ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంస్కృతులు విలసిల్లుతున్నాయి. ఆయా ప్రజల ఆచార సంప్రదాయాలు, నమ్మకాలను తెలుసుకోకుండా వారితో మెలగటం కష్టమే. చైనా, జపాన్ దేశాల్లో ఎవరినైనా ''ఇక్కడికి రా'' అని పిలిచేటప్పుడు చేతి వేళ్లు అన్నింటిని ఉపయోగించి రమ్మని పిలవాలి. అంతే కాని ఏదో ఒక వేలుతో రమ్మని సైగ చేస్తే అది అవమానంగా భావిస్తారు.
మనదేశంలో బస్సో, రైలో ఎక్కి ప్రశాంతంగా ప్రయాణం చేయడం కష్టమే. ఎదుటివారి అవస్థను పట్టించుకోకుండా పెద్దగా అరుస్తూ కబుర్లు చెప్పుకునేవారు చాలామంది కనిపిస్తారు. ఈ అలవాటును దక్షిణ కొరియా వంటి దేశాల్లో కొనసాగిస్తే ఇబ్బందే. అక్కడ పబ్లిక్ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు నిశ్వబ్దంగా ఉండాలి. పెద్దగా మాట్లాడితే వారి సంస్కృతిలో మొరటుగా భావిస్తారు.
జర్మనీలో ఆహారపదార్థాలను ఆరగించడానికి తప్పనిసరిగా తగిన పనిముట్లను ఉపయోగించాలి. అవి చివరికి, పిజ్జాలయినా, వేపుళ్లయినా సరే! అయితే ఒక్క బ్రెడ్‌కు మాత్రం మినహాయింపు ఉంది. దాన్ని చేత్తో తినడానికి అనుమతిస్తారు.
ఆఫ్ఘనిస్థాన్ వంటి ముస్లిం దేశాల్లో ఏం తినాలన్నా కుడిచేత్తోనే తినాలి. ఎడమచేతిని కేవలం బాత్రూం తదితర పారిశుద్ధ్య పనులకు మాత్రమే ఉపయోగిస్తారు. అందుకనే ఎడమచేతిని తినడానికి ఉపయోగించడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తారు.
కెన్యాలో ఎవరింటికైనా అతిథిగా వెళితే భోజనం పెట్టినప్పుడు... వడ్డించిన పదార్థాలన్నింటినీ వదలకుండా తినాలి. అట్లా కాక ఏవైనా వదిలిపెడితే తాము వడ్డించిన పదార్థాలు రుచిగా లేకపోవటం వల్ల వదిలేశారని భావిస్తారు. అదే చైనాలో పెట్టిందల్లా శుభ్రంగా తినేశామనుకోండి ఆతిథ్యం ఇచ్చినవారు తాము పెట్టిన ఆహారం సరిపోలేదుగామోనని భావిస్తారు.
కజకస్థాన్లో అతిథులకు టీ ఇస్తారు. కానీ కప్పు నిండా ఇవ్వరు. సంగం మాత్రమే ఇస్తారు. ఒకవేళ కప్పు నిండా ఇచ్చారంటే ... ఇక టీ తాగి చిత్తగించమని (వెళ్ళిపొమ్మని) అర్థం. తరువాత భోజనం సమయంలో టీ ఇక అవసరం లేదనుకుంటే కప్పును బోర్లించి పెట్టాలి అతిథి..
అజర్బైజాన్లో ఉప్పు కిందపడిపోయిందంటే ఎవరితోనో తగాయిదా వస్తుందని నమ్ముతారు. అట్లా రాకుండా ఉండటానికి ఉప్పు పడిన చోట పంచదారను చల్లుతారు.
కువైట్‌లో ఆతిథ్యం ఇచ్చే వారు లేచి నిలబడ్డారంటే భోజనం అయిపోయిందని భావించాలి.
Authorization