ఆఫ్రికాలోని ఒక విభిన్నమైన జాతుల నిలయం చాద్. దాదాపు అరవై ఏళ్లు ఫ్రాన్స్ పాలన లో మగ్గిన దేశం ఇది. నిజానికి దీన్ని ఒక దేశంగా చెప్పుకోవడం ఇబ్బందే. ఎందుంటే అక్కడ ప్రజల్లో జాతీయ సమైక్యతా రాగం అంతగా కనిపించదు. దీనికి కారణం వలస పాలనే. అనేక స్థానిక జాతులు, సంస్కృతులు, సుల్తనేట్లుగా ఉన్న ప్రాంతాలు ఈ విధంగా ఒక దేశంగా ఇప్పుడు మనుగడ సాగిస్తున్నాయి. దాదాపు వంద భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. అరబీ, సారా, ఫ్రెంచ్ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. విద్య, పరిపాలనలో ఫ్రెంచి భాషనే ఉపయోగిస్తారు (ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో). అరబీని సంప్రదాయకంగా వ్యాపార వాణిజ్యాల్లో ఎక్కువగా వాడతారు.
దేశం అంతా ఒకే విధమైన ఆహారపుల అలవాట్లు లేవు. జొన్న లేక చిరుధాన్యాల పిండితో చేసే గంజి లాంటి వంటకం ఒక్కటే దేశ వ్యాప్తంగా కనిపించే కామన్ వంటకం. సాస్, మాంసం, ఎండిన చాపలు, టమాటోలు, ఉల్లిగడ్డలు, మసాలాలతో కలిపి దీన్ని వడ్డిస్తారు. దక్షిణ దేశంలో ఉత్తర దేశానికి భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. దక్షిణాదిలో ఆహారంలో చేపలు భాగంగా ఉండవు. అట్లాగే పాల ఉత్పత్తుల వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అటవీ ఉత్పత్తులు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇవికాక బంగాళా దుంపలు, మొక్కజొన్న, బియ్యం వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటారు.
కుటుంబం
బహుభార్యత్వం (ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం) దక్షిణాదిలో సారా ప్రజల్లోను, ఉత్తరాదిలోని ఇస్లాం మతస్తుల్లోను కనిపిస్తుంది. పెండ్లికూతురికి కొంత సంపద ( కన్యాశుల్కం) ఇచ్చే ఆచారం వీరిలో కనిపిస్తుంది. మొత్తంమీద చూస్తే ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తాయి. తండ్రి నుండి పిల్లలకు వారసత్వహక్కులు లభిస్తాయి. వంశం ప్రాముఖ్యత దేశం ఉత్తరం దక్షిణ భాగాల్లోనూ కనిపిస్తుంది. అయితే పట్టణాల్లో వంశాల ఔచిత్యం సన్నగిల్లుతోంది. వంశాన్ని బట్టి సాంఘిక హోదా, సాంస్కృతిక సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఏ వంశంలో పుట్టారు, ఏ కుటుంబం నుంచి వచ్చాడనేదానిపై పశువుల కాపరుల సంబంధాలు ఆధారపడి ఉంటాయి.
దేశం ఉత్తరం, తూర్పు భాగాల్లో ఇస్లాం మతం ఉంటే, దక్షిణ భాగంలో 30 శాతం వరకు క్రైస్తవులు నివసిస్తున్నారు. మిగిలిన 20 శాతం అంతగా తెలియని స్థానిక మతవిశ్వాసాలను అనుసరించేవారు ఉన్నారు. పూర్వీకులను గౌరవించడం, అనేక అతీత శక్తుల పట్ల నమ్మకం వీరిలో కనిపిస్తుంది. అయితే మిగతా ఆఫ్రికా భూభాగాల్లో కనిపించే మంత్ర తంత్రాల పట్ల నమ్మకం అంతగా కనిపించదు. మతసహనం కనిపిస్తుంది. అంతర్యుద్ధ సమయంలో కూడా మతపరమైన దాడులుు ఎక్కడా చోటుచేసుకోలేదు. అదే ఇక్కడి ప్రజల ప్రత్యేకత. - మౌక్తిక్
Authorization