హిమాలయాల్లో నివసించే స్థానిక ప్రజల్లో తమాంగులు ఒకరు. వారు తాము పరమశివుని నుంచి ఆవిర్భవించినవారుగా నమ్ముతారు. టిబెట్-బర్మా సమూహానికి చెందిన భాషను మాట్లాడే తమాంగుల సంస్కృతి విలక్షణమైనది. వీరి జన్మస్థానం టిబెట్. అయితే తరచుగా జరిగే శతువ్రుల దండయాత్రల వల్ల ఈ ప్రజలు హిమాలయాల్లోని నేపాల్, భూటాన్, మయన్మార్, సిక్కిం వంటి ప్రాంతాలకు వలసవచ్చి స్థిరపడ్డారు. టిబెట్లో 'షమ్య' తెగకు చెందిన ప్రజలు రతన్ చాంగ్ గ్యాంపో అనే టిబెట్ రాజు కాలంలో గుర్రాలపై నేపాల్ వచ్చి స్థిరపడిపోయారు. అక్కడ స్థిరపడిన షమ్య తెగ ప్రజలనే తమాంగులని పిలవటం ప్రారంభించారు. తమాంగులు రెండు ప్రధాన వర్గాలుగా ఉన్నారు. వీరిని తిరిగి 12 కులాలుగా, 18 ఉపకులాలుగా విభజించవచ్చు. అయితే రెండు ప్రధాన వర్గాల మధ్య పెద్దగా చెప్పుకోవలసిన భేదాలు ఏమీలేవు. వివాహం వంటి తంతుల్లో అందరూ ఒకే విధమైన ఆచారాలను పాటిస్తారు.
తమాంగులు తమ సమాజాన్ని నడపటానికి కొంతమంది సభ్యులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.ఈ వ్యవస్థలో యోహో (చైర్మన్), ముల్మీ (తెగ పెద్ద), దప్తా లామా (పురోహిత పూజారి), బోన్పో (క్షుద్రశక్తులను పూజించే క్షుద్ర వైద్యుడు), దోప్తా (సాధు), అల్లా (పెద్దలు), తంబా ( పూర్వీకుల చరిత్ర తెలిసిన లేఖకుడు), గార్మి గొదారు ( సెక్రెటరీ) ఉంటారు. ప్రతి ఏడాది సంసారి పూజను నిర్వహించడానికి ముల్మీని ఎన్నుకుంటారు. అలాగే ఉమ్మడి ఆస్తి అయిన అడవులు, గడ్డి భూములను రక్షించే బాధ్యత కూడా ఈయనదే.
తమాంగులు బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. నవంబర్లో ప్రతి ఏడాది షిమే- భీమే పూజ చేస్తారు. ఈ పూజ చేస్తే ప్రతి ఏడాది సరైన సమయంలో వర్షాలు పడతాయని, మంచి పంటలు పండుతాయని వారు నమ్ముతారు. పుట్టిన దగ్గరి నుంచి చనిపోయేవరకు జరిగే అన్ని మతపరమైన కార్యక్రమాలు 'లామాల' ఆధ్వర్యంలోనే జరుగుతాయి. బోన్పో లామా నిర్వహించే క్రతువులో మాత్రం జంతుబలి ఉంటుంది. మిగతా ఏ క్రతువుల్లోనూ జంతుబలి కనిపించదు. అహింసను ప్రబోధించిన బౌద్ధ మతాన్ని అనుసరిస్తూ జంతుబలిని ఇవ్వటం ఏమిటో అర్థం కాదు.
తమాంగులు మంచి హాస్యప్రియులు. అలాగే 'ధంఫు' అనే సంగీత వాయిద్యంతో వారి సాంస్కృతిక కార్యక్రమాలు పెనవేసుకుని ఉంటాయి. జానపద నృత్యం కోసం పాడే పాటల్ని 'తమాంగ్ షెలో' అంటారు. అలాగే నృత్యం కూడా వారి జీవితంలో ఒక భాగమే. ధంఫు లేకుండా ఆట, పాట ఉండనే ఉండవు.
- మౌక్తిక్
Authorization