గోటీలతో అనేక రకాల ఆటలు ఆడటం మనకు తెలిసిందే.ఆ ఆటల్లో రాజు రాణి ఆట ఒకటి. పదిహేను సంవత్సరాల లోపున్న పిల్లలు ఎక్కువగా ఈ ఆట ఆడుకుంటారు. దీన్ని ఎంతమందయినా ఆడుకోవచ్చు. ఆటగాళ్ల సంఖ్యానియమం ఏమీ లేదు. గ్రామం వీధుల్లో ఉదయం, సాయంత్రం ఆడుకునే ఆట.
ప్రతి ఆటగాని దగ్గర ఒక్కొక్క గోటీ ఉండాలి. ఆడే ప్రదేశంలో ఒక చిన్న గుంట (బొద్దీ) తవ్వుతారు. దానికి కొంచెం దూరంలో ఒక గీతను అడ్డంగా గీస్తారు. ఆటగాళ్లందరూ గీత దగ్గర వరుసగా నుంచొని తమ గోటీలను బొద్దీకి దగ్గరగా వేయడంలో పోటీపడతారు. బొద్దీకి దగ్గరగా ఎవరి గోటీ పడుతుందో ఆ గోటీవాడు ముందుగా ఆట ఆడటానికి అర్హుడు. తరువాత బొద్దీకి దగ్గరగా ఎవరి గోటీ ఉంటే వాళ్లు వరుసగా ఆడతారు.
ముందుగా ఆడేవాడు చూపుడు వేలును ఒక కొండీ మాదిరిగా కిందికి వంచి, ఆ వేలితో గోటీని బొద్దీలో పడేలా దేకాలి. గోటీ దేకగానే బొద్దీలో పడితే వెంటనే బొద్దీలో పడిన గోటీని తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని కుడిచేతి బొటన వేలును బొద్దీ ముందు ఉంచి అదే చేయి మధ్యవేలును పైకి లేపి ఉంచి, ఎడమ చేత్తో ఒక గోటీని ఆ వేలు ముందుభాగంలో ఉంచి వేలును వెనక్కి లాగి వదులుతారు. ఇలా వదిలినప్పుడు గోటీ వెళ్లి ఎదుటవాని గోటీని తాకాలి. దీన్నే గోటీ కొట్టడం అంటారు. ఇట్లా గోటీని కొట్టినవాడు రాజు అవుతాడు. ఒకవేళ గోటీ తగలకపోతే ఆ తగలని గోటీవాడు రాణి అవుతాడు. రాణి అయిన గోటీవాడు తన గోటీని బొద్దీలో వేసేవరకు దేకుతూనే ఉండాలి. అతడు తన గోటీని బొద్దీలో వేసి, వేరేవాని గోటీని కొట్టినా, కొట్టకపోయినా అతడు రాజు అవుతాడు. అప్పటి నుంచి అతడు వేరేవాని గోటీని కొట్టుకోవచ్చు. లేదా అతడు గోటీని కొట్టకుండా ఉండి తన గోటీని బొద్దీకి దూరంగా ఎక్కడైనా పెట్టుకొని ఆడవచ్చు. ఆ విధంగా పెట్టుకోవడానికి కారణం తన గోటీని వేరేవారు ఎవరు కొట్టినా అతడు మరలా రాణి అవుతాడు. కాబట్టే మిగిలిన ప్రత్యర్థులకు దొరక్కుండా తన గోటీని దూరంగా పెట్టుకుంటాడు. రాణి అయితే తన గోటీ బొద్దీలో మళ్లీ పడేవరకూ దేకుతూనే ఉండాలి. ఆట ఆడేటప్పుడు రాజు, రాణి హోదా ఉన్న ఆటగాళ్లు భార్యాభర్తల్లా ఒకరినొకరు తిట్టుకుంటారు. ఈ విధంగా ఎంతసేపయినా ఈ ఆట ఆడుకోవచ్చు. దీన్నే రాజా రాణి ఆట అంటారు.
Authorization