భారతదేశంలో ఉన్న ఆదివాసీ తెగల్లో ఓరాన్లు ఒకరు. వీరు సంప్రదాయ సమాజం కంటే కొన్ని విషయాల్లో మెరుగ్గా ఆలోచిస్తున్నారు. పరస్పర అంగీకారంతో స్త్రీపురుషులు పెండ్లి చేసుకుంటారు. స్త్రీకి తనకు నచ్చినవారితో జీవించే స్వేచ్ఛ ఉంది. స్త్రీ పెండ్లి తర్వాత అత్తవారింటికి వచ్చి జీవించడమే కాదు; పురుషుడు కూడా అత్తవారింటికి పోయి జీవించడం కనిపిస్తుంది. ధమ్కురియాలు అనే శిక్షణా సంస్థల ద్వారా చిన్నతనం నుంచే ఆడ, మగ పిల్లలు కలిసిమెలిసి పెరుగుతూ సమాజం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అందువల్లనే అక్కడ స్త్రీలపై అకృత్యాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి ఎన్నో విశేషాలు చెప్పే వ్యాసం 'జాతర' పాఠకులకు ప్రత్యేకం.
తూర్పు, మధ్య భారత ప్రాంతాల్లో ఉన్న తెగల్లోనే కాక మొత్తం భారత్లో ఉన్న ఆదివాసీ తెగల్లో బాగా అభివృద్ధి చెందిన తెగగా ఓరాన్ తెగను చెప్పుకోవచ్చు. ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్కండ్ వంటి రాష్ట్రాల్లో వీరి జనాభా విస్తరించి ఉన్నా , మారిన పరిస్థితుల కారణంగా వీరు ప్రస్తుతం దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలకూ చేరుకున్నారు. భూమి, ఇతర సమస్యల కారణంగా వ్యవసాయాన్ని, సంప్రదాయిక వేటను వదిలి చాలామంది అస్సాం, పశ్చిమ బెంగాల్ టీ తోటల్లో పనిచేసేందుకు వలసపోయారు. అయితే సంప్రదాయం బట్టి వారి జన్మస్థానం మాత్రం ఛోటానాగపూర్ పీఠభూమే. ఇప్పటికీ అక్కడ గణనీయంగానే ఓరాన్లు జీవిస్తున్నారు.
వీరు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ప్రత్యేక భాష మాట్లాడుతారు. తాము ఏ ప్రాంతంలో నివసిస్తారో ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక భాషల నుంచి ఎక్కువ పదాలను ఉపయోగిస్తారు. అందువల్ల హింది, ఒరియా, బెంగాలీ భాషల ప్రభావం వీరి భాషపై కనిపిస్తుంది. ద్రావిడులకు పూర్వ జాతి వారుగా వీరిని భావిస్తున్నారు. మానవ శాస్త్రవేత్తలు వీరిని ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతివారుగా పేర్కొన్నారు. ముదురు గోధుమ రంగు, నల్లని జుట్టు, నల్లని కండ్లు కలిగి ఉండే వీరు మరీ పొట్టిగా కాకుండా, మరీ పొడవుగా కాకుండా మధ్యస్థంగా ఉంటారు.
ఎత్తయిన ప్రదేశాల్లో బంజరుభూములకు దగ్గరగా ఇండ్లు నిర్మించుకుంటారు. వ్యవసాయం అంటే వీరికి ఇష్టం. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. వివాహం తర్వాత ఆడపిల్ల భర్త కుటుంబంతో కలిసి జీవిస్తుంది. అట్లాగే అల్లుడు అత్తగారింటికి పోయి నివసించడమూ కనిపిస్తుంది. వీరిది పితృస్వామ్య వ్యవస్థ. అందుకే పెద్ద కుమారునికి కుటుంబంలో అధికారాలు ఎక్కువగా ఉంటాయి. పనిచేయగలిగిన వయసులో ఉన్న మగవారందరూ పొలంలో పనిచేస్తారు. స్త్రీలు పొలం పనుల్లో పురుషులకు సహకారమందించడంతో పాటు ఇంటిపనులు చేస్తారు.
ఓరాన్లలో రెండు రకాల బంధుత్వాలు ఉంటాయి. ఒకటి రక్త సంబంధం ఉన్నవారితో బంధుత్వం అయితే రెండోది భార్య వైపు బంధుత్వం. వారసత్వం తండ్రివైపు నుంచే గుర్తిస్తారు. ఓరాన్ తెగవారు బహిర్వివాహ పద్ధతి అనుసరించే ఉప తెగలుగా విడిపోయారు. ఈ ఉప తెగల పేర్లు వారి పవిత్ర చిహ్నాల (టోటెమ్స్) మీద ఆధారపడి ఉంటాయి. తిర్కి అనే ఉపతెగ ఒక విధమైన చుంచెలుక నుంచి వచ్చింది. లక్రా అనే పేరు పెద్దపులి నుంచి వచ్చింది. వీరు తమ తెగ చిహ్నంగా ఉన్న జంతువును చంపరు. తినరు. అట్లా చేయడం అపరాధంగా భావిస్తారు. ఈ చిహ్నాలను ప్రతిష్టించి పూజిస్తారు.
ఒక్క భార్యను చేసుకోవడమే సాధారణంగా కనిపిస్తుంది. అయితే బహుభార్యత్వానికీ అనుమతి ఉంది. అయితే ఒకరికంటే ఎక్కువ భర్తలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. తమ ఓరాన్ తెగకి చెందిన వారినే వివాహం చేసుకోవాలి. వేరే తెగలను చేసుకుంటే వారిని తెగ నుంచి వెలివేస్తారు. బాల్య వివాహం కనిపించదు. వధువు తల్లి దండ్రులకు వరుడు పెండ్లికి ముందు కొంతకాలం సేవ చేసి మెప్పించి పిల్లను పెండ్లాడే ఆచారం ఉండేది. ఇప్పుడది అంతగా కనిపించదు. ప్రస్తుతం పరస్పర అంగీకారం ద్వారాను, వధూవరులు ఇంట్లో నుంచి వెళ్లి పోయి వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ తన మరదులను పెండ్లాడే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తారు. మరిది ఆమెను వివాహం చేసుకునే అవకాశం లేనప్పుడే ఆమె ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరిదిని వివాహం చేసుకోననే స్వేచ్ఛ స్త్రీలకు ఉన్నది. విడాకులు ఇవ్వడం సాధారణ విషయమే. భార్యదే తప్పిదం అని రుజువైన సందర్భాల్లో ఆమె, ఆమె తల్లిదండ్రులు భర్త వివాహ సమయంలో ఇచ్చిన కన్యాశుల్కం మొత్తాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే ఆమె మళ్లీ వివాహం చేసుకోవడానికి అర్హత సంపాదిస్తుంది. అయితే మళ్లీ పెండ్లి చేసుకునే అవకాశం లేని వితంతువులు తమకు నచ్చినవారితో కలిసి ఉండటానికి అభ్యంతరం ఉండదు.
కుటుంబ పెద్ద మరణిస్తే అతని కుమారులకు ఆస్తినంతా సమానంగా పంచుతారు. కాని పొలాన్ని పెద్ద కుమారునికి కాస్త ఎక్కువ ఇస్తారు. ఈ సోదరులు ఒకే తల్లి బిడ్డలు కాకపోతే మొదటి భార్య కుమారులకు కాస్త ఎక్కువ వాటా ఇస్తారు. వెలివేసిన కుమారులకు ఆస్తిలో ఎటువంటి వాటా ఉండదు. వెలి ఎత్తివేసి మళ్లీ తమలో కలుపుకున్న తర్వాతే వాటా ఇస్తారు. వైధవ్యం పొందిన స్త్రీకి ఆస్తిలో వాటా ఉండదు. కానీ ఆమెకు తిరిగి వివాహం అయ్యేవరకు పోషణకు తగిన ఏర్పాటు చేస్తారు. పెండ్లికాని కుమార్తెకు పండ్లయేంత వరకు పోషణకు తగిన ఏర్పాటు చేస్తారు. తండ్రి చనిపోయిన సందర్భంలో అన్నదమ్ములందరూ తమ సోదరి వివామ ఖర్చులు పంచుకుంటారు.
మతవిశ్వాసాలు
ఓరాన్ల మత విశ్వాసాలు ప్రకృతి ఆరాధన (ఏనిమిజం) మీద ఆధారపడి ఉన్నాయి. ధర్మేష్ అనే దైవాన్ని వీరు పూజిస్తారు. ధర్మేష్ అంటే సూర్యభగవానుడన్నమాట. వెలుగు కోసం, జీవం కోసం ఈయన్ని పూజిస్తారు. మంత్ర తంత్రాలు, చేతబడులపై విపరీతమైన నమ్మకం చూపిస్తారు.
శృంగార భరితమైన నిద్రాశాలలు, ధమ్కురియాల వల్ల ఓరాన్లు ప్రతేకంగా పేరు తెచ్చుకున్నారు. క్రైస్తవ మత ప్రభావం, ఇతర ప్రభావాల వల్ల ఈ నిద్రాశాలల వైభవం పోయింది. అయినప్పటికీ ఈ నిద్రాశాలలు అనేక సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ధమ్కురియాలు ప్రత్యేకించి మగపిల్లలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఎనిమిదో యేట మగపిల్లలను ఈ నిద్రాశాలల్లో సభ్యులుగా చేరుస్తారు. 'ధంగర్ మహతో' అని పిలిపించుకునే పురుషుడు బాలురకు మత, సామాజిక విధులను బోధిస్తాడు. బర్కీ ధంగ్రిన్ అనే మహిళ బాలురకు, బాలికలకు మత సామాజిక విధులను బోధిస్తుంది. ధమ్కురియాలో సభ్యులైన బాలబాలికలు సేవాకార్యకర్తలుగా కూడా పనిచేస్తారు. పెండ్లి సమయంలో వంటలు చేస్తారు. ఇండ్ల నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తారు. ఇతర చిన్న చిన్న పనులు చేస్తారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు సహాయక కార్యక్రమాలు చేపడతారు. తమ సేవలకు ప్రతిఫలంగా డబ్బులు వస్తే దానిని ధమ్కురియా కోసం వెచ్చిస్తారు. కౌమార దశలోని యువతీయువకులు కలసి నృత్యం చేస్తారు. పాటలు పాడతారు. తమ సాన్నిహిత్యాన్ని వారు ఎంతో ఆనందంగా గడుపుతారు. ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మసలడానికి ఆ వాతావరణం తోడ్పడుతుంది. యువతీ యువకులు ఇట్లా స్వేచ్ఛగా కలిసే అవకాశం ఉన్నందున ఓరాన్లలో మహిళలను కించపరచడం, వారికి వ్యతిరేకంగా నేరాలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. 'కొత్త సంస్కృతి' ఈ ధమ్కురియాలపై ప్రభావం చూపడం వల్ల ధమ్కురియాల వ్యవస్థ నశించిపోయింది. ఇప్పుడు అనేక ఓరాన్ గ్రామాల్లో పాడుపడిపోయిన ధమ్కురియాల అవశేషాలు మాత్రం కనిపిస్తున్నాయి. ధమ్కురియా వ్యవస్థను భారతదేశం మొత్తానికి ఒక ప్రత్యామ్నాయ విద్య, శిక్షణా వ్యవస్థగా స్వీకరించవచ్చు. దానిగురించి రాయాలంటే మరో ప్రత్యేక వ్యాసం అవుతుంది.
సంప్రదాయ మత ఛాందసవాదులు ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడటాన్ని, వారితో కలిసి చదువుకోవడాన్ని వ్యతిరేకిస్తారు. చనువుగా ఉంటే ఆంక్షలు విధిస్తారు. దాదాపు భారత దేశంలో ఉన్న కుటుంబాలు సంప్రదాయ పరాయణత్వానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఈ బంధనాల్లో ఉన్న పిల్లలు పెద్దవారై స్త్రీల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తూ అనేక ఘోరాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఓరాన్ ధమ్కురియా వ్యవస్థను ప్రత్యామ్నాయ వ్యవస్థగా స్వీకరిస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించాలి.
Authorization