సంస్కృతి అనేది ఏదో ఒక ప్రాంతం, భాషకు సంబంధించిన జీవన విధానం అనుకుంటే తప్పే. అనేక మానవ సమాజాల మధ్య ఏర్పడిన సంబంధాల కారణంగా... ఆచార సంప్రదాయాలు, మతం, ఆహార విహారాలు వంటివి అనేక ఏండ్ల పాటు పరస్పర ప్రభావానికి గురవుతూ వచ్చాయి. అందువల్లనే ఒక ప్రదేశంలో ఉన్న సంస్కృతికి ఖండాంతరాల్లో ఉన్న వేరే సంస్కృతులతో కొన్ని పోలికలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇతర ప్రాంతాల ప్రభావానికి తక్కువగా గురై స్థానికంగా అభివృద్ధి చెందిన మూల సంస్కృతులు ఇతర ప్రాంతాలకు విస్తరించినప్పుడు ఆ సంస్కృతీ వాహకులు తాము వెళ్లిన చోట ఉన్న మూల సంస్కృతి ప్రభావానికి లోనై జీవన రీతులను మార్చుకుంటూ ఉంటారు.
వలస పోయిన జనంతాము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి సంస్కృతి వాసనలను మాత్రం వదులుకోరు. అలాగే మూల సంస్కృతిలో పుట్టి పెరిగిన వారు ఇతర సంస్కృతుల ప్రభావానికి లోనై తమ సంస్కృతికి కొత్త హంగులు దిద్దుకుంటారు. ఆందుకు మంచి ఉదాహరణ భారత దేశం నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన సంస్కృతి ఆనవాలే!
భారతీయ సంస్కృతి ఇతర ఆసియా దేశాలకే కాక ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. తూర్పు సైబీరియా లోని బైకాల్ సరస్సు కావల అనేక ఆశ్రమాల్లో కనిపించే విగ్రహాలు, బొమ్మలు భారతీయ సంస్కృతి అవశేషాలే! ఆ భూభాగానికి కాస్త కింద కనిపించే మంగోలియా రిపబ్లిక్లో వేలాది అనువాద గ్రంథాలు దర్శనమిస్తాయి. ఇవన్నీ మన ప్రాచీన సంస్కృత భాషా గ్రంథాలకు అనువాదాలే. అట్లాగే మహాకాల, కాళి, ఆయుషి, తారాదేవి వంటి దేవతా విగ్రహాలన్నీ భారతీయుల నుంచి గ్రహించినవే.
విదేశాలపై భారతీయ సంస్కృతి ప్రభావం
బాంకాక్‌లోని ఎత్తయిన దేవాలయాలు, థాయి భాషలో కనిపించే సంస్కృత భాషా పదాలు, థాయిలాండ్ నాటకరంగంలో అత్యంత ముఖ్యభాగంగా ఉన్న రామాయణం, రాయల్ కోర్టులో కనిపించే శైవ ఆచార సంప్రదాయాలు... ఇవన్నీ భారత దేశం నుంచి థాయిలాండ్‌కు ప్రవహించిన సాంస్కృతిక ధారలో భాగమే.
మధ్యాసియాలో సంస్కృతంలో కనిపించే రాత ప్రతులు, అరుదైన ఆర్ట్ వర్క్స్, ప్రాకృత భాషలో ఉన్న పరిపాలనకు సంబంధించిన డాక్యుమెంట్స్, అద్భుతమైన మ్యూరల్ పెయింటింగ్స్, ఇతర భౌతిక సాంస్కృతిక సంపద భారతీయ ఆత్మ కలిగినవే.
దూర ప్రాచ్యంలో, విశాలమైన చైనా భూభాగాలు నిక్షిప్తం చేసుకున్న సుసంపన్నమైన ఆర్ట్, సాహిత్యం, తత్వశాస్త్రం... చాలా వరకు ఇండియావే. జపాన్ సంప్రదాయ నాటకరంగంలో ఇప్పటికీ కనిపించే మహాభారతానికి చెందిన కథలు, అక్కడి హోర్యూజి దేవాలయంలో కనిపించే అజంతా చిత్రలేఖన శైలి, సంస్కృత మంత్రాలు... ఇట్లాంటివన్నీ జపాన్ పరిణామక్రమానికి భారతీయ సంస్కృతి ఎట్లా దోహదం చేసిందో చెబుతున్నాయి.
టిబెట్‌లోని వైద్యం, ఖగోళం, వ్యాకరణం, తత్వశాస్త్రానికి చెందిన చాలా గ్రంథాలు భారతదేశం నుంచి వెళ్ళినవే.
Authorization