న్యూజిలాండ్‌లో మావోరి ప్రజలు ఓ ఒళ్లు గగుర్పొడిచే నృత్యం చేస్తారు. ఈ నృత్యం లయబద్ధమైన రణరంగపు హాహాకారాలు, సవాళ్లతో చూపరులకు భయం కలిగించేందుకు ఉద్దేశించినది. ఇంతకు ఆ డ్యాన్స్ పేరు చెప్పనేలేదు కదూ.. అదే 'హక'. మావోరీలు సమూహంగా చేసే ఈ డ్యాన్స్ యుద్ధసమయాల్లో చేసేటువంటిది. సాధారణంగా యుద్ధానికి వెళ్ళిన సైనికులు యుద్ధానికి ముందు శత్రువులకు ఛాలెంజ్ విసురుతూ.. తమ బలపరాక్రమాలను వివిధ భంగిమల్లో చూపించి భయపెట్టడానికి ఉద్దేశించిన ప్రదర్శన ఇది. భూమిని గట్టిగా తన్నడం, తొడలు, జబ్బలు చరుస్తూ పెద్దగా అరవడం... ఇట్లా రకరకాల విన్యాసాలు 'హక'లో భాగంగా ఉంటాయి. మావోరి ప్రజల సంస్కృతిలో ఈ డ్యాన్స్ అతి ముఖ్యమైనది. ఇప్పటికీ న్యూజిలాండ్ నుంచి వచ్చే ప్రపంచ స్థాయి క్రీడా జట్లు క్రీడ ప్రారంభానికి ముందు 'హక'ను ప్రదర్శిస్తాయి. మొదట్లో ఇది యుద్ధసమయంలో ప్రదర్శించే నృత్యక్రీడే అయినా తరువాత్తరువాత దీన్ని ముఖ్యమైన అతిథులను ఆహ్వానించేటప్పుడు, ఎవరివైనా గొప్ప గొప్ప విజయాలను గుర్తించే సందర్భంలోను, అంత్యక్రియల సమయంలోను దీన్ని ప్రదర్శించడం పరిపాటి అయింది.