ఒకప్పుడు వేటాడటం మనిషి ఆహారపు అవసరం. ఇప్పడు పంటలు పండించడం, కోళ్ళు, జంతువుల ఫారాలు పెట్టడం అలవాటయిన తరువాత అలనాటి అవసరమైన వేట ఇప్పుడు ఆటై కూర్చుంది. ఒకప్పుడు యుద్ధం అంటే బాహాబాహీ తలపడటమే. కాదంటే కత్తులు, ఈటెలు, బాణాలను ప్రయోగించడమే.. కానీ ఇప్పుడు యుద్ధం అంటే తుపాకులు, మిస్సైల్స్, బాంబులు వేసుకోవడమే కదా. అందుకే అలనాటి యుద్ధ క్రియలన్నీ ఇప్పుడు క్రీడలుగా మారిపోయాయి. రెజ్లింగ్, జావిలిన్ త్రో, ఆర్చరీ వంటివి ఇందుకు మంచి ఉదాహరణలు. యుద్ధ తంత్రాల నుంచే చెస్ ఆట పుట్టిన విషయం అందరికీ తెలిసిందే.
పల్లెటూళ్ళలో చెరువులు, బావులు, కాలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈత వెయ్యడం పిల్లల్లో చాలామందికి వచ్చేది. ఒక్క సారి ఈత నేర్చుకున్నారంటే ఇక అనేక రకాల ఫీట్లు చేస్తూ ఆటలు ఆడటం ప్రారంభిస్తారు. కుక్క ఈత, బాల ఈత, నిలువు ఈత, పీనుగీత, నీటిలోపల మునిగి ఈదడం వంటి అనేక ఈతలు వేస్తూ పిల్లలు ఆడుకునేవారు. ఇప్పుడు మరికొన్ని కొత్త ఈతలూ వచ్చి చేరాయి. కానీ పాత ఈతలు కొన్ని మాయమయ్యాయి. ఈత వెయ్యడం వచ్చిన వారు వేగంగా వెళ్ళి నీటి మీద తేలే కర్ర పుల్లనో, రబ్బరు బాలునో తీసుకు వచ్చి పందెం గెలుచుకునే ఆట సాధారణంగా పల్లెటూరి పిలగాళ్ళు ఆడతారు. పట్టణాలో స్మిమ్మింగ్ పూల్స్ పెరిగి ఈతలో మంచి శిక్షణ పెరగడంతో జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీలకూ వెళ్ళే అవకాశం కలుగుతోంది. పూర్వం చేపలు పట్టడానికి, లోతైన నదులను దాటడానికి ఉపయోగపడిన ఈత ఇప్పుడు ఆటగా మారిపోయింది.
Authorization