జార్జియాలో రష్యా సరిహద్దుల్లో ఉన్న దేశం. ఎక్కువ మంది జార్జియన్ భాష మాట్లాడుతారు. చదవడం రాయడం, సాహత్య సృష్టికి ఈ భాషనే ఉపయోగిస్తారు. అబ్ఖాజియన్, ఆర్మేనియన్, అజెరి, ఒసెటియన్, రష్యన్ వంటి భాషలు మైనారిటీ భాషలుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో జార్జియన్ భాషకు బదులు రష్యా భాషను ద్వితీయభాషగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు రెండు మూడు భాషలు మాట్లాడటం కనిపిస్తుంది. మతం విషయానికి వస్తే ఎక్కువగా క్రైస్తవ మతమే ఉంది. తరువాతి స్థానం ఇస్లాం ఆక్రమిస్తుంది.
శ్రమ విభజన ప్రత్యేకించి ఆడ మగ మధ్య ఏమీ లేదు. అయితే బాగా కష్టతరమైన పనుల్లో స్త్రీలు తక్కువగా పాల్గొంటారు. స్త్రీలు ఇంటిబాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు రెండూ నిర్వహిస్తారు. జాతీయ సంస్కృతిలో స్త్రీలకు గౌరవనీయమైన స్థానం ఉంది. విడాకుల తరువాత పిల్లలను తీసుకునే హక్కు చట్టసభలు స్త్రీకి కల్పించాయి. మొత్తం మీద ఇంటా బయట పురుషుని ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది.
పెండ్లి స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అరుదుగా గ్రామాల్లో పెద్దలు కుదిర్చిన పెండ్లిళ్లు కనిపిస్తాయి. అవికూడా ముస్లిం కుటుంబాల్లోనే ఎక్కువ. పరస్పర ఆకర్షణతో వివాహాలు జరుగుతాయి. అయితే వయసులో పెద్దవాళ్లు పెండ్లి చేసుకునేటప్పుడు ఆర్థిక పరిస్థితినీ పరిగణనలోకి తీసుకుంటారు. పట్టణాల్లో చిన్న కుటుంబాలే ఉన్నా నాయనమ్మలు, తాతయ్యలు పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకుంటారు. కొండిపాంత గ్రామాల్లో పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తాయి. తండ్రి ఇంటి బాధ్యతను స్వీకరించి కుటుంబాన్ని నడిపిస్తాడు. ఎవరు ఏం పని చేయాలో నిర్ణయిస్తాడు. క్రమంగా యువకులు విడిపోయి సొంత కాపురాలు పెట్టుకుంటారు.
ఇంటి యజమాని వీలునామా రాయకుండా మరణిస్తే ఆస్తి పాస్తులన్నింటినీ అమ్మాయిలు, అబ్బాయిలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా పంచుతారు. ఒకవేళ సంతానం లేకుండా మరణిస్తే దగ్గరి బంధువులకు పంచుతారు.
మూడు నాలుగు తరాల అంతరం ఉన్న బంధువులను కూడా సన్నిహిత బంధువులుగానే పరిగణిస్తారు. వారితో తమ సుఖ దు:కాలు పంచుకుంటారు. వివాహాలు, చావులకు తప్పనిసరిగా హాజరవుతారు. అట్లా హాజరుకాకపోతే ఒప్పుకోరు. బంధురికాలు బలంగా ఉన్నందువల్ల కరువుకాటకాలు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సైతం ప్రజలు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోరు. ఒకరినొకరు ఆదుకోవడం ద్వారా తమ ప్రేమాభిమానాలను ప్రజలు చాటుకుంటారు.
తూర్పు, పశ్చిమ జార్జియాల మధ్య ఆహార వ్యవహారాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. తూర్పు జార్జియాలో శాకాహారాన్ని బాగా ఇష్టపడతారు. దేశం పశ్చిమ భాగంలో స్పైసీగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తింటారు. దేశమంతా వెన్నను బాగా తింటారు. 'కచ్చాపురి' అనే చీజ్ పిజ్జా సాధారణంగా తినే ఆహారం. గోధుమ బ్రెడ్‌ని కూడా బాగా తింటారు. 'ఖింకలీ' అనే మాంసాహారాన్ని బీరుతో కలిపి తీసుకుంటారు.
Authorization