వీధిభాగవతంలో కూచిపూడి వీధిభాగవతాలు, గొల్ల భాగవతాలు, యానాది భాగవతాలు, మాల భాగవతాలు, చిందు భాగవతాలు కాక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పు భాగవతం, చెంచుభాగవతం, జాలరి భాగవతం అనేవి ప్రసిద్ధిగాంచిన భాగవతాలు ఉన్నాయి. ఈ భాగవతాల్లో తూర్పు భాగవతం ప్రసిద్ధి చెందింది. భాగవత పురాణం నుంచి ఇతివృత్తాన్ని తీసుకోవడంతో తెలుగు నేలలో తూర్పు భాగవతం, యక్షగానం, వీధినాటకం మూడింటినీ ఒకే అర్థంలో ఉపయోగిస్తున్నారు.
భాగవతంలో రెండు ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి కృష్ణలీలలైతే రెండోది జలక్రీడలు. ఇప్పుడెక్కువగా శృంగార రసస్ఫోరకమైన ఇతివృత్తమే వ్యవహారంలో ఉంది. తూర్పు భాగవతం, కలాపం కంటే కాస్త భిన్నమైనది. కలాపాన్ని కూచిపూడి కళాకారులు ప్రదర్శిస్తే తూర్పు భాగవతాన్ని జానపద కళాకారులు ప్రదర్శిస్తారు.
తూర్పు భాగవతంలో సాధారణంగా కళాకారులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుంటారు. ఉదాహరణకు మహంకాళి, చింతా కుటుంబాలు తెలుగు ప్రాంతాల్లో ప్రసిద్ధి గాంచాయి. తూర్పు భాగవతులు భామాకలాపం, గొల్లకలాపాలు ప్రదర్శిస్తారు. తూర్పుభాగవతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రచారంలో ఉంది. హస్తవిన్యాసంలో, పాటపాడటంలో తూర్పు భాగవతంలో కొంతవరకు మార్గి పద్ధతులు అనుసరించడం .జరుగుతుంది. మృదంగం, తాళాలు వాయించడంలోగాని, భావ వ్యక్తీకరణలో కొంతవరకు మార్గి పద్ధతులను అనుసరించినా తూర్పు భాగవతం ఇంకా జానపద పద్ధతుల్లోనే ఉంది.
Authorization