భారత్లో ఆడపిల్ల కడుపులో పడినప్పటి నుండి వివిక్ష ప్రారంభమవుతుందనే సంగతి కొత్తదేం కాదు.పెండ్లి అయ్యేవరకు అమ్మ, నాన్న ఆధీనంలో, పెండ్లి అయ్యాక భర్త ఆధీనంలో, వృద్ధాప్యంలో కొడుకుల ఆధీనంలో స్త్రీ ఉండటాన్ని ఒక రివాజుగా చేశారు మనువాదులు. స్త్రీ. ఎప్పుడూ స్వతంత్రంగా ఉండే అవకాశమే లేని సంస్కృతి మనది. సంప్రదాయాలు సంగతి సరే... పాఠ్యపుస్తకాలు కూడా స్త్రీపట్ల వివక్షాపూరితంగానే రూపొందుతున్నాయేమో అనిపిస్తుంన్నది. ఓపాఠ్యపుస్తకంలో అమ్మ ఇల్లు ఊడ్చడం, నాన్న పేపరు చదువుతున్న బొమ్మలు కనిపించాయి. ఈ బొమ్మ ప్రకారం అమ్మాయి అయితే అమ్మ చుట్టూ పనులు చేసుకుంటూ తిరుగుతుంది. అబ్బాయి మాత్రం నాన్న పేపరు చదువుతుంటే ఆయన పక్కన నిలబడి పేపరు చూస్తుంటాడు. ఇవన్నీ చిన్నప్పటి నుండి స్త్రీలు ఏం పనిచేయాలి, పురుషులు ఏంపని చేయాలనే విషయాలను నిర్దేశించి అలవాటుచేసే ప్రయత్నాలే. చిన్నతనంలోనే ఇటువంటి వివక్షను పిల్లలకు అలవాటు చేయడం వల్ల పెరిగి పెద్దవాళ్ళయినా తాము దోపిడీకి, వివక్షకు గురవుతున్న విషయం అర్థం కాదు. ఎవరన్నా తెలియజెప్పడానికి ప్రయత్నించినా... ''ఏముంది ఇదేం కొత్త విషయం కాదుకదా ఎందుకంత వ్యతిరేకత'' అనేంతగా అణకువతనం ఆడవారి నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. పెద్దయినా కూడా అమ్మంటే ఇంటిపని వంటపనిచేయాలని, నాన్నంటే ఇంట్లో ఉంటే పేపరుతోనో, టీవీతోనో కాలక్షేపంచేస్తుంటాడని, బయటకెళితే సంపాదించుకొస్తాడని అవగాహనతో మసలుతూ ఉంటారు. ఈ అవగాహనతోనే పిల్లల్ని కూడా పెంచుతారు.
పిల్లలకు ఆటబొమ్మలను కొనిపెట్టేటప్పుడే వారు ఏం చేయాలో, ఎటువంటి ఆటలు ఆడాలో నిర్దేశించడం కనిపిస్తుంది. అబ్బాయిలకు ఏ బస్సో, కారో, విమానం బొమ్మలో కొనిపెడతారు. అమ్మాయిలకు మాత్రం ఇంట్లో వాడే వంట సామాన్లను పోలిన బొమ్మలు కొనిపెడతారు. వివక్షకు బీజం ఇక్కడే పడుతుందన్నమాట. అబ్బాయిలయితే ఇట్లా ఉండాలని, అమ్మాయిలయితే అట్లా ఉండాలని చెబుతూ కొన్ని లక్షణాలను ప్రతిపాదిస్తూ వారిని ఆ కొలమానాల ప్రకారం పెంచే ప్రయత్నం చేస్తారు. అదేమంటే మన ఆచార సాంప్రదాయాలను ఉటంకిస్తారు. అబ్బాయిలయితే నిస్సిగ్గుగా బయటికి వెళ్ళవచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా తిరగవచ్చు. అమ్మాయిలు మాత్రం సిగ్గు, అణకువ, మర్యాద మట్టసంతో మెలుగుతూ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు బయటికిి వెళ్ళకూడదు. అట్లా చేస్తే సమాజంలో పరువు పోతుందని భయం. పురుషాధిక్య ప్రపంచం నిర్దేశించిన గీతల లోపల ఉంటే ఉన్నంతలో సుఖంగా జీవించడం సాధ్యమవుతుంది అనే భావాన్ని మన ఆచార సాంప్రదాయాలు చెబుతున్నాయి. మరి ఇరవయ్యొకటవ శతాబ్దంలో మిసైల్లా దూసూసుకుపోతున్న భారత దేశంలో ఈ వివక్షాపూరిత ఆచార సంప్రదాయాలకు ఇంకా విలువనిచ్చి కొనసాగించడం సబబేనా!
-మౌక్తిక్
Authorization