రువాండా, బురుండి దేశాల్లో అధిక సంఖ్యలో కనిపించే హూటూ తెగప్రజలు సుమారు కోటిన్నర మంది దాకా ఉంటారు. కిన్యవండా (రువాడాలో), కిరుండి (బురుండిలో)ి, ఫ్రెంచి, స్వాహలి భాషలు మాట్లాడుతారు. వీరు చాలా కాలం యూరోపియన్ల వలస పాలన కింద ఉండటం వల్ల మతం, ఇతర సామాజిక అంశాలు కొంత ప్రభావితమైనాయి. వీరు ఆఫ్రికా తూర్పు, మధ్య భాగాల్లో నివసిస్తున్నారు. గత రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు అంతర్గత పోరాటాల కారణంగా ఈ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినా ఇప్పుడు చాలా మంది సొంత గూళ్లకు చేరుకున్నారు.
హూటూ ప్రజలకు అనేక సామెతలు, జానపద కథలు, పొడుపు కథలు, పురాణ కథలు ఉన్నాయి. సమదరి అనేవాడు వీరి ప్రసిద్ధి చెందిన జానపద కథానాయకుడు. ఇతడు వ్యవస్థీకృతమైన నియమాలను బద్దలు కొడతాడు. సంపన్నులు, శక్తివంతులపై వ్యంగ్యబాణాలు వేస్తాడు. పశువుల మందల యజమానులైన ధనవంతులను అవమానిస్తూ ఉంటాడు. హూటూ ప్రజలు ప్రస్తుతం క్రైస్తవ మతాన్ని అవలంభిస్తున్నప్పటికీ, ఇప్పటికీ వారు ప్రాచీన విశ్వాసాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రాచీన హూటూ ప్రజల దేవుడు ఇమానా. ఇతడు చాలావరకు మానవ లక్షణాలతోనే ఉంటాడు. ప్రాచీన పితరుల ఆత్మలను అబజిమ అంటారు. ఈ ఆత్మలకు కోపం వచ్చి దురదృష్టాన్ని కలుగజేస్తాయని ప్రజలు నమ్ముతారు. అందుకే రకరకాల బహుమతులను సమర్పించడం ద్వారా వాటిని తృప్తిపరచి రక్షణ పొందే ప్రయత్నం చేస్తారు. జ్యోతిష్కుల ద్వారా ప్రజలు పితరుల ఆత్మలతో సంబంధాలు పెట్టుకోవచ్చని నమ్ముతారు. అందుకే వారిద్వారా తమ పితరులతో సంభాషిస్తారని చెబుతారు.
సంస్కారాలు
శిశువు పుట్టినప్పుడు శిశువు, తల్లి ఒంటరిగా ఏడు రోజులు ఇంట్లో ఉండాలి. ఏడవ రోజు నామకరణోత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వారికి భోజనం పెడతారు. వివాహ సందర్భంగా వధువుకి వరుని తరఫువారు కొంత సంపదను ఇస్తే ఆ వివాహం చట్టపరమైనదిగా భావిస్తారు. సాధారణంగా పశువులు, మేకలు, బీరు ఈ సంపదకిందకు వస్తాయి. అంటే వరుడు కన్యాసుల్కం చెల్లిస్తేనే పెండ్లికి చట్టబద్దత వస్తుందన్నమాట. వివాహ సమయంలో వధువు శరీరాన్ని పాలు, వివిధ వనమూలికలతో కప్పుతారు. అట్లా చేస్తే ఆమె శరీరం స్వచ్ఛమైనదిగా మారుతుందని నమ్ముతారు. ఎవరైనా మరణిస్తే ప్రార్థనలు, ఉపన్యాసాలు, క్రతువులు చేస్తారు. మరణించినవారి సమీప బంధువులు కొన్ని కొన్ని పనుల్లో పాల్గొనరు. అంటే... సూదకం ఉన్నన్ని రోజులు వారు పొలాల్లో పనిచేయరు. అట్లాగే లైంగిక జీవనం గడపరు. ఇక సూదకం రోజులు ముగిశాయని ప్రకటించడానికి క్రతువులతో కూడిన విందును ఏర్పాటు చేస్తారు.
హూటూ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ నివసిస్తారు. కర్రలు, గడ్డి వంటి వాటితో నిర్మించిన గుడిసెల్లో ఉంటారు. ఇటీవల ఆధునిక గృహాలను కూడా నిర్మించుకుంటున్నారు. ఇంటి పనులను స్త్రీలే చూసుకుంటారు. పొలాల్లో మొక్కలు వీరే నాటుతారు. పురుషులు, మగపిల్లలు పశువులు కాస్తారు. అట్లాగే పొలాన్ని మొక్కలు నాటడానికి సిద్ధం చేస్తారు. పూర్వం తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వివాహం కుదిర్చేవారు. ప్రస్తుతం యువతీయువకులే తమ భాగస్వామిని ఎన్నుకుంటున్నారు.
పూర్వం చెట్ల బెరడుల నుంచి తయారుచేసిన వస్త్రాలను, జంతు శర్మాలను స్కర్టులుగా ధరించేవారు. ప్రస్తుతం ఆధునిక పాశ్చాత్య దుస్తులను ధరిస్తున్నారు. ఇప్పటికీ వీరు చేతితో తయారు చేసే పూసల హారాలను, ముంజేతి హారాల బ్రాస్లెట్స్)ను ధరించడం కొనసాగిస్తూనే ఉన్నారు. బీన్స్, జొన్నలు, మొక్కజొన్నలు, చిరుధాన్యాలు, చిలగడదుంపలు, పాలు, గొడ్డుమాంసం ఆహారంలో ముఖ్య భాగాలుగా ఉంటాయి. మేక మాంసం, మేక పాలు సామాజికంగా తక్కువ స్థాయి కలిగిన వారు ఆహారంగా తీసుకుంటారు.
సంగీతం, నృత్యం గ్రామీణ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. స్త్రీ, పురుషులకు వేరు వేరు నృత్యాలు ఉంటాయి. నృత్యంచేసేవారు తమ చేతులు, శరీరాన్ని చాలా వేగంగా కదిలిస్తారు. కాళ్లను సందర్భాన్ని బట్టి నేలకు తాటిస్తారు. వేటపాటలు, పశువులను మెచ్చుకుంటూ పాడే పాటలు వారు పాడుకునే పాటల్లో కొన్ని మాత్రమే.
Authorization