారు. ఇది కళ ప్రాథమిక దశ. టెక్నాలజీ పెరిగి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునే సరికి మిగులు ఉత్పత్తి పెరిగింది. దీంతో వ్యాపార కార్యకలాపాలు పెరిగి సంపద పోగుపడటం ప్రారంభమయింది. సంపన్నులు అధికారాన్ని చేజిక్కించుకొనే స్థితికి వచ్చారు. ఆర్థిక పరిస్థితులను బట్టి కళాకారుడు సృష్టించే కళ నాణ్యత, స్థాయిలో తేడాలు ఉంటాయి. సంపన్నులు పెరుగుతూ వచ్చేటప్పటికి వారి ప్రాపకంలో కళాకారులు అనేక కళారూపాలను ప్రదర్శించి భుక్తిని పొందటం ప్రారంభించారు. కవులు, గాయకులు, చిత్రకారులు, నటులు... ఇట్లా కళాకారుడనే ప్రతి ఒక్కడు ధనవంతుల ఫోషణను పొందటానికి ప్రయత్నించి కళా సృష్టి చేసే స్థితికి వచ్చారు.
'డబ్బున్నవాడు దానం చేసినా దాని వెనుక ఓ ప్రయోజనం దాగి ఉంటుంద'ంటాడు ఓ రచయిత. వేలు, లక్షలు కుమ్మరించి ధనికులు కళాకారులను ఎందుకు ఆదరిస్తారు? సంపన్నులు తమ వర్గ స్వభావానికి విరుద్ధంగా ఉండే కళను, సంస్కృతిని ఎప్పుడూ ప్రోత్సహించరు. కళాకారులను ప్రోత్సహించడం ద్వారా అధికార వర్గం, ధనవంతులు బలమైన ప్రచారాయుధాన్ని తమ చేతుల్లో ఉంచుకొనే ప్రయత్నం చేస్తారు. చరిత్రలో ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. ప్రపంచంలో అనేక చోట్ల ఎన్నో తిరుగుబాట్లు, విప్లవాలు వచ్చాయి. అధికార మార్పిడులు జరిగాయి. ఆయా సమయాల్లో సమాజ విలువలు మారుతూ వచ్చాయి. విలువలు, పద్ధతులు మారే క్రమంలో పాత విలువలకు మద్దతు ఇచ్చేవారికి, కొత్త విలువలను ప్రతిపాదించేవారికి మధ్య, కొత్తఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణను నివారించడానికి అధికార వర్గాలకు బలమైన ఆయుధం కావలసి వచ్చింది. ఆ ఆయుధం పేరు 'కళ'.
అధికారంలో ఉన్నవాడు సాంప్రదాయవాది అయితే ''మన ప్రాచీన సంస్కృతి, పురాణాలు, రుషులు, ఇతిహాసాలు'' అంటూ పాత పద్ధతులను కీర్తించేలా కళాకారులను ప్రోత్సహిస్తాడు. తమ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసేవాడిని ఆస్థాన విద్వాంసుణ్ణి చేస్తారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఇస్తారు. కళాకారుడు బతకాలంటే డబ్బు కావాలి. డబ్బున్నవాడేమో తన వర్గానికి వ్యతిరేకంగా ఉండే కళను ప్రోత్సహించడాయె! అందుకే కళాకారుడు మనుగడ కోసం ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోతాడు. కళాకారుని కొన్ని ఆలోచనలు అతడికే వెగటు పుట్టిస్తాయి. కానీ ఆ ఆలోచనతో సృష్టించిన కళ అమ్ముడు పోగలిగితే రెండో ఆలోచన లేకుండా ముందుకు సాగుతాడు. లేకపోతే పస్తులుండాల్సి వస్తుంది ఇదంతా గమనిస్తే ఏమనిపిస్తుంది? కళాకారుని భావజాలాన్ని ప్రభావితం చేసేవి అతడి ఆర్థిక పరిస్థితులే గదా! ఆయితే కొందరు డబ్బుకు లొంగక తాము ఏమనుకున్నారో ఆ ఆలోచనను తమ కళ ద్వారా వ్యక్తం చేస్తారు. అటువంటివారిని సాంప్రదాయం సమాజం శంకరగిరి మాన్యాలు పట్టించింది. ఆకలికి మాడ్చి, జైళ్ళలో కుక్కి సమాజం నుంచి వెలివేసింది. ఈ దుర్భర పరిస్థితుల్లో కళాకారుడు అద్భుత కళా ఖండాలను ఎట్లా సృష్టించగలుగుతాడు? అందుకే ప్రాచీన కాలం నుంచి నేటివరకు అత్యధిక కళాకారులు సృష్టించే కళ ధనస్వామ్యానికి, అధికార వర్గానికి అనుకూలంగా ఉంటూ వచ్చింది.
-భూపేంద్ర నాగ
Authorization