కోస్టారికా మధ్య అమెరికా దేశాల్లో ఒకటి. ఇక్కడ ఉండే మూలవాసులను అమెరిండియన్స్ అంటారు. వీరు ప్రపంచాన్ని 'సిబూ' (దేవుడు) సృష్టించాడని, మంచిఆత్మలు, చెడు ఆత్మలు సృష్టిని నియంత్రి స్తాయని నమ్ముతారు. బృజులు అనే సంప్రదాయక మంత్రగత్తెలు... మూలికలు, మంత్రాలతో రోగాలను నయం చేస్తారని విశ్వసిస్తారు. ఇట్లా మంత్రగత్తెలుగా వ్యవహరించేవారికి కనీసం యాభయ్యేళ్ల వయసన్నా ఉండాలనేది ఒక నియమం.
క్రైస్తవ సన్యాసులు దేవునికి మనుషులకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. తమ ఇండ్లలో ఈ సన్యాసుల విగ్రహాలు, బొమ్మలు పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందనేది మరో నమ్మకం.
తొంభరు శాతం మంది కేథలిక్ మతాన్ని అవలంభిస్తారు. నూతన శిశువు తల్లి దండ్రులు... బంధువులు, ఇరుగు పొరుగువారి నుండి బహుమతులు పొందుతారు. శిశువులను తల్లిదండ్రులు సంప్రదాయ బద్ధంగా చర్చికి తీసుకువెళ్ళి బాప్టిజం ఇప్పిస్తారు. మొదటి జన్మదినం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఏడేండ్ల వయసులో పిల్లలు స్కూల్లో ప్రవేశిస్తారు. మిడిల్, హైస్కూల్ చదువుతున్న అమ్మాయి 15వ ఏట ప్రవేశించడం కూడా ప్రత్యేకమైన సందర్భం (క్విన్స్)గా భావిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద విందు ఏర్పాటవుతుంది. భార్యాభర్తలు తమ 25వ, 50వ వివాహ దినోత్సవాలను జరుపుకోవడం ఆచారంగా వస్తున్నది. ఇక అంత్య క్రియల సంగతికొస్తే... చనిపోయిన 24గంటల్లో అంత్యక్రియలు జరిపించాలి. ఎప్పుడు వీలుంటే అప్పుడు చర్చిలో ప్రార్థనలు నిర్వహించి మృత దేహాన్ని స్మశానానికి తరలిస్తారు.
ఉమ్మడి కుటుంబం కోస్టారికా సమాజ ప్రాథమిక లక్షణంగా చెప్పవచ్చు. ఆదివారాల్లో బంధుజనం ఇండ్లను సందర్శించడం, ప్రత్యేక సందర్భాల్లో చుట్టాలను కలుసుకోవడం ఇక్కడి సంస్కృతిలో భాగం. ఒకప్పుడు పెద్దగా విడాకులు ఉండేవి కాదు కానీ మారిన పరిస్థితుల్లో విడిపోయే భార్యాభర్తలు ఎక్కు వగా కనిపిస్తున్నారు. గృహ హింసకు గురయ్యే స్త్రీలు చాలామంది కనిపిస్తారు. కోస్టారికా ప్రజలు తినే ఆహారంలో ఎక్కువగా అన్నం, బీన్స్, బ్రెడ్, స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ ఉంటాయి. అక్కడి సంప్రదాయ వంటకం 'ఒల్ల డి కమే' బీఫ్, ఆలు, మొక్కజొన్న, అరటి, ఇతర కూరగాయల మిశ్రమంతో తయారవుతుంది.
-భూపేంద్ర
Authorization