ఫులాని అనే జాతి ప్రజల ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి. నైజీరియా, గినియా, బర్కినా ఫసో, కామెరూన్, సెనిగల్ వంటి ఆఫ్రికా దేశాల్లో వీరు విస్తరించి ఉన్నారు. వీరు సంచార జీవులు. నైజీరియాలో ఎక్కువగా కనిపిస్తారు. ఫులా భాషతో పాటు హౌసా, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలను వీరు మాట్లాడుతారు. వీరు ముఖ్యంగా పశువుల కాపర్లు. నైజీరియాలో తమ పశులతో పాటు చాలా భూభాగాన్ని చుట్టివస్తారు. చాలా సంస్కృతులతో వీరికి పరిచయం కలుగుతుంది. అందుకే అనేక భాషల్ని వీరు మాట్లాడగలుగుతారు.
కోటేరు ముక్కు నల్లని ఉంగరాల జుట్టు, పొడవైన దేహాలతో ఉంటారు. ఇటువంటి ఫులాని ప్రజల ఆచార సంప్రదాయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందులో వివాహానికి సంబంధించయితే ఇక చెప్పాల్సిన పనే లేదు.
సాధారణంగా ఫులానీ తెగ ప్రజలు తమ తెగకు సంబంధిచిన వారినే పెండ్లి చేసుకుంటారు. వేరే వారిని చేసుకోరు. అయితే ఇటీవల తాము అనుసరించే ముస్లిం మతాన్ని అనుసరించే హౌసా తెగవారితో వివాహ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అబ్బాయిలు ఇరవై ఏళ్లు దాటిన వెంటనే పెండ్లికి సిద్ధమవుతారు. అమ్మాయిలు ఇరవై ఏళ్ల లోపే పెండ్లాడతారు. తమ మతాచారం ప్రకారం ఒకరి కంటే ఎక్కువ భార్యల్ని కలిగి ఉండవచ్చు. అయితే పోషించే స్థోమత, కోరిక ఉన్నప్పుడే మరో అమ్మాయిని పెండ్లాడతాడు పురుషుడు. వివాహ బంధం చాలా కాలం ఉంటుంది. విడాకులు తీసుకుని విడిపోవటం అరుదుగా జరుగుతుంది. పునర్వివాహాలు కూడా అరుదే. సాధారణంగా భార్యా భర్తల్లో ఎవరో ఒకరు చనిపోయినప్పుడే మరో పెళ్లి చేసుకోవడం చూస్తాం. అదీ అరుదే. మరో గమనించాల్సిన సంగతి ఏమిటంటే భాగస్వామి నుంచి విడిపోయిన తరువాత ఏడాది లోపే మళ్లీ పెండ్లి చేసుకుంటారు.
పులాని ప్రజల్లో కొంతమంది వివాహాలు ముందే నిర్ఱయమై పోతాయి. అంటే ఎవరు ఎవరిని పెండ్లి చేసుకోవాలనేది పెద్దలు ముందే నిర్ణయిస్తారు. గర్భంలో ఉన్న శిశువు కూడా ఎవరిని చేసుకోవాలో ముందే నిర్ణయిస్తారు. ఈ ప్రజలకు వివాహం పవిత్రమైన కార్యం. ప్రతి బాధ్యతాయుతమైన ఫులాని నిర్ణీత కాలంలో పెండ్లిచేసుకోవాలి.
Authorization